Rahul Gandhiపై తప్పుడు కథనం.. జీ న్యూస్ యాంకర్‌కు అరెస్ట్ నుంచి ఉపశమనం

ABN , First Publish Date - 2022-07-08T23:27:42+05:30 IST

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేయని వ్యాఖ్యలను చేసినట్టుగా తప్పుడు వార్త ప్రసారం చేసిన కేసులో

Rahul Gandhiపై తప్పుడు కథనం.. జీ న్యూస్ యాంకర్‌కు అరెస్ట్ నుంచి ఉపశమనం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేయని వ్యాఖ్యలను చేసినట్టుగా తప్పుడు వార్త ప్రసారం చేసిన కేసులో జీ న్యూస్ యాంకర్ రోహిత్ రంజన్‌ (Rohit Ranjan)కు అరెస్ట్ నుంచి ఉపశమనం లభించింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌‌లలో నమోదైన కేసుల్లో తనను అరెస్ట్ చేయకుండా పోలీసులను ఆదేశించాలంటూ రోహిత్ రంజన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై ఎలాంటి బలవంతపు చర్య తీసుకోకుండా రక్షణ కల్పించడమే కాకుండా తనపై నమోదైన కేసులన్నీ క్లబ్ చేయాలని కోర్టును అభ్యర్థించారు.  


తనకు, తన కుటుంబ సభ్యులకు, ఆ ప్రోగ్రామ్‌తో సంబంధం ఉన్న తన సహచరులకు భద్రత కల్పించాలన్న రంజన్ పిటిషన్‌పై అటార్నీ జనరల్ కార్యాలయం ద్వారా కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. అలాగే, ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. వివాదాస్పదమైన ఆ న్యూస్ ప్రోగ్రాంలో రంజన్ ప్రసారం చేసిన వీడియోలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కేరళలోని తన కార్యాలయంపై దాడిచేసిన వారిని చిన్నపిల్లలుగా అభివర్ణించారు.. వారిపై తనకు ఎలాంటి కోపమూ లేదని పేర్కొన్నారు.


అయితే, యాంకర్ రోహిత్ రంజన్ మాత్రం.. ఉదయ్‌పూర్ దర్జీ హంతకులను రాహుల్ చిన్నపిల్లలుగా పేర్కొన్నారని పదేపదే చెప్పుకొచ్చారు. అయితే, ఆ తర్వాత తప్పు గ్రహించిన రోహిత్ రంజన్ క్షమాపణలు చెప్పారు. చానల్ కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. మరోవైపు, మంగళవారం రంజన్‌ను అరెస్ట్ చేసేందుకు చత్తీస్‌గఢ్ (Chhattishgarh) నుంచి ఓ పోలీసు బృందం ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌ (Ghaziabad)లో ఉన్న రంజన్ ఇంటికి వెళ్లింది.


ఈ క్రమంలో ఆయన అరెస్ట్ విషయంలో ఇరు రాష్ట్రాల పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. చివరికి నోయిడా పోలీసులు రంజన్‌ను అదుపులోకి తీసుకుని ఆపై అదే రోజు రాత్రి బెయిలుపై విడిచిపెట్టారు. ఆ తర్వాతి నుంచి చత్తీస్‌గఢ్ పోలీసులకు రంజన్ కనిపించడం లేదు. ఆయన కార్యాలయానికి వెళ్లినా ఆచూకీ లేకుండా పోయింది. దీంతో నోయిడా (Noida), ఘజియాబాద్ పోలీసులపై చట్టపరమైన చర్యలకు చత్తీస్‌గఢ్ పోలీసులు సిద్ధమవుతున్నారు.

Updated Date - 2022-07-08T23:27:42+05:30 IST