8న పరిషత్‌ పోరు

ABN , First Publish Date - 2021-04-02T07:28:16+05:30 IST

గత ఏడాది ప్రారంభించి వాయిదా వేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఈ నెల 8న నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నిర్ణయించింది...

8న పరిషత్‌ పోరు

  • 10న కౌంటింగ్‌, ఫలితాలు
  • బాధ్యతలు స్వీకరించిన రోజే కమిషనర్‌ నీలం సాహ్ని నిర్ణయం
  • సీఎస్‌, అధికారులతో భేటీ.. కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌
  • గత మార్చిలో ఆగిన చోట నుంచే మళ్లీ ఎన్నికలపై షెడ్యూల్‌ జారీ
  • సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొన్న 4 వారాల కోడ్‌ పరిస్థితి ఏంటి?


రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని  గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. వెంటనే... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమెతో భేటీ అయ్యారు. సాయంత్రం ఆమె కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాత్రి... పరిషత్‌ పోరుకు తెర లేపుతూ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఒకే రోజు... అంతా చకచకా జరిగిపోయింది!


అమరావతి, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): గత ఏడాది ప్రారంభించి వాయిదా వేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఈ నెల 8న నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నిర్ణయించింది. నూతన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన నీలం సాహ్ని ఉదయం బాధ్యతలు స్వీకరించి, సాయంత్రానికల్లా ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడం గమనార్హం. నిరుడు మార్చిలో ఎన్నికల ప్రక్రియ ఎక్కడ నిలిచిపోయిందో.. అక్కడి నుంచే తిరిగి కొనసాగించేందుకు షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఇక ఎన్నికలు నిర్వహించడమే మిగిలి ఉంది. ఈ నెల 8న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. ఎక్కడైనా రీపోలింగ్‌ అవసరమైతే ఆ మరుసటి రోజే.. 9వ తేదీన జరుపుతారు. 10వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. కౌంటింగ్‌ పూర్తికాగానే ఫలితాలు ప్రకటిస్తారు. ఎక్కడైనా ఎంపీటీసీ, జడ్పీటీసీలు కోర్టు వివాదంలో ఉండి స్టే కొనసాగుతుంటే అలాం టి చోట ఎన్నికలు చేపట్టరు. ఎక్కడైనా అభ్యర్థులు చనిపోయి ఉండి, వారు గుర్తింపు పొందిన, రిజిస్టర్‌ అయిన రాజకీయ పార్టీలకు చెందిన వారైతే అలాంటి చోట్ల మళ్లీ ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు.




గత ఏడాది నుంచి..

రాష్ట్రంలో గత ఏడాది మార్చి 7న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మార్చి 14న ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించారు. అయితే కొవిడ్‌ తీవ్రత దృష్ట్యా అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల పాటు వాయిదా వేశారు. ఆ తర్వాత కరోనా మరింత విజృంభిస్తుండడంతో వాయిదాను కొనసాగిస్తూ వచ్చారు. క్రమంగా జనజీవనం మెరుగుపడుతుండడంతో ఎస్‌ఈసీ ఈ ఏడాది ఫిబ్రవరి 9 నుంచి 21 మధ్య నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. తర్వాత మున్సిపల్‌ ఎన్నికలు చేపట్టారు. వీటన్నిటినీ ప్రక్రియ ఎక్కడ నిలిచిపోయిందో అక్కడ నుంచి ప్రారంభించి మార్చి 18లోపు పూర్తి చేశారు. కొత్త కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న నీలం సాహ్ని.. పరిషత్‌ ఎన్నికలు తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌తో పాటు పోలీసు, పంచాయతీరాజ్‌, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా యంత్రాంగమంతా ఎన్నికలకు సంబంధించి సర్వసన్నద్ధంగా ఉందని అధికారులు సీఎ్‌సకు తెలిపారు. ఆ తర్వాత కమిషనర్‌ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జడ్పీ సీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆగిన చోటనుంచే పరిషత్‌ ఎన్నికలను ప్రారంభించి పూర్తిచేయాలని కమిషనర్‌ నిర్ణయం తీసుకున్నారు.


కోడ్‌ పట్టించుకోరా..?

కొవిడ్‌ కారణంగా గత మార్చిలో అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ  ఎన్నికల వాయిదా వేయడాన్ని సవా ల్‌ చేస్తూ రాష్ట్రప్రభుత్వం హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటీషన్లు వేసింది. దీనిపై పరిషత్‌ ఎన్నికలు ఎప్పుడు తిరిగి ప్రారంభించినా నాలుగు వారాలు కోడ్‌ అమలు చేసి ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇటీవల నిమ్మగడ్డ ఉత్తర్వులు జారీచేస్తూ.. తాను మార్చి నెలాఖరుకు పదవీవిరమణ చేస్తున్నందున 4 వారాల కోడ్‌ అమలు చేసేందుకు సమయం లేదని.. ఆ కారణంగానే ఎన్నికలు నిర్వహించలేకపోతున్నానని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు ప్రారంభించినా కోడ్‌ నాలుగు వారాల పాటు అమలు చేయాల్సిందేనని అందరూ భావిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్‌ ఒక్కరే పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉందని చెబుతూ వస్తున్నారు. చివరకు ఆయన అన్నట్లే.. వారం రోజుల్లో ఎన్నికలు జరుపబోతున్నారు.


కమిషనర్‌గా నీలం బాధ్యతల స్వీకారం

అంతకుముందు గురువారం రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 9.30 గంటలకు విజయవాడ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పచెప్పిన గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర, జిల్లా అధికార యంత్రాంగం సహకారంతో స్థానిక ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు. ఐదేళ్లపాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. అనంతరం ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్‌ వైవీ రావు, వీవీఎంకే నాయుడు తదితరులు కొత్త కమిషనర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.   


కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వండి: టీడీపీ లేఖ

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగడానికి వీలుగా కొత్త నోటిఫికేషన్‌ జారీ చేయాలని టీడీపీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కొత్త కమిషనర్‌ నీలం సాహ్నికి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య గురువారం లేఖ రాశారు. గత ఏడాది మార్చి నెలలో ఈ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ జరిగినప్పుడు అధికార పార్టీ కనీవినీ ఎరుగని రీతిలో భయోత్పాత వాతావరణం సృష్టించి పెద్ద సంఖ్యలో బలవంతపు ఏకగ్రీవాలను సాధించుకుందని తెలిపారు. 2014 ఎన్నికల్లో కేవలం 2శాతం ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమైతే ఈసారి 24 శాతం అయ్యాయని, జడ్పీటీసీలు గతంలో కేవలం 0.09 శాతం ఏకగ్రీవం కాగా.. ఈసారి 19 శాతం అయ్యాయని వివరించారు. ‘కొంత మంది అధికారులను లోబర్చుకొని అధికార పార్టీ భయోత్పాత చర్యలతో ఈ ఏకగ్రీవాలను సాధించుకుంది. కొందరు అధికారులు అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగి ఇతర పార్టీల అభ్యర్థులను తిరస్కరించారు. ఈ ఘటనలపై ఎస్‌ఈసీకి అనేకసార్లు ఫిర్యాదు చేశాం. ఈ పరిస్థితుల్లో కొత్త నోటిఫికేషన్‌ ఇస్తేనే న్యాయం జరుగుతుంది’ అని పేర్కొన్నారు.



నేటి ఎస్‌ఈసీ భేటీబహిష్కరణ 

తీర్పు రాకముందే ఎన్నికలపై నిర్ణయమా?: పవన్‌

పరిషత్‌ ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి నిరసనగా శుక్రవారం నిర్వహించే అఖిలపక్ష సమావేశాన్ని జనసేన బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. ‘రెండో తేదీన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేశాం.. దానికి రావాలని గురువారం సాయంత్రం ఆహ్వానాన్ని పంపిన ఎస్‌ఈసీ.. రాత్రయ్యే సరికి ఎన్నికలను పాత నోటిఫికేషన్‌ ప్రకారం కొనసాగిస్తామని, ఈ నెల 8న పోలింగ్‌, 10న ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించడం అప్రజాస్వామికం. ఈ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని జనసేన హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు రాక ముందే ఎస్‌ఈసీ ఇటువంటి దురదృష్టకరమైన నిర్ణయం తీసుకోవడాన్ని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తొందరపాటు నిర్ణయం అధికార పార్టీకి లబ్ధి చేకూర్చడానికే’ అని ధ్వజమెత్తారు.


Updated Date - 2021-04-02T07:28:16+05:30 IST