Abn logo
Sep 25 2021 @ 01:32AM

కొలువుకు వేళాయె

నేడు జడ్పీ పాలకవర్గ ఎన్నిక

జడ్పీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిత్వంపై తేల్చని అధిష్ఠానం

ఏర్పాట్లలో ఉప్పాల హారిక కుటుంబం


ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం : జిల్లా పరిషత్‌ నూతన పాలకవర్గం శనివారం కొలువు తీరనుంది. జడ్పీ చైర్‌పర్సన్‌తోపాటు ఇరువురు జడ్పీ వైస్‌ చైర్మన్లు,   కో-ఆప్షన్‌ సభ్యులు,  జడ్పీటీసీ సభ్యుల బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. నూతన పాలకవర్గంతో కలెక్టర్‌ నివాస్‌ ప్రమాణ స్వీకారం చేయించ నున్నారు. ఈ ఎన్నికకు మురళీధర్‌రెడ్డి పరిశీలకులుగా వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని శాసనసభ్యులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు,  వైసీపీ నాయకులు హాజరు కానున్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ పెద్దల నుంచి వచ్చిన సంకేతాలతో గుడ్లవల్లేరు జెడ్పీటీసీ సభ్యురాలు ఉప్పాల హారిక చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. హారికకు జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి దాదాపు ఖరారైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


ప్రక్రియ ఇలా..

ఉదయం పది గంటలకు జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుల ఎంపికకు నామినేషన్లను స్వీకరించ నున్నట్టు సీఈవో సూర్యప్రకాశరావు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, ఒంటి గంటలోపు ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. ఒంటి గంటకు కో-ఆప్షన్‌ సభ్యులను ఎంపిక చేసి, ఫలితాలను వెల్లడిస్తామన్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు జడ్పీ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎంపిక జరుగుతుందన్నారు. జడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికైన వారు ఎన్నికల ధ్రువీకరణ పత్రం (ఫారం-29)ను తప్పనిసరిగా తమ వెంట తెచ్చుకోవాలని సూచించారు. బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్‌ అధికారులతో సీఈవో  చర్చించారు.


కొండాలమ్మ గుడి నుంచి  ఊరేగింపు

ఉప్పాల హారికకు జడ్పీ చైర్‌పర్సన్‌ పదవిని కేటాయించి నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో శనివారం ఉదయం గుడ్లవల్లేరు మండలం వేమవరం  కొండాలమ్మగుడి నుంచి ఊరేగింపు నిర్వహించనున్నారు.


పటిష్ట బందోబస్తు 

నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పురస్కరించు కుని మచిలీ పట్నంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ తెలిపారు. ఊరేగింపులకు అనుమతి లేదన్నారు. హాల్లోకి సభ్యులకు మాత్రమే ప్రవేశం ఉంటుందన్నారు. తాళ్లపాలెం వైపు వెళ్లే వాహనాలను లక్ష్మీటాకీస్‌ సెంటరు నుంచి పరాసుపేట సెంటరు మీదుగా, పెడన వైపు నుంచి వచ్చే వాహనాలు మార్కెట్‌ యార్డు రోడ్డువైపు నుంచి పట్టణంలోకి వెళ్లేలా అనుమతించామన్నారు.