Zimbabwe vs India: రాణించిన టీమిండియా బౌలర్లు.. 189 పరుగులకే జింబాబ్వే ఆలౌట్

ABN , First Publish Date - 2022-08-18T21:58:37+05:30 IST

టీమిండియా, జింబాబ్వే జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే బ్యాట్స్‌మెన్స్ చేతులెత్తేశారు. కీలక బ్యాట్స్‌మెన్స్ సింగిల్ డిజిట్ రన్స్‌కే..

Zimbabwe vs India: రాణించిన టీమిండియా బౌలర్లు.. 189 పరుగులకే జింబాబ్వే ఆలౌట్

హరారే: టీమిండియా, జింబాబ్వే జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే బ్యాట్స్‌మెన్స్ చేతులెత్తేశారు. కీలక బ్యాట్స్‌మెన్స్ సింగిల్ డిజిట్ రన్స్‌కే పెవిలియన్ బాట పట్టారు. ఫలితంగా.. 189 పరుగులకే జింబాబ్వే జట్టు ఆలౌట్ అయింది. 190 పరుగుల లక్ష్యంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగనుంది. టీమిండియా పేసర్ దీపక్ చాహర్ చాలా గ్యాప్ తర్వాత జట్టులోకి వచ్చినప్పటికీ మూడు వికెట్లతో రాణించాడు. ఏడు ఓవర్లు బౌలింగ్ చేసి 27 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ప్రసీద్ కృష్ణ, అక్సర్ పటేల్ కూడా చెరో మూడు వికెట్లు తీసి రాణించారు. సిరాజ్‌కు ఒక వికెట్ దక్కింది. సికందర్‌ రజా, కయా జింబాబ్వే అభిమానులను నిరాశపరిచారు.



సికందర్‌ రజా 12 పరుగులు, కయా 4 పరుగులు మాత్రమే చేసి ఔట్‌గా వెనుదిరిగారు. జింబాబ్వే జట్టు కెప్టెన్ చికాబ్వా 35 పరుగులతో కాస్త జట్టుకు ఊపిరి పోసే ప్రయత్నం చేశాడు. బ్రాడ్‌ ఇవాన్స్‌ 33 పరుగులు (నాటౌట్), రిచర్డ్ నగర్వ 34 పరుగులతో చివర్లో జట్టుకు చెప్పుకోదగ్గ భాగస్వామ్యాన్ని అందించారు. జింబాబ్వే జట్టు 189 పరుగులు చేయగా అందులో 25 ఎక్స్‌ట్రాసే కావడం గమనార్హం. లక్ష్యం ఛేదించలేనంత లేకపోయినప్పటికీ జింబాబ్వే బౌలింగ్‌ను తక్కువ అంచనా వేయలేం.



టీమిండియా ఓపెనర్లు రాణించి మిడిలార్డర్‌పై ఒత్తిడి తగ్గిస్తేనే గెలుపు సునాయాసం అవుతుంది. గిల్, ధావన్ మంచి ఫామ్‌లోనే ఉండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం. సీనియర్లకు విశ్రాంతి నివ్వడంతో.. రాహుల్‌ సారథ్యంలో బరిలోకి దిగిన ద్వితీయ శ్రేణి జట్టుకు ఆతిథ్య జింబాబ్వే నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. బ్యాటింగ్‌లో అంతగా రాణించనప్పటికీ చెప్పుకోదగ్గ బౌలర్లే జింబాబ్వే జట్టులో ఉన్నారు. అయితే, ధవన్‌, గిల్‌, రాహుల్‌, దీపక్‌ హుడాలతో టీమిండియా బ్యాటింగ్‌ బలంగా కనిపిస్తోంది.

Updated Date - 2022-08-18T21:58:37+05:30 IST