షాపింగ్‌ కాంప్లెక్స్‌ అద్దె బకాయిలు రూ. 50 లక్షలు

ABN , First Publish Date - 2022-09-26T05:56:21+05:30 IST

సంగారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయ ఆవరణ, జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల వద్ద ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌ ద్వారా జడ్పీకి రావాల్సిన అద్దె బకాయిలు రూ. అరకోటికి పైగా పేరుకుపోయాయి. జిల్లాకేంద్రంలోని ప్రధాన రహదారి పక్కనే నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఉన్న బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో, జడ్పీ కార్యాలయ ఆవరణలోని ఖాళీ స్థలంలో ఇరవై ఏళ్ల కిందట షాపింగ్‌ కాంప్లెక్స్‌లు నిర్మించారు.

షాపింగ్‌ కాంప్లెక్స్‌ అద్దె బకాయిలు రూ. 50 లక్షలు
సంగారెడ్డిలో జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలోని షాపింగ్‌ కాంప్లెక్స్‌

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, సెప్టెంబరు 25 : సంగారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయ ఆవరణ, జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల వద్ద ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌ ద్వారా జడ్పీకి రావాల్సిన అద్దె బకాయిలు రూ. అరకోటికి పైగా పేరుకుపోయాయి. జిల్లాకేంద్రంలోని ప్రధాన రహదారి పక్కనే నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఉన్న బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో, జడ్పీ కార్యాలయ ఆవరణలోని ఖాళీ స్థలంలో ఇరవై ఏళ్ల కిందట షాపింగ్‌ కాంప్లెక్స్‌లు నిర్మించారు. ఈ రెండు ప్రాంతాల్లో 28 దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా వచ్చే అద్దెను జిల్లా పరిషత్‌ జనరల్‌ ఫండ్‌లో జమ చేస్తున్నారు. ఈ నిధులను జిల్లాలోని ఆయా మండలాల్లో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి వెచ్చిస్తున్నారు. బాలికల ఉన్నత పాఠశాల, జడ్పీ కార్యాలయ ఆవరణలో నిర్మించిన కాంప్లెక్స్‌లోని 28 షాపులను 2013లో టెండరు ద్వారా నెలవారీ అద్దె చెల్లించే ప్రాతిపాదికన కేటాయించారు. 28 షాపుల నుంచి ప్రతీనెల రూ.2,71,321 జిల్లా పరిషత్‌ జనరల్‌ ఫండ్‌కు చలాన్‌ రూపంలో చెల్లించడం జరుగుతున్నది. షాపులను అద్దెకు తీసుకుని వ్యాపారాలు సాగిస్తున్నవారు అద్దె చెల్లించడంలో నాలుగైదు నెలల పాటు జాప్యం చేస్తున్నారు. జిల్లా పరిషత్‌ నోటీసులు జారీ చేస్తేనే అద్దె చెల్లిస్తున్నారు. అప్పుడు కూడా బకాయిలు పూర్తిగా చెల్లించకుండా కొంత బకాయి ఉంచుతున్నారని అధికారులు తెలిపారు. వ్యాపారాలు బాగానే జరుగుతున్నా కొందరు వ్యాపారులు కావాలనే జాప్యం చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ నెల ఒకటో తేదీ నాటికి జడ్పీకి రావాల్సిన షాపింగ్‌ కాంప్లెక్సుల అద్దె రూ.54,85,247 బకాయి ఉన్నది. ఈ మొత్తం గత రెండు సంవత్సరాలలోనే పేరుకపోయాయి. కరోనా కారణంగా వ్యాపారాలు సక్రమంగా సాగలేదని వ్యాపారులు అద్దె చెల్లింపులో జాప్యం చేస్తున్నారని జిల్లా పరిషత్‌ అధికారులు తెలిపారు. షాపుల యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చి బకాయిలు వసూలు చేస్తామని పేర్కొన్నారు.

Updated Date - 2022-09-26T05:56:21+05:30 IST