Abn logo
Sep 25 2021 @ 00:57AM

సుభద్రకే జడ్పీ పీఠం?

నేడు అధికారికంగా వెల్లడి

వైస్‌ చైర్మన్లుగా అనకాపల్లి, సబ్బవరం జడ్పీటీసీ సభ్యులు

భీశెట్టి సత్యవతి, తుంపాల అప్పారావు పేర్లు ఖరారు?

నేడు ఎన్నికలు


విశాఖపట్నం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ముంచంగిపుట్టు జడ్పీటీసీ సభ్యురాలు జల్లిపల్లి సుభద్ర పేరు ఖరారైనట్టు తెలిసింది. వైసీపీ అధిష్ఠానం శనివారం ఉదయం అధికారికంగా ప్రకటించనున్నది. 


జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి గిరిజన మహిళకు రిజర్వు కావడంతో ఏజెన్సీకి చెందిన పలువురు జడ్పీటీసీ సభ్యులు ఆశించారు. ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే జడ్పీ చైర్‌పర్సన్‌ పదవికి జీకే వీధి జడ్పీటీసీ సభ్యురాలు కిముడు శివరత్నం పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆమె భర్త విశ్వేశ్వరరాజు 2019 ఎన్నికల సమయంలో పాడేరు టిక్కెట్‌ ఆశించారు. అయితే ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇవ్వడం వీలుకాదని, భవిష్యత్తులో మంచి పదవి ఇస్తానని వైసీపీ అధినేత జగన్‌ అప్పట్లో హామీ ఇచ్చారట! ఈ నేపథ్యంలో జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి ఎస్టీ మహిళలకు రిజర్వు కావడంతో విశ్వేశ్వరరాజు తన భార్య శివరత్నంను జీకే వీధి నుంచి పోటీ చేయించి గెలిపించుకున్నారు. నాడు జగన్‌ ఇచ్చిన హామీ మేరకు జడ్పీ పదవి తన భార్యకే లభిస్తుందని భావించారు. కానీ ఆమెకు పదవి దక్కకుండా ఏజెన్సీకి చెందిన ప్రజా ప్రతినిధులు పలువిధాలా ప్రయత్నాలు చేశారు. చివరకు గిరిజన ‘తెగ’ల అంశాన్ని తెరపైకి తెచ్చి అనుకున్నది సాధించారు. ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు మూడు ప్రధాన తెగలకు చెందినవారు కావడంతో, వేరే తెగకు (పీటీజీ) చెందిన వారికి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా అవకాశం ఇవ్వాలని వైసీపీ అధిష్ఠానానికి సూచించారు. దీంతో ఆ తెగకు చెందిన ముంచంగిపుట్టు జడ్పీటీసీ సభ్యురాలు జల్లిపల్లి సుభద్ర వైపు అధికార పార్టీ మొగ్గు చూపిందని చెబుతున్నారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి భగత సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో అదే వర్గానికి చెందిన శివరత్నానికి జడ్పీ పీఠం ఇవ్వలేమని పార్టీ అధిష్ఠానం విశ్వేశ్వరరాజుకు చెప్పినట్టు తెలిసింది. అయినప్పటికీ ఆయన తన వంతు ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.  


వైస్‌చైర్మన్‌ పదవులకు ఇద్దరు ఎంపిక

జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్‌పర్మన్‌ పదవులకు అనకాపల్లి జడ్పీటీసీ మెంబర్‌ భీశెట్టి సత్యవతి, సబ్బవరం జడ్పీటీసీ సభ్యుడు తుంపాల అప్పారావు పేర్లు ఖరారైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కె.కోటపాడు, పద్మనాభం జడ్పీటీసీ సభ్యులు ఈర్లె అనురాధ (ఎమ్మెల్యే ముత్యాలనాయుడు కుమార్తె), సుంకరి గిరిబాబు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రెండు కో-ఆప్షన్‌ పదవులకు అభ్యర్థుల పేర్లను శనివారం ఉదయం ఖరారు చేస్తారు.