సాదాసీదాగా జడ్పీ సమావేశం

ABN , First Publish Date - 2022-05-21T06:17:39+05:30 IST

ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలవాల్సిన జడ్పీ సమావేశం పెద్దగా సమస్యల ప్రస్తావన లేకుండానే సాగింది.

సాదాసీదాగా జడ్పీ సమావేశం

సమస్యలు ప్రస్తావించకుండా సభ్యులను కట్టడి చేసిన మంత్రి వేణు
కాకినాడ సిటీ, మే 20: ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలవాల్సిన జడ్పీ సమావేశం పెద్దగా సమస్యల ప్రస్తావన లేకుండానే సాగింది. విపక్ష జడ్పీటీసీలే కాదు అధికార జడ్పీటీసీల వాణిని కూడా వినిపించకుండా ఆద్యంతం నడిపించారు. అధికార పార్టీ సభ్యులు లేచి తమ పరిధిలోని సమస్యలను ప్రస్తావించేందుకు ప్రయత్నించగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు వారిని నిలువరించారు. కనుసైగలతో కొందరిని, డైరెక్ట్‌గా చెప్పి మరికొందరిని ఏమీ మాట్లాడకుండా చేసేశారు. మొత్తానికి జడ్పీటీసీలు తమ పరిధిలోని సమస్యల ప్రస్తావన లేకుండానే ఉమ్మడి జిల్లా పరిషత్‌ సమావేశం ముగియడం విశేషం.. కాకినాడ జిల్లా కాకినాడలోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో శుక్రవారం ఉమ్మడి జిల్లా ప్రజాపరిషత్‌ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షత వహించారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు, కాకినాడ ఎంపీ వంగాగీత, కాకినాడ జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా, కోనసీమ జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, తూర్పుగోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సీహెచ్‌ శ్రీధర్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.  అయితే ఈ సమావేశాన్ని మంత్రి వేణు అంతా తానై నడిపించి ప్రతి విషయంలోను కలుగ జేసుకోవడంతో సభ్యులు ఒకింత అసహనానికి గురయ్యారు. సమస్యలను ప్రస్తావిస్తున్న వారిని ఏదో ఒక కారణంతో నిలువరించే ప్రయత్నం చేయడంతో అసంతృప్తికి లోన య్యారు. టీడీపీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి వేణు సమాధానమిస్తూ ‘‘అడగడం వల్ల ఆనందం వస్తుంది కానీ అంతకుమించి ఏమీ ఉండదు’’ అని వెటకారంగా మాట్లాడడం ఇబ్బంది కలిగించింది. టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కోనసీమలో ధాన్యం ఎవరు, ఎంతవరకు సేకరించారని ప్రశ్నించారు. దీనికి అధికారుల నుంచి సరైన సమాధానం రాలేదు.  ఓ గిరిజన ప్రాంత సభ్యురాలు తమ ప్రాంతాన్ని అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని చెబుతుండగా మంత్రి వేణు ఆమెను మాట్లాడనీయకుండా చేయడంతో ఆ  జడ్పీటీసీ ఏమీ చేయలేక మిన్నుకుండిపోయారు. మరో సభ్యుడు పాఠశాల దుస్థితి గురించి మాట్లాడుతుండగా ఇది సందర్భం కాదని చెప్పారు. పలువురు సభ్యులు తమ ప్రాంతాల్లో రోడ్లు బాగోలేదని, కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకుని పనులు చేయడం లేదని, చర్యలు తీసుకోవాలని ఎకరవు పెట్టినా అధికారుల నుంచి సరైన సమాధానం రాలేదు. సమావేశంలో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌లు బుర్రా అనుబాబు, మేరుగు పద్మలత, మండపేట, అనపర్తి, జగ్గంపేట, రాజానగరం, పిఠాపురం, రంపచోడవరం ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, సత్తి సూర్యనారాయణరెడ్డి జ్యోతుల చంటిబాబు, జక్కంపూడి రాజా, పెండెం దొరబాబు, నాగులాపల్లి ధనలక్ష్మి, జడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ,  ధవళేశ్వరం ఇరిగేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఈ బి.రాంబాబు, కాకినాడ జిల్లా వ్యవసాయ అధికారి ఎన్‌.విజయ్‌కుమార్‌, కాకినాడ జిల్లా హౌసింగ్‌ పీడీ బి.సుధాకర్‌ పట్నాయక్‌, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కె.హరిప్రసాదబాబు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-21T06:17:39+05:30 IST