రేపే పరిషత్‌ కౌంటింగ్‌

ABN , First Publish Date - 2021-09-18T03:42:43+05:30 IST

ఏడాదిన్నరగా సాగిన పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. పరిషత్‌ ఓట్ల లెక్కింపునకు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ పచ్చజెండా ఊపడంతో ఎన్నికల కమిషన్‌ ఆదివారం కౌంటింగ్‌ నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది.

రేపే పరిషత్‌ కౌంటింగ్‌
బ్యాలెట్‌ బాక్సులు ఉన్న స్ట్రాంగ్‌రూం

అభ్యర్థుల్లో ఉత్కంఠ

ఉదయగిరి రూరల్‌, సెప్టెంబరు 17: ఏడాదిన్నరగా సాగిన పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. పరిషత్‌ ఓట్ల లెక్కింపునకు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ పచ్చజెండా ఊపడంతో ఎన్నికల కమిషన్‌ ఆదివారం కౌంటింగ్‌ నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అధికారులు కౌంటింగ్‌కు సర్వం సిద్ధం చేస్తున్నారు. కౌంటింగ్‌ దగ్గర పడడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఐదు నెలులగా వాటి సంగతి మరిచిన వారు ప్రస్తుతం లెక్కలు వేయడంలో బిజీబిజీగా ఉన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో 83 ఎంపీటీసీ స్థానాలకును 26 ఏకగ్రీవంగా కాగా 57 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా 141 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే ఎనిమిది జడ్పీటీసీ స్థానాలకుగాను సీతారామపురం, జలదంకి మండలాల స్థానాలు ఏకగ్రీవం కాగా ఉదయగిరి, వింజమూరు, దుత్తలూరు, కొండాపురం, కలిగిరి, వరికుంటపాడు మండలాల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో పోటీ చేసిన వారు అధికంగా వలస వాసులు ఉండడంతో ఆయా ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు చేరుకొంటున్నారు. ఉదయగిరి, వింజమూరు, సీతారామపురం మండలాలకు చెందిన స్థానిక మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కలిగిరి, జలదంకి, కొండాపురం, వరికుంటపాడు, దుత్తలూరు మండలాలకు సంబంధించి కలిగిరి ఆదర్శ పాఠశాలలో కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. ఐదు నెలలుగా స్ట్రాంగ్‌రూంలకే పరిమితమైన బ్యాలెట్‌ బాక్సులు ఆదివారం నిర్వహించే కౌంటింగ్‌లో ఎవరి విజేతలుగా నిర్ణయిస్తాయో వేచి చూడాల్సిందే.

Updated Date - 2021-09-18T03:42:43+05:30 IST