సమస్యలపై ప్రజాప్రతినిధుల గళం

ABN , First Publish Date - 2022-07-03T06:23:07+05:30 IST

జిల్లాలోని సమస్యలపై ప్రజాప్రతినిధులు ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో గళమెత్తారు.

సమస్యలపై ప్రజాప్రతినిధుల గళం
వివరాలు వెల్లడిస్తున్న సీఐ జీడీ బాబు

- అధికారుల తీరుపై అసంతృప్తి

(పాడేరు-ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని సమస్యలపై ప్రజాప్రతినిధులు ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో గళమెత్తారు. అధికార పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్‌పర్సన్‌, ట్రైకార్‌ చైర్మన్‌, పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు సైతం సమస్యలు పరిష్కరించాలని అధికార యంత్రాంగాన్ని డిమాండ్‌ చేశారు. అరకులోయ ఎంపీ మాధవీ మాట్లాడుతూ కొయ్యూరు మండలం వెలగలపాలెం, కొత్తపాలెం గ్రామాల్లో తాగునీటి పథకాలు పాడైపోయి జనం ఇబ్బందులు పడుతున్నారని, మరుమ్మతులు చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో సరైన రీతిలో వైద్య సేవలు అందాలంటే ఆశ కార్యకర్తలకు తగిన శిక్షణ అందించాలన్నారు. కొయ్యూరు నుంచి చింతపల్లి వచ్చే మార్గాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. ట్రైకార్‌ చైర్మన్‌ సతకా బుల్లిబాబు మాట్లాడుతూ గ్రావెటీ నీటి పథకాల నిర్మాణాలు అనేక చోట్ల అసంపూర్తిగా ఉంటున్నాయని, దీంతో గిరిజనులు కలుషిత నీటిని సేవిస్తూ అనారోగ్యం పాలవుతున్నారన్నారు. గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు, సిబ్బందిని నియమించాలని కోరారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ ఏజెన్సీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం పూర్తి స్థాయిలో మందులు ఉండడం లేదన్నారు. అలాగే రెగ్యులర్‌ ఎంఈవోలు లేకపోవడంతో గిరిజన ప్రాంతంలో విద్యావ్యవస్థపై పర్యవేక్షణ కొరవడిందన్నారు. విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని, వచ్చే విద్యా సంవత్సరంలో మెరుగైన ఫలితాలు వచ్చేలా అధికారులు ప్రణాళికలు రూపొందించాలన్నారు. విద్యుత్‌ శాఖ అధికారుల తీరు బాగోలేదని, ముంచంగిపుట్టులో వైఎస్సార్‌ కాలనీ, బంగారుమెట్ట పంచాయతీలో మూడు గ్రామాలకు విద్యుత్‌ సదుపాయం కల్పించాలని కోరితే పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటికి ఎప్పుడు విద్యుత్‌ సదుపాయం కల్పిస్తారని అధికారులను నిలదీశారు. పాడేరు ఘాట్‌ రోడ్డులో ఇరువైపులా ప్లాస్టిక్‌ కవర్లు వేసుకుని అటవీ ఫలాసాయాన్ని విక్రయిస్తున్న గిరిజన రైతులు, నిరుద్యోగ యువతకు అటవీ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అది పద్ధతికాదన్నారు. ఆమెతోపాటు పెదబయలు జడ్పీటీసీ సభ్యుడు కూడ బొంజుబాబు అనిల్‌ నీరుకొండ ఆస్పత్రిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 

స్థానిక ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కొయ్యూరు మండలం పలకజీడి, మఠంభీమవరం పరిధిలోని గిరిజనులకు వైద్య సేవలందించడానికి  పలకజీడి గ్రామంలో మినీ పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలని సూచించారు. చర్మ వ్యాధులకు ఆయింట్‌మెంట్లు, చిన్నపిల్లల సిరప్‌లు ఆస్పత్రుల్లో అందుబాటులో లేవన్నారు. చిన్న ఇల్లున్న గిరిజనులకు సైతం వేలల్లో విద్యుత్‌ బిల్లులు వస్తున్నాయని, దీంతో వారంతా ప్రభుత్వ పథకాలకు అనర్హులైపోతున్నారని, వాటిని సరిచేయాలని విద్యుత్‌ శాఖాధికారులను ఆదేశించారు. గిరిజన పల్లెల్లో ఇళ్లపై ఉన్న విద్యుత్‌ వైర్లు, తుప్పుపట్టిన విద్యుత్‌ స్తంభాలను మార్చాలన్నారు. ఏజెన్సీలో కాఫీ ప్లాంటేషన్లకు రైతులకు చెల్లింపు చేయలేదని గిరిజన రైతులు ఫిర్యాదులు చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుల పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయని, భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు గ్రామాలకు వెళ్లినప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులకు కనీసం సమాచారం ఇవ్వడం లేదన్నారు. డుంబ్రిగుడ మండలం కితలంగి పంచాయతీ పరశీల గెడ్డపై వంతెన నిర్మాణం చేపట్టాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్య సేవలు అందకపోవడంతో గిరిజనులు ప్రైవేటు వైద్యులను ఆశ్రయించి ఇబ్బందులు పడుతున్నారని కొయ్యూరు జడ్పీటీసీ సభ్యుడు వారా నూకరాజు తెలిపారు. జి.మాడుగుల మండలం మారుమూల ప్రాంతాల్లోని గెడ్డలపై వంతెనలు నిర్మించాలని జీకేవీధి జడ్పీటీసీ సభ్యురాలు శివనాగరత్నం కోరగా, మారుమూల ప్రాంతాల్లో దోమల మందు స్ర్పేయింగ్‌, వైద్య సేవలు సక్రమంగా అందించాలని జి.మాడుగుల జడ్పీటీసీ సభ్యురాలు మత్స్యరాస వెంకటలక్ష్మి సూచించారు. రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు మంజూరు కాకపోవడంతో పనులు అసంపూర్తిగా ఉండిపోతున్నాయని చింతపల్లి జడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అనంతగిరి మండలంలోని ఎన్‌ఆర్‌పురం, రొంపల్లి పంచాయతీల్లో తొమ్మిది గ్రామాలు విద్యుత్‌ సదుపాయం లేక అంధకారంలో ఉన్నాయని ఎంపీపీ శెట్టి నీలవేణి తెలిపారు. ఆయా గ్రామాలకు విద్యుత్‌ సదుపాయం కల్పించాలని ఆమె డిమాండ్‌ చేశారు. తమ మండలంలో పినకోట పీహెచ్‌సీ డాక్టర్‌ పనితీరు బాగోలేదని ఆమె తెలపగా, ఆయనను సరెండర్‌ చేస్తున్నామని ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ పేర్కొన్నారు. కొయ్యూరు మండలం గంగవరం రోడ్డుకు అటవీ ఆంక్షలు తొలగించి రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఎంపీపీ రమేశ్‌బాబు కోరారు. చింతపల్లి మండలంలో ఆక్రమణలకు గురైన రెండు ఎకరాల అటవీ భూమిని అధికారులు స్వాధీనం చేసుకోవాలని ఎంపీపీ బాబూరావు డిమాండ్‌ చేశారు. నాతవరం మండలంలోని షెడ్యూల్‌ ప్రాంత గిరిజనులకు కేజీహెచ్‌లో ఎస్‌టీ సెల్‌ ద్వారా వైద్య సేవలు అందించేందుకు నిరాకరిస్తున్నారని, గిరిజనులకు అక్కడ వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని నాతవరం ఎంపీపీ కోరారు. 



ఫొటో రైటప్స్‌: 2పిడిఆర్‌ 1: సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ 

2పిడిఆర్‌ 2: సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు


అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధికి కృషి 

- ఐటీడీఏ చైర్మన్‌, జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ 

- ఏజెన్సీలో రూ.230 కోట్లతో తాగునీటి పథకాలు  

- రాజకీయ పలుకుబడితో బదిలీలు ఆపుకోవద్దని హితవు 

పాడేరు, జూలై2(ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఐటీడీఏ చైర్మన్‌, జిల్లా  కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. తన అధ్యక్షతన శనివారం నిర్వహించిన స్థానిక ఐటీడీఏ 73వ పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో సమస్యలను పరిష్కరించుకుంటూ జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. ఏజెన్సీలో రూ.230 కోట్ల వ్యయంతో జల్‌ జీవన్‌ మిషన్‌లో భాగంగా తాగునీటి పథకాలు నిర్మించి ప్రతి గిరిజన గ్రామానికి తాగునీటి సదుపాయం కల్పిస్తామన్నారు. అలాగే రూ.100 కోట్లు ఉపాధి హామీ మెటీరియల్‌ కాంపోనెంటు కింద మంజూరయ్యాయని, వాటితో ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలను మరో ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ఏజెన్సీ, మైదాన ప్రాంతాన్ని కలిపే వి.మాడుగుల - దేవాపురం రహదారి నిర్మాణానికి మంజూరు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఏజెన్సీలో రహదారుల నిర్మాణానికి అటవీశాఖ అధికారులు మంచి సహకారం అందిస్తున్నారని తెలిపారు. ఆస్పత్రుల్లో మలేరియా మందులు, డెంగ్యూ కిట్లు, టైఫాయిడ్‌ నివారణ మందులు పూర్తి స్థాయిలో అందుబాటు ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఆస్పత్రిలో వారానికి రెండు రోజులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించడానికి చర్యలు చేపట్టామన్నారు. ప్రతి మండలం కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏజెన్సీ ప్రాంతం నుంచి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం విశాఖపట్నంలోని అనిల్‌ నీరుకొండ ఆస్పత్రికి తరలించిన వైనాలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే ఏజెన్సీలో అనేక చోట్ల ఇళ్ల మధ్యలో ప్రమాదకరంగా విద్యుత్‌ స్తంభాలున్నాయని, వాటిని సరి చేయాలని ఏపీఈపీడీసీఎల్‌ అధికారులను ఆదేశించారు. సకాలంలో విద్యుత్‌ స్తంభాలను మార్చకుంటే, ప్రమాదాలు జరిగితే అందుకు విద్యుత్‌ శాఖ బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్‌ హెచ్చరించారు. 

రాజకీయ పలుకుబడితో బదిలీలు ఆపుకోవద్దు

ఇటీవల జరిగిన బదిలీల్లో అల్లూరి జిల్లాకు కొంత మంది అధికారులను బదిలీ చేస్తే, వాళ్లు ఇక్కడికి రాకుండా రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని వేరే ప్రాంతానికి వెళుతున్నారని కలెక్టర్‌ తెలిపారు. అలా అయితే ఈ జిల్లాలో ఎవరు పని చేస్తారని, రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని జిల్లా నుంచి బదిలీ చేయించుకోవడం సరికాదన్నారు. ఆ విధంగా బదిలీలను ఆపుకోవద్దని, గిరిజనులకు సేవ చేయడానికి ముందు రావాలని ఆయన కోరారు. పెదబయలు మండలం గోమంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి 2002లో భూమి దానం చేసిన వ్యక్తికి ఉపాధి కల్పించలేదని, ఇటీవల సుమారుగా రెండు వారాలు పీహెచ్‌సీకి తాళం వేసి, గిరిజనులకు వైద్య సేవలు అందకుండా చేయడంపై కలెక్టర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రికి తాళం వేయడం పద్ధతి కాదని, సమస్యపై స్పందనలో ఫిర్యాదు చేస్తే సరిపోయేదన్నారు. అటువంటి చర్యలను ప్రజాప్రతినిధులు సమర్థించకూడదని కలెక్టర్‌ హితవు పలికారు.

కొత్తగా 72 సోలార్‌ నీటి పథకాలు

ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ మాట్లాడుతూ ఏజెన్సీలో తాగునీటి సదుపాయాల కల్పనకు కొత్తగా 72 సోలార్‌ తాగునీటి పథకాల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. జిల్లా ఏర్పడిన తరువాత ఐటీడీఏ బైలాను అల్లూరి సీతారామరాజు జిల్లాగా మార్పు చేస్తునట్టు తీర్మానం ప్రవేశపెట్టారు. మే నెలలో నిర్వహించిన మోదకొండమ్మ ఉత్సవాలకు ప్రభుత్వం రూ.కోటి విడుదల చేసిందన్నారు. అలాగే రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఎంపీ ల్యాడ్స్‌ రూ.15 లక్షలతో  జి.మాడుగుల మండలం నుర్మతి నుంచి జిలుగులగొయ్యి వరకు రహదారి నిర్మాణానికి మంజూరు చేశారన్నారు. అరకులోయ ఎంపీ గొడ్డేటి మాధవి చింతపల్లి మండలం లంబసింగి, చెరువుల వేనం అభివృద్ధికి రూ.20 లక్షలు మంజూరు చేశారన్నారు. మిషన్‌ కనెక్ట్‌ పాడేరులో రోడ్లు, నెట్‌వర్క్‌ కనెక్టవిటీ, తాగునీరు, విద్యుత్‌ సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. రానున్న మూడేళ్లలో ఏజెన్సీలో డోలీ మోతల గ్రామాలు లేకుండా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో అరకులోయ ఎంపీ జి.మాధవీ, ట్రైకార్‌ చైర్మన్‌ సతకా బుల్లిబాబు, జీసీసీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి, జడ్పీ చైౖర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ, సబ్‌కలెక్టర్‌ వి.అభిషేక్‌, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, డీఈవో డాక్టర్‌ పి.రమేష్‌, జిల్లా వైద్యారోగ్యశాఖాఽధికారిణి బి.సుజాత, ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.లీలాప్రసాద్‌, గిరిజన సంక్షేమ శాఖ ఈఈలు డీవీఆర్‌ఎం.రాజు, కె.వేణుగోపాల్‌, జిల్లా పంచాయతీ అధికారి పీఎస్‌ కుమార్‌, ఏజెన్సీ, సబ్‌ప్లాన్‌ మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-03T06:23:07+05:30 IST