జడ్పీ బడ్జెట్‌ రూ.1359కోట్లు

ABN , First Publish Date - 2022-01-28T07:26:57+05:30 IST

జిల్లా పరిషత్‌ 2022-23 సాధారణ వార్షిక బడ్జెట్‌ వెయ్యి కోట్ల మార్క్‌ను దాటింది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి రూ.1,359.08 కోట్ల అంచనాలతో బడ్జెట్‌ను రూపొందించారు.

జడ్పీ బడ్జెట్‌ రూ.1359కోట్లు

  • రూ.55లక్షల మిగులుతో 2022-23 బడ్జెట్‌ అంచనా ఆమోదం
  • సమావేశంలో మంత్రి వేణు, జడ్పీ చైర్మన్‌ వేణుగోపాలరావు, కలెక్టర్‌ హరికిరణ్‌

భానుగుడి(కాకినాడ) జనవరి 27: జిల్లా పరిషత్‌ 2022-23 సాధారణ వార్షిక బడ్జెట్‌ వెయ్యి కోట్ల మార్క్‌ను దాటింది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి రూ.1,359.08 కోట్ల అంచనాలతో బడ్జెట్‌ను రూపొందించారు. రాబోయే సంవత్సరంలో రూ.1,358.53 కోట్ల వ్యయం కాగలదని అంచనా వేయగా, రూ.55 లక్షల మిగులు చూపారు. ఈ భారీ బడ్జె ట్‌ను జిల్లా పరిషత్‌ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. గురువారం కాకినాడలోని జీఎంసీ బాలయోగి జడ్పీ సమావేశ హాలులో జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జిల్లా కలెక్టర్‌ సి హరికిరణ్‌ అతిథులుగా హాజరయ్యారు. సమావేశంలో తొలుత జడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ జిల్లా పరిషత్‌ ఆదాయ, వ్యయాల ఆధారంగా 2021-22 సంవత్సరానికి బడ్జెట్‌ సవరణలను, 2022-23 సంవత్సరానికి అంచనా బడ్జెట్‌ను వివిధ పద్దుల వారీగా సభ్యులకు వివరించారు. అదేవిధంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో వివిధ పద్దుల కింద సవరించిన బడ్జెట్‌ రూ.1,105.90 కోట్లు కాగా, వ్యయం రూ.1,105.40 కోట్లు కావడంతో మిగులు బడ్జెట్‌ రూ.50 లక్షలుగా సమావేశం ఆమోదించింది. రాష్ట్ర విభజన అనంతరం ప్రస్తుత ఆర్థిక లోటు, కొవిడ్‌-19 వంటి సంక్షోభాలను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగ, ఉపా ధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాలు సమ్మెను విరమించుకోవాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నిలువెత్తు నూతన చిత్రపటాన్ని మంత్రి, జడ్పీ చైర్మన్‌, కలెక్టర్‌, ఎమ్మెల్యేలు ఆవిష్కరించారు. అనంతరం మంత్రి వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ జిల్లాను రాజమహేంద్రవరం, కోనసీమ, కాకినాడ కేంద్రాలుగా మూడు జిల్లాలు ఏర్పాటు చేయడం శుభపరిణామన్నారు. జడ్పీ చైర్మన్‌ వేణుగోపాలరావు మాట్లాడుతూ బడ్జెట్‌ వివరాలను తెలియజేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్యేలు సత్తి సూర్యనారాయణరెడ్డి, రాపాక వరప్రసాద్‌, కొండేటి చిట్టిబాబు, రంపచోడవరం ఐటీడీఏ పీవో సీవీ ప్రవీణ్‌ ఆది త్య, వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-28T07:26:57+05:30 IST