Oct 20 2021 @ 21:46PM

‘జీ5’లో ‘హెడ్స్ అండ్ టేల్స్’ విడుదలకు రెడీ

ఇటీవల జీ5లో విడుదలైన ‘రాజ రాజ చోర’ సినిమా ఓటీటీ మాధ్యమంలో బిగ్గెస్ట్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జీ5 ఒరిజినల్ మూవీ ‘హెడ్స్ అండ్ టేల్స్’ను వీక్షకుల ముందుకు తీసుకొస్తోంది. శ్రీవిద్య మహర్షి, దివ్య శ్రీపాద, సునీల్, చాందిని రావు ప్రధాన పాత్రల్లో నటించిన ‘జీ 5’ ఒరిజినల్ మూవీ ‘హెడ్స్ అండ్ టేల్స్’. ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ కథ అందించారు. ఆ సినిమాలో నటించిన సాయికృష్ణ ఎన్రెడ్డి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 22 నుండి ‘జీ 5’లో స్ట్రీమింగ్ కానుందీ సినిమా. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు.

‘అందరి కథలు ఒకే విధములు... కథనము మారే గతే బ్రతుకులు’ అంటూ సునీల్ వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ ట్రైలర్‌లో నటి కావాలని కోటి కలలతో హైదరాబాద్ వచ్చిన ఒక అమ్మాయిగా శ్రీవిద్య... పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న అమ్మాయిగా దివ్య శ్రీపాద... సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయిగా చాందిని రావు నటించారు. సునీల్ భగవంతుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ ముగ్గురు అమ్మాయిల జీవితాల్లో కామన్ పాయింట్ ఏంటి? అమ్మాయిలకు వాళ్ల జీవితాల్లో అబ్బాయిల నుండి ఎటువంటి సమస్యలు ఎదురయ్యాయి? తమకు ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారు? అనేదే ఈ సినిమా అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఈ ట్రైలర్‌కు మంచి స్పందన రావడం పట్ల దర్శకనిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. ‘ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిది’ అని ‘జీ 5’ వర్గాలు తెలిపాయి.