ఉప్పాల హారిక
వైసీపీ గుడ్లవల్లేరు జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ
గెలుపొందితే జడ్పీ పీఠం దక్కే అవకాశం
దాదాపు ఖరారు చేసిన అధిష్టానం
ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం: అత్యంత ప్రతిష్టాత్మకమైన జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఈసారి బీసీ మహిళకు రిజర్వు చేశారు. వైసీపీ నేత ఉప్పాల రాంప్రసాద్ కుటుంబానికి సముచిత స్థానం కల్పిస్తామని ఇదివరకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. వైసీపీ గుడ్లవల్లేరు జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీచేసిన ఉప్పాల రాంప్రసాద్ కోడలు ఉప్పాల హారిక గెలుపొందితే జడ్పీ చైర్పర్సన్ రేసులో ముందుండే అవకాశం ఉంది. ఉప్పాల హారిక పేరును వైసీపీ అధిష్టానం ఖరారు చేసిందని జిల్లాలో శనివారం విస్తృతంగా ప్రచారం జరిగింది. హారిక నామినేషన్ దాఖలు చేసే సమయంలో మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని ఆమె వెంటే ఉన్నారు. తూర్పు కృష్ణా ప్రాంతానికి జడ్పీ చైర్పర్సన్ పదవిని కేటాయిస్తే, పశ్చిమ కృష్ణా ప్రాంతంలో ఎవరిని జడ్పీ వైస్ చైర్మన్ పదవి వరిస్తోందనని ఉత్కంఠ నెలకొంది.
ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులకు పోటాపోటీ
ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయితే మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు పొందేందుకు ఆశావహులు తమదైన శైలిలో ఎమ్మెల్యేలు, జిల్లాకు చెందిన మంత్రులను తమ వేగుల ద్వారా ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. అధికశాతం అధికారపార్టీ అభ్యర్థులు తమను ఎంపీపీ పదవి వరిస్తుందనే ఊహల్లో విహరిస్తున్నారు.