లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మూడు రోజుల క్రితం జికా వైరస్ కేసు బయపటడడంతో అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి బృందాన్ని రాష్ట్రానికి పంపింది. ఈ నెల 22న కాన్పూరుకు చెందిన 57 ఏళ్ల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారంట్ ఆఫీసర్ జికా వైరస్ బారినపడ్డారు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతుండడంతో ఎయిర్ ఫోర్స్ ఆసుపత్రిలో చేరారు.
కేంద్రం యూపీకి పంపిన బృందంలో నేషనల్ వెక్టార్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఆర్ఎంఎల్ ఆసుపత్రులకు చెందిన కీటక శాస్త్రవేత్త, ప్రజారోగ్య శాస్త్రవేత్తలు, గైనకాలజిస్టు ఉన్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి ఈ బృందం కలిసి పనిచేస్తుంది. క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షిస్తుంది. జికా వైరస్ కట్టడికి తగిన చర్యలు తీసుకుంటుంది.