జిల్లా సమస్యల ప్రస్తావనేదీ?

ABN , First Publish Date - 2022-05-28T07:00:48+05:30 IST

రాష్ట్ర మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయ భేరి పేరుతో చేపట్టిన బస్సు యాత్రలో జిల్లాకు సంబంధించిన సమస్యలను ఎక్కడా ప్రస్తావించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

జిల్లా సమస్యల ప్రస్తావనేదీ?
మంత్రుల బస్సు యాత్ర సభకు తుమ్మపాల నుంచి ఆటోల్లో డ్వాక్రా మహిళలను తరలిస్తున్న వైసీపీ నాయకులు

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు షుగర్‌ ఫ్యాక్టరీలు మూత

తాండవ, ఏటికొప్పాక రైతులు, కార్మికులకు రూ.50 కోట్ల మేర బకాయిలు

మూడేళ్ల నుంచి ఉత్తుత్తి పథకంగా మారిన సులజ స్రవంతి 

అసంపూర్తిగా సాగునీటి ప్రాజెక్టులు

అధ్వానంగా రహదారులు

అనకాపల్లి జిల్లాలో నాలుగు నియోజకవర్గాల మీదుగా సాగిన మంత్రుల బస్సు యాత్ర

మూడు గంటలు.. ఆరు సభలు

అమాత్యుల నోట ‘సామాజిక న్యాయ’ జపం

ఎక్కడా ఒక్క సమస్యను కూడా ప్రస్తావించని వైనం



(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయ భేరి పేరుతో చేపట్టిన బస్సు యాత్రలో జిల్లాకు సంబంధించిన సమస్యలను ఎక్కడా ప్రస్తావించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జాతీయ రహదారి మీదుగా సాగిన ఈ యాత్రకు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులను, డ్వాక్రా మహిళలను తరలించినప్పటికీ ప్రజల నుంచి ఎక్కడా అర్జీలు స్వీకరించలేదు. కేబినెట్‌లో 70 శాతం మంత్రి పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చి సీఎం జగన్మోహన్‌రెడ్డి సామాజిక న్యాయం పాటించారని పదే పదే చెప్పుకున్నారు. కాగా పాయకరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాబురావు, ఎస్‌.రాయవరం మండల నేతల మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి.

 ‘సామాజిక న్యాయభేరి’ పేరుతో రాష్ట్ర మంత్రులు గురువారం శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించిన బస్సు యాత్ర శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పెందుర్తి నియోజకవర్గం లంకెలపాలెం వద్ద అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించింది. ఇక్కడి నుంచి అనకాపల్లి, ఎలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాల మీదుగా మధ్యాహ్నం రెండు గంటలకు తూర్పుగోదావరి జిల్లాకు పయనమైంది. మొత్తం మూడు గంటలపాటు, ఆరు ప్రదేశాల్లో మంత్రులు ప్రసంగించారు. కానీ ఒక్కచోట కూడా జిల్లా సమస్యలను ప్రస్తావించలేదు. ప్రజల కోసం ప్రభుత్వం ఏం చేస్తుందనే విషయాన్ని పక్కన పెట్టి, 25 మంది మంత్రుల్లో 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు వున్నారని, సీఎం జగన్మోహన్‌రెడ్డి సామాజిక న్యాయం పాటించారని పదేపదే చెప్పుకున్నారు. 

జిల్లా సమస్యలను విస్మరించిన అమాత్యులు

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో ప్రధాన సమస్యలు ఏవీ పరిష్కారానికి నోచుకోలేదు. పైగా అనేక కొత్త సమస్యలు వచ్చాయి. ప్రధానంగా తుమ్మపాల సహకార చక్కెర కర్మాగారం మూతపడింది. తాండవ, ఏటికొప్పాక చక్కెర ఫ్యాక్టరీలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. ఈ రెండు ఫ్యాక్టరీలకు ఏడాదిన్నర క్రితం చెరకు సరఫరా చేసిన రైతులకు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. కార్మికులకు రెండేళ్ల నుంచి వేతనాలు అందడంలేదు. మొత్తంగా రూ.50 కోట్ల వరకు చెల్లించాల్సి వుంది. మంత్రుల బస్సు యాత్ర ఈ మూడు చక్కెర ఫ్యాక్టరీల పరిధి మీదుగా సాగడం, వీటి గురించి అమాత్యులు ఎక్కడా మాటమాత్రమైనా ప్రస్తావించకపోవడం ఈ సందర్భంగా గమనార్హం. 

మూడు జిల్లాలకు సాగు, తాగునీరు అందించడానికి రూపకల్పన చేసిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు మూడేళ్ల నుంచి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా వుంది. దీని గురించి కూడా నోరు మెదపలేదు. ఇంకా జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టుల ఆధునికీకరణ, అసంపూర్తిగా వున్న ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు, అధ్వానంగా వున్న రహదారుల అభివృద్ధి గురించి మాటమాత్రంగానైనా ప్రస్తావించలేదు.

అనకాపల్లి బెల్లం మార్కెట్‌ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇటీవల కాలంలో నల్లబెల్లం విక్రయాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో మార్కెట్‌లో ఐదు రోజులపాటు లావాదేవీలు నిలిచిపోయాయి. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలిన కొలగార్లు, కార్మిక సంఘాల నాయకులు మంత్రి బొత్స సత్యనారాయణకు వినతిపత్రం అందించారు. కానీ నల్లబెల్లం అమ్మకాలపై నిషేధానికి సంబంధించి వున్న జీవోను రద్దు చేసే విషయంలో ఎటువంటి హామీ ఇవ్వలేదు. 

యాత్ర సభలకు డ్వాక్రా మహిళల తరలింపు

మరోవైపు ‘సామాజిక న్యాయభేరి’ పేరుతో బలప్రదర్శన కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకున్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఆయా ప్రాంతాలకు పార్టీ శ్రేణులను తరలించారు. డ్వాక్రా సంఘాల మహిళలను బస్సులు, ఆటోల్లో తీసుకువచ్చారు. సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర ఆద్యంతం ఏళ్ల తరబడిగా జిల్లాలో పేరుకుపోయిన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై ఎటువంటి ప్రకటనలు చేయకుండా సాగిన మంత్రుల ప్రసంగాలకు విసుగుచెంది పలువురు మంత్రులు మాట్లాడుతుండగానే మెల్లగా జారుకోవడం కనిపించింది. 

‘పేట నేతల వర్గపోరు మరోసారి బహిర్గతం

రాష్ట్ర మంత్రుల బస్సు యాత్ర సందర్భంగా పాయరావుపేట నియోజకవర్గంలో వైసీపీ నేతల వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. ఎమ్మెల్యే గొల్ల బాబురావు అధ్యక్షతన  ఎస్‌.రాయవరం మండలం అడ్డరోడ్డు జంక్షన్‌లో సభ ఏర్పాటు చేశారు. దీనికి పార్టీ మండల ముఖ్యనేత బొలిశెట్టి గోవింద్‌, ఎంపీపీ బొలిశెట్టి శారదాకుమారి, జడ్పీటీసీ సభ్యురాలు కాకర దేవితోసహా వారి వర్గీయులు హాజరు కాలేదు. ఇదే మండలానికి చెందిన వైసీపీ జిల్లా కోశాధికారి గోవిందరావుతోపాటు 12 మంది సర్పంచ్‌లు, 13 మంది ఎంపీటీసీ సభ్యులు అడ్డరోడ్డు సభకు హాజరు కాకుండా నక్కపల్లిలో వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన బస్సుయాత్ర సభకు హాజరయ్యారు. ఎమ్మెల్యే బాబురావు నక్కపల్లి సభలో కనిపించక పోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2022-05-28T07:00:48+05:30 IST