Abn logo
Sep 26 2021 @ 00:28AM

సుభద్ర అను నేను...

జిల్లా ప్రజా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా జల్లిపల్లి సుభద్ర, వైస్‌ చైర్మన్లు తుంపాల అప్పారావు, భీశెట్టి వరహా సత్యవతి

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా ముంచంగిపుట్టు జడ్పీటీసీ సభ్యురాలు ఎన్నిక

జడ్పీ పీఠంపై ఆదిమజాతి బిడ్డ

వైస్‌ చైర్మన్లుగా సబ్బవరం జడ్పీటీసీ సభ్యుడు తుంపాల అప్పారావు, అనకాపల్లి జడ్పీటీసీ సభ్యురాలు భీశెట్టి సత్యవతి

కో-ఆప్షన్‌ సభ్యులుగా శివసత్యనారాయణ జోసెఫ్‌, ఎన్‌కేవీవీఎస్‌ నారాయణ 

కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన కలెక్టర్‌

పాలనా బాధ్యతలు చైర్‌పర్సన్‌కు అప్పగిస్తున్నట్టు ప్రకటన


విశాఖపట్నం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):

జిల్లా ప్రజా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జల్లిపల్లి సుభద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏజెన్సీలోని ముంచంగిపుట్టు నుంచి జడ్పీటీసీ సభ్యురాలిగా గెలిచిన ఆమె ఆదిమ గిరిజన జాతికి చెందినవారు. జడ్పీ పీఠాన్ని అధిష్ఠించిన మహిళల్లో సుభద్ర మూడోవారు. గతంలో వంజంగి కాంతమ్మ, లాలం భవానీ చైర్‌పర్సన్లుగా పనిచేశారు. కాగా వైస్‌ చైర్మన్లుగా సబ్బవరం జడ్పీటీసీ సభ్యుడు తుంపాల అప్పారావు, అనకాపల్లి జడ్పీటీసీ సభ్యురాలు భీశెట్టి వరహా సత్యవతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


జడ్పీ చైర్‌పర్సన్‌, ఇద్దరు వైస్‌ వైస్‌ చైర్మన్ల ఎన్నిక  శనివారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఉదయం పది గంటలకు సమావేశం ప్రారంభమైన వెంటనే ఇద్దరు కో-ఆప్షన్‌ సభ్యుల పదవులకు  నామినేషన్లు స్వీకరించారు. అనకాపల్లికి చెందిన శివసత్యనారాయణ జోసెఫ్‌, అచ్యుతాపురం మండలం దోసూరుకు చెందిన ఎన్‌కేవీవీఎస్‌ నారాయణలు ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌, డీసీసీబీ మాజీ చైర్మన్‌ సుకుమారవర్మలతో వచ్చి జడ్పీ అడిషనల్‌ ప్రిసైడింగ్‌ అధికారి నాగార్జునసాగర్‌కు నామినేషన్లు అందజేశారు. ఒంటి గంటకు జడ్పీ ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున అధ్యక్షతన సభ్యులు కొలువుదీరారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. తెలుగు అక్షరమాల ప్రకారం తొలుత కె.కోటపాడు జడ్పీటీసీ అనురాధను ఆహ్వానించారు. అయితే ఆమె అప్పటికి హాలులోనికి రాకపోవడంతో పెందుర్తి జడ్పీటీసీ సభ్యురాలు ఉప్పిలి దేవి మొదట ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం సమావేశానికి హాజరైన 34 మంది సభ్యులతో వారి ఆశీనులైన సీటు నుంచి ఒక్కొక్కరితో ప్రిసైడింగ్‌ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కో-ఆప్షన్‌ పదవులకు నామినేషన్‌ దాఖలు చేసిన శివసత్యనారాయణ జోసెఫ్‌, ఎన్‌కేవీవీఎస్‌ నారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్‌ అధికారి ప్రకటించారు.  


సుభద్ర ఏకగ్రీవంగా ఎన్నిక

భోజన విరామం అనంతరం మూడు గంటలకు సమావేశం తిరిగి ప్రారంభమైన తరువాత మిగిలిన నలుగురు సభ్యులతో ప్రిసైడింగ్‌ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జడ్పీ చైర్‌పర్సన్‌ ఎన్నిక నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్‌లు సుభద్ర పేరిట గల బి.ఫారాన్ని కలెక్టర్‌కు అందజేశారు. తనకు అందిన బి.ఫారంలో ఉన్న ముంచంగిపుట్టు సుభద్ర పేరును మల్లికార్జున ప్రకటించారు. ఆమెను ఒకరు ప్రతిపాదిస్తే మరొకరు బలపరచాలని ఆయన సూచించడంతో రోలుగుంట జడ్పీటీసీ పోతల లక్ష్మి రమణమ్మ ప్రతిపాదించగా, కశింకోట జడ్పీటీసీ డీవీ అప్పలనరసింహరాజు బలపరిచారు. ఇంకెవరైనా పోటీలో ఉన్నారా...అని కలెక్టర్‌ ప్రశ్నించారు. అయితే ఎవరూ లేచి నిలడకపోవడంతో సుభద్ర ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్‌ అధికారి సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఆ తరువాత వైస్‌ చైర్‌పర్సన్ల ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. తొలి వైస్‌ చైర్మన్‌ పదవి కోసం కశింకోట జడ్పీటీసీ సభ్యుడు తుంపాల అప్పారావు పేరును దేవరాపల్లి జడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం ప్రతిపాదించగా, పాడేరు జడ్పీటీసీ సభ్యురాలు కిముడు గాయత్రిదేవి బలపరిచారు. ఇంకెవరూ పోటీలో లేకపోవడంతో తుంపాల అప్పారావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్‌ అధికారి ప్రకటించారు. అలాగే రెండో వైస్‌ చైస్‌పర్సన్‌గా అనకాపల్లి జడ్పీటీసీ భీశెట్టి వరహాసత్యవతి పేరును గొలుగొండ జడ్పీటీసీ సభ్యుడు సుర్ల వెంకట గిరిబాబు ప్రతిపాదించగా, ఎలమంచిలి జడ్పీటీసీ సభ్యురాలు సేనాపతి సంధ్యారాణి బలపరిచారు. ఎవరూ పోటీకి రాకపోవడంతో సత్యవతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్ల ఎన్నిక తరువాత సుభద్ర, తుంపాల అప్పారావు, సత్యవతిలను వేదికపైకి ఆహ్వానించారు. జడ్పీ చైర్‌పర్సన్‌గా జల్లిపల్లి సుభద్ర, తరువాత వైస్‌ చైర్మన్లుగా తుంపాల అప్పారావు, సత్యవతిలతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ప్రిసైడింగ్‌ అధికారి, కలెక్టర్‌ మల్లికార్జున మాట్లాడుతూ ఇప్పటివరకు జడ్పీ స్పెషలాఫీసర్‌గా కొనసాగానని, పాలకవర్గం కొలువుదీరడంతో ఆ బాధ్యతలను జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్రకు అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, ఇద్దరు వైస్‌ చైర్‌పర్సన్లు, కొత్తగా ఎన్నికైన జడ్పీటీసీలను ఆయన అభినందించారు. తరువాత కలెక్టర్‌ సమావేశం హాలు నుంచి వెళ్లిపోయారు. అడిషనల్‌ ప్రిసైడింగ్‌ అధికారి నాగార్జునసాగర్‌ మాట్లాడుతూ జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర అధ్యక్షతన సమావేశం జరుగుతుందని ప్రకటించారు. ఈ సందర్భంగా సుభద్ర, అప్పారావు, సత్యవతిని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతోపాటు ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు అభినందించారు.


ఏజెన్సీలో మారుమూల గ్రామాలకు రహదారుల నిర్మాణం

తాగునీరు, విద్య, వైద్యం వంటి మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తా

మైదాన, గిరిజన ప్రాంతాలను సమన్వయం చేసుకుంటా పారదర్శక పాలన అందించేలా చర్యలు

‘ఆంధ్రజ్యోతి’తో జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర


విశాఖపట్నం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ‘ఏజెన్సీలో అత్యంత మారుమూల ప్రాంతంలో పుట్టాను. బయటకు రావాలంటే...కిలోమీటర్లు నడక. గిరిజనులు పడే బాధలు, ఇబ్బందులు చిన్నప్పటి నుంచి తెలుసు. ప్రధానంగా రోడ్లు లేకపోవడంతో పురిటి నొప్పులు వచ్చిన మహిళలు ఎంతో ఇబ్బందిపడుతున్నారు...అందుకే ఏజెన్సీలో మారుమూల ప్రాంతాలకు రహదారులు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడమే నా ధ్యేయం’...అంటున్నారు జిల్లా ప్రజా పరిషత్‌ నూతన చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అన్నారు. శనివారం చైర్‌పర్సన్‌గా ఎన్నికైన ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ త్వరలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలుస్తానని, ఏజెన్సీలో రహదారులు నిర్మించాల్సిందిగా కోరతానని చెప్పారు. రహదారులు నిర్మిస్తే అనేక సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. రోడ్లు వుంటే ఏజెన్సీలో పూరిళ్లు బదులు పక్కా ఇళ్లు వస్తాయని, దీంతో గిరిజనులు చక్కటి జీవితం గడుపుతారన్నారు. రహదారులు, వైద్యం, విద్య, ఇతర మౌలిక వసతుల కల్పనే జడ్పీ చైర్‌పర్సన్‌గా తన ప్రధాన అజెండా అని ఆమె పేర్కొన్నారు. అలాగే ఏజెన్సీలో వైద్యులు, ఇతర సిబ్బంది నివాసానికి క్వార్టర్లు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. గతంతో పోల్చితే ఇప్పుడు పాఠశాలల్లో నాడు-నేడు నిఽధులతో అనేక రకాల మౌలిక వసతులు కల్పించారని, అయితే ఏజెన్సీలో ప్రతి గిరిజనుడు చదువుకునేలా ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు. చదువుతో ఆయా కుటుంబాల్లో వెలుగులు పూస్తాయని, అందుకు తానే ఉదాహరణగా పేర్కొన్నారు. ఆడపిల్లలు చక్కగా చదువు కోవాలన్నారు. జడ్పీ పరిధిలో గల ఏజెన్సీ, మైదానాల్లో కలిపి 39 మండలాలు వున్నాయని పేర్కొంటూ ఇరు ప్రాంతాలను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి చేస్తామన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి నిధులు రాబట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జిల్లాలోని ప్రజా ప్రతినిధులతో కలిసి కృషిచేస్తానని సుభద్ర అన్నారు. జడ్పీలో పారదర్శక పాలన అందించేలా చర్యలు తీసుకుంటానన్నారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరి సమస్య విని సాధ్యమైనంత వరకు పరిష్కారానికి చొరవ తీసుకుంటానన్నారు. 


సామాన్య కుటుంటం మాది..

ముంచంగిపుట్టు మండలంలో పీటీజీ తెగకు చెందిన ఆదివాసీ బిడ్డనన్నారు. తండ్రి అరబీరు గాసి రైతు, తల్లి చంద్రకళ అంగన్‌వాడీ కార్యకర్త కాగా, అన్న జగబంధు వైసీపీ నాయకుడిగా ఉన్నారన్నారు. భర్త పేరు జేవీవీఎన్‌మూర్తి. తమకు ఒక పాప ఉందన్నారు.