వైరల్ స్టోరీ: 42 డిగ్రీల ఎండలో సైకిల్‌పై వచ్చిన జొమాటో డెలివరీ బాయ్.. కస్టమర్ ఏం చేశాడంటే.. !

ABN , First Publish Date - 2022-04-13T18:08:06+05:30 IST

అతను సోమవారం మధ్యాహ్నం జొమాటోలో ఫుడ్‌ ఆర్డర్‌ చేశాడు.. కాసేపటికే డెలివరీ బాయ్ వచ్చాడు..

వైరల్ స్టోరీ: 42 డిగ్రీల ఎండలో సైకిల్‌పై వచ్చిన జొమాటో డెలివరీ బాయ్.. కస్టమర్ ఏం చేశాడంటే.. !

అతను సోమవారం మధ్యాహ్నం జొమాటోలో ఫుడ్‌ ఆర్డర్‌ చేశాడు.. కాసేపటికే డెలివరీ బాయ్ వచ్చాడు.. పార్సిల్ తీసుకుందామని వెళ్లిన వ్యక్తి డెలివరీ బాయ్‌ను చూసి షాకయ్యాడు.. మిట్ట మధ్యాహ్నం ఎండ తీవ్రంగా కాస్తున్న వేళ చెమట్లు కక్కుకుంటూ ఒక వ్యక్తి సైకిల్‌పై జొమాటో ఆర్డర్లు డెలివరీ చేయడం అతణ్ని కలిచి వేసింది.. పార్సిల్ అందుకుని డెలివరీ బాయ్‌తో అతను మాటలు కలిపాడు.. ఆ డెలివరీ బాయ్ గతంలో స్కూల్ టీచర్ అని, కరోనా సమయంలో ఉద్యోగం పోవడంతో జొమాటో డెలివరీ బాయ్‌గా మారాడని తెలిసింది. దీంతో తనకు చేతనైన సహాయం చేసేందుకు ఆ వ్యక్తి ముందుకొచ్చాడు. 


ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది. ఆ డెలివరీ బాయ్ పేరు దుర్గా మీనా. ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఆ కస్టమర్ పేరు ఆదిత్య శర్మ. బీకామ్‌ చదివిన దుర్గా మీనా దాదాపు పన్నెండేళ్లు టీచర్‌గా పని చేశాడు. కరోనా సమయంలో అతని ఉద్యోగం పోయింది. దీంతో జొమాటో డెలివరీ బాయ్‌గా మారాడు. బైకు కొనుక్కునేందుకు డబ్బులు లేకపోవడంతో కష్టపడి సైకిల్ మీదే ఫుడ్ డెలివరీలు చేస్తున్నాడు. అతని కథంతా విన్న ఆదిత్య శర్మ దానిని ట్విటర్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు. 


కనీసం ఒక్క రూపాయి అయినా ఇచ్చి దుర్గామీనా బైక్‌ కొనుక్కునేందుకు సాయం చేయాలని నెటిజన్లను కోరుతూ సోమవారం మధ్యాహ్నం ట్విటర్‌లో మెసేజ్‌ పెట్టాడు. నెటిజన్లు భారీగా స్పందించడంతో 24 గంటలు కూడా గడవక ముందే దుర్గామీనా బైక్‌ కొనేందుకు అవసరమైన డబ్బులు చేకూరాయి.  దుర్గామీనా సొంతం చేసుకోబోయే బైకు ఫోటోను మంగళవారం మధ్యాహ్నం ఆదిత్య శర్మ పోస్ట్‌ చేశాడు. ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 





Updated Date - 2022-04-13T18:08:06+05:30 IST