వాడీవేడిగా జడ్పీ సర్వసభ్య సమావేశం

ABN , First Publish Date - 2022-09-25T05:57:30+05:30 IST

ఏలూరులోని జడ్పీ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం వాడీవేడిగా కొనసాగింది.

వాడీవేడిగా జడ్పీ సర్వసభ్య సమావేశం
మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌ శ్రీనివాస్‌

ఏలూరుసిటీ, సెప్టెంబరు 24: ఏలూరులోని జడ్పీ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం వాడీవేడిగా కొనసాగింది. ప్రతి పక్ష టీడీపీ, జనసేన సభ్యులు లేవనెత్తిన అంశాలు, చేసిన వ్యాఖ్యలపై అధి కార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ పేరు మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు టీడీపీ నేత, ఆచంట జడ్పీటీసీ సభ్యుడు యు. సురేష్‌బాబు ప్రస్తావన తేవడంతో .. సభలో రాజకీయ అంశాలు మాట్లాడటమేమిటని.. అధికార జడ్పీటీసీ సభ్యులు మూకుమ్మడిగా విమర్శించారు. దీనిపై ఎమ్మెల్సీ షేక్‌సాబ్జీ కలుగజేసుకుని ఇరుపక్షాలకు సర్దిచెప్పటంతో వివాదం సద్ధుమణిగింది. చైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ అధ్యక్షత వహించారు. జగనన్న ఇళ్ల నిర్మాణంపై అధికారులు, ప్రజాప్రతినిధులు ఎక్కువ దృష్టిపెట్టి , పేదల సొంతింటి కల సాకారం చేయాలని చైర్మన్‌ సూచించారు. జిల్లా పరిషత్‌ పాలక వర్గం బాధ్యతలు చేపట్టి సంవత్సర కాలం పూర్తయిందని , ఈ సమయంలో జిల్లా అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు ఎంతో సహకారం అందించారన్నారు. రానున్న కాలంలో 15వ ఆర్థిక సంఘ నిధులు మరింత ఎక్కువగా తీసుకువ చ్చేందుకు కృషి చేస్తామన్నారు. తద్వారా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 48 మండలాలను అభివృద్ధి పథంలో నడిపిస్తా మన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌బాబు మాట్లాడుతూ జడ్పీ సమావేశంలో సభ్యులు లేవనెత్తిన అంశాలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని వారికి అందించటంతో పాటు అందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలన్నారు. ఽధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇంకా రూ. 17 కోట్లను రెండు, మూడు రోజుల్లో సంబంధిత రైతుల ఖాతాల్లో జమ చేయటం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జి మాట్లాడుతూ నాడు–నేడుతో పాఠశాలల్లో సౌకర్యాల కల్పనతో పాటు విద్యార్థుల హాజరు సంఖ్య పెరిగిందన్నారు. జడ్పీలో నాన్‌ టీచింగ్‌ సిబ్బంది కొరత ఉందన్నారు. ఇక్కడ పనిచేసే సిబ్బందిని ఇతర చోట్లకు డిప్యూటేషన్‌పై వేయకుండా వెనక్కి తీసుకోవాలన్నారు.

సకాలంలో ధాన్యం సొమ్ములు చెల్లించాలి : టీడీపీ


 ఆరుగాలం కష్టపడి వరిని పండించిన రైతులకు కొనుగోలు కేంద్రాలలో సకాలంలో సొమ్ములు చెల్లించకపోవటం వల్ల ప్రైవేట్‌ అప్పులు చేయాల్సి వస్తోందని ఆచంట జడ్పీటిసీ సభ్యుడు సురేష్‌ బాబు సభలో విమర్శించారు. ప్రభుత్వం ఆక్వా రైతులకు పరిమితులు లేకుండా విద్యుత్‌ సబ్సిడీలను కొన సాగించాలని కోరారు. ఫీడ్‌ కార్పోరేషన్‌ ఏర్పాటు చేసినా రోజురోజుకు ఆక్వా ఫీడ్‌ ధరలు పెరిగిపోతున్నాయని , దీనివల్ల రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారన్నారు. జనసేనకు చెందిన వీరవాసరం జడ్పీటీసీ సభ్యుడు జయ ప్రకాష్‌నాయుడు తన మండలంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా... తనకు తెలియటం లేదని , ప్రొటోకాల్‌ పాటించటం లేదని చెప్పటంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య గొడవ జరిగింది. అంతకుముందు పలువురు జడ్పీటీ సీలు పలు అంశాలపై సమగ్ర చర్చ జరిపారు. పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌, జిల్లా పంచాయతీ శాఖ , విద్యుత్‌ శాఖ, ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బి, ఆరోగ్యశాఖ, హౌసింగ్‌, వ్యవసాయ శాఖ పౌరసరఫరాల శాఖ, డిఆర్‌డిఏ, తదితర శాఖల ప్రగతిని సమీక్షించారు.  సమావేశంలో జిల్లా పరిషత్‌ సిఇఓ కేవీఎస్‌ఆర్‌ రవికుమార్‌, ఏపి క్షత్రీయ కార్పోరేషన్‌ చైర్మన్‌ పాతపాటి సర్రాజు,ఏపి శెట్టిబలిజ కార్పొరేషన్‌ చైర్మన్‌ గుబ్బల తమ్మయ్య , పలువురు జడ్పీటీసీలు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-25T05:57:30+05:30 IST