కరోనా వ్యాప్తిని అరికట్టాలి

ABN , First Publish Date - 2021-04-17T04:50:08+05:30 IST

జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వ్యాప్తిని అరికట్టాలని జిల్లా పరిషత్‌ సీఈవో ఎం.వెంకటసుబ్బయ్య సూచించారు.

కరోనా వ్యాప్తిని అరికట్టాలి

  1. టెలి కాన్ఫరెన్సులో జడ్పీ సీఈవో ఎం.వెంకటసుబ్బయ్య
  2. వ్యాక్సిన్‌పై అపోహలు వద్దని అధికారుల సూచన


కర్నూలు(న్యూసిటీ), ఏప్రిల్‌ 16: జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వ్యాప్తిని అరికట్టాలని జిల్లా పరిషత్‌ సీఈవో ఎం.వెంకటసుబ్బయ్య సూచించారు. శుక్రవారం జడ్పీలోని ఆయన చాంబర్‌ నుంచి ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. గత సంవత్సరం కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో కాంటాక్టు ట్రేసింగ్‌ చేసిన విధంగానే ప్రతి పట్టణం, గ్రామంలో చర్యలు తీసుకోవాలని సూచించారు. కొవిడ్‌ నిర్ధారణ అయిన వ్యక్తి నుంచి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను త్వరితగతిన గుర్తించి వారికి కరోనా పరీక్షలు నిర్వహించడం ద్వారా వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. అదే విధంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను నిరంతం కొనసాగించాలని ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కరోనా నివారణ పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఎంపీడీవోలకు సూచించారు. 


బేతంచెర్ల: కొవిడ్‌ నివారణకు ప్రభుత్వం నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని బేతంచెర్ల ఎంపీడీవో అశ్వినికుమార్‌ వీవోఏలు, గ్రామైక్య సంఘాల కమిటీ సభ్యులకు సూచించారు. శుక్రవారం పట్టణంలోని డీఆర్‌డీఏ, ఐకేపీ కార్యాలయంలో కరోనా సెకండ్‌ వేవ్‌ గురించి వీవోఏలు, గ్రామైక్య సంఘాల కమిటీ సభ్యులకు వెలుగు ఏపీఎం లింగమయ్య అధ్యక్షతన శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామాల్లో పొదుపు సంఘాల సభ్యులు ఈ నెల 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కోవిడ్‌ వ్యాక్సిన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించి వ్యాక్సిన్‌కు వారు ముందుకొచ్చే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ రంగాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ వెంకటసుబ్బయ్య, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ హసాన్‌బేగ్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ పుష్పలీల, గ్రామైక్య సంఘాల కమిటీ సభ్యులు, వీవోఏలు పాల్గొన్నారు. 


వెల్దుర్తి: కొవిడ్‌-19 వ్యాక్సిన్‌పై అపోహలు వీడి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని తహసీల్దార్‌ రాజేశ్వరి సూచించారు. శుక్రవారం వెలుగు కార్యాలయంలో ఏపీఎం కాశేశ్వరుడు ఆధ్వర్యంలో గ్రామ పొదుపు సంఘాలకు, వీవోఏలకు అవగాహన కార్యక్రమం నిర్వ హించారు. వారు మాట్లాడుతూ కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వేగంగా వ్యాపి ్తస్తోందని, దీని నివారణపై ప్రజలకు వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. అందరూ వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుబ్బారెడ్డి, హెల్త్‌ సిబ్బంది, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ రాధమ్మ, సీసీలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-17T04:50:08+05:30 IST