ఆర్థిక కష్టాల్లో జూ పార్కు

ABN , First Publish Date - 2022-05-25T06:27:26+05:30 IST

కరోనా ఉపద్రవం ముందు వరకు సందర్శకుల రాకతో జంతువులను దత్తత తీసుకునే వారి సహకారంతో తిరుపతి జూ పార్కు కళకళలాడింది.

ఆర్థిక కష్టాల్లో జూ పార్కు

తిరుపతి అర్బన్‌, మే 24: కరోనా ఉపద్రవం ముందు వరకు సందర్శకుల రాకతో జంతువులను దత్తత తీసుకునే వారి సహకారంతో తిరుపతి జూ పార్కు కళకళలాడింది. 1245 హెక్టార్లలో విస్తరించి ఆసియాలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందిన ఈ పార్కు రాత రెండేళ్లుగా మారిపోయింది. 1107 జంతువులతో, 88 జాతుల వన్యప్రాణులతో, 205 మంది సిబ్బందితో ఉన్న ఈ పార్కు  పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందంటే ప్రహరీ 25 మీటర్లు కూలిపోయినా నిర్మించడానికి, చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయించలేనంత ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోయింది. జూపార్కు ప్రధాన ఆదాయ వనరు సందర్శకులు మాత్రమే. సందర్శకుల నుంచి వసూలు చేసే ప్రవేశ రుసుంతోపాటు కార్లు, బ్యాటరీ, సాధారణ సైకిళ్ల వినియోగం ద్వారా వసూలు చేసే డబ్బులు, ఇక్కడి దుకాణాల నుంచి వచ్చే అద్దెలు, బ్యాటరీ వాహనాల కాంట్రాక్టు ద్వారా వచ్చే ఆదాయం పైనే ఎక్కువగా ఆధారపడాలి. ఈ ఆదాయం ఏ మాత్రం జూ డెవల్‌పమెంట్‌కు సరిపోని పరిస్థితి కనిపిస్తోంది. 


ఖర్చులు.. ఆదాయమిలా..


జంతువుల ఆహారానికి సంవత్సరానికి రూ.3కోట్లు,  సిబ్బందికి రూ.3.5కోట్లు ఖర్చయ్యేది. కేంద్ర ప్రభుత్వం రూ.9-10లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.70లక్షల ఆర్థిక సహకారం అందిస్తున్నాయి. కరోనాకు ముందు వరకు రోజువారీ ఆదాయం దాదాపు రూ.3లక్షలు వచ్చేది. ఇప్పుడు రూ.లక్షా 30వేలకు పడిపోయింది. ఇప్పుడిప్పుడే సందర్శకుల సంఖ్య పెరుగుతున్నా..  ఆర్థిక సంక్షోభం నుంచి పూర్తిగా గట్టెక్కలేని పరిస్థితి నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ఆర్థిక సహకారాన్ని అందిస్తేనే సమస్య పరిష్కారమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. 




ఆదాయం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది


  సాధారణ రోజుల్లో 1300 నుంచి 1500 మంది వరకు .. వారాంతంలో మూడు వేల మంది వరకు సందర్శకులు వస్తున్నారు.ఇప్పుడిప్పుడే ఆదాయం పెరుగుతోంది. సందర్శకులను ఆకట్టుకునేలా బయోస్కో్‌పకు మరమ్మతులు చేసి ప్రారంభించాం.దీంతోపాటు నక్షత్ర తాబేళ్ల ఎన్‌క్లోజర్‌ కూడా సిద్ధం చేశాం.కొత్త ఎన్‌క్లోజర్‌ ఏర్పాటు చేసి, ఆసియా సింహాన్ని తెప్పించాం. వైట్‌టైగర్ల సఫారీ, హిమాలయాల్లో సంచరించే నల్ల ఎలుగుబంట్లను కూడా తీసుకురావడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం. రాత్రి పూట సంచరించే పక్షులు, జంతువుల కోసం నాక్‌టర్నల్‌ హౌస్‌ ఏర్పాటుకు టీటీడీ ఆర్థిక సాయం అందిస్తోంది. ఇవన్నీ ఏర్పాటు చేస్తే సందర్శకుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. 

Updated Date - 2022-05-25T06:27:26+05:30 IST