Al Qaeda Chief Killed : అల్ జవహరీ ఉగ్ర చరిత్ర ఇదీ.. అతడి తలపై ఏకంగా రూ.196 కోట్ల రివార్డ్..

ABN , First Publish Date - 2022-08-02T17:27:01+05:30 IST

‘‘ సామూహిక హత్యలు ప్రతి ముస్లింకి మతపరమైన బాధ్యత. మీ దేశంలో దీనిని సాధ్యమైనంత చేయండి ’’ ఈ వ్యాఖ్యలు చాలు అమెరికా అంతమొందించిన అల్‌ఖైదా (Al Q

Al Qaeda Chief Killed : అల్ జవహరీ ఉగ్ర చరిత్ర ఇదీ.. అతడి తలపై ఏకంగా రూ.196 కోట్ల రివార్డ్..

వాషింగ్టన్ : ‘‘ సామూహిక హత్యలు ప్రతి ముస్లింకి మతపరమైన బాధ్యత. మీ దేశంలో దీనిని సాధ్యమైనంత చేయండి ’’ ఈ వ్యాఖ్యలు చాలు అమెరికా అంతమొందించిన అల్‌ఖైదా (Al Qaeda) చీఫ్ అయ్‌మాన్ అల్-జవహరీ(Ayman al-Zawahiri) ఎంత క్రూరుడో చెప్పడానికి. 1998లో ఈ నరహంతకుడు చేసిన వ్యాఖ్యలు న్యూయార్క్ 9/11 దాడుల నుంచి లండన్, బాగ్దాద్ వరకు అనేక ఉగ్రదాడులకు పురిగొల్పాయి. ఎంతోమంది అమాయకుల ప్రాణాలు కోల్పోయిన దాడులకు అల్ జవహరీ బాధ్యుడిగా ఉన్నాడు. అల్ ఖైదా నాయకత్వంలో బిన్ లాడెన్ తర్వాత రెండవ అత్యున్నత స్థానంలో అల్ జవహరీ కొనసాగాడు. 9/11 దాడులకు కుట్రలో లాడెన్‌తోపాటు భాగస్వామిగా ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ హింసకు ఉగ్రవాదులను పురిగొల్పాడు. దీంతో అతడి తలపై మొత్తం 25 మిలియన్ డాలర్లు(సుమారు రూ.196 కోట్లు) రివార్డ్ ఉంది.


వేటకు 21 ఏళ్లు పట్టింది..

‘ ఎంతకాలం పట్టిందన్నది కాదు.. ఎక్కడున్నా వదిలిపెట్టబోమన్నది ముఖ్యం..’ అంటూ అల్‌ఖైదా (Al Qaeda) చీఫ్ అయ్‌మాన్ అల్-జవహరీ(Ayman al-Zawahiri)ని  మట్టుబెట్టిన తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) చేసిన వ్యాఖ్యలివి. బైడెన్ ప్రస్తావించినట్టే జవహరీని అంతమొందించడానికి అమెరికా సేనలకు ఎక్కువకాలమే పట్టింది. దాదాపు 3 వేల మంది అమెరికన్లను పొట్టనపెట్టుకున్న 9/11 దాడుల్లో జవహరీ కూడా కీలక సూత్రధారి. సెప్టెంబర్‌ 2001లో జరిగిన ఈ దాడుల ప్రధాన మాస్టర్‌మైండ్ ఒసామా బిన్ లాడెన్‌(Osama bin Laden)ను అమెరికా సేనలు మే 2011లోనే తుదముట్టించాయి. అయితే జవహరీ ఆచూకీని మాత్రం పసిగట్టలేకపోయాయి. పసిగట్టి చంపడానికి దాదాపు 21 సంవత్సరాల సమయం పట్టింది. తుదకు జవహరీని కూడా బిన్ లాడెన్ వద్దకే పంపించింది.


చనిపోయాంటూ వార్తలు..

వేలాది మంది అమెరిన్ల ప్రాణాలు తీసిన 9/11 దాడుల్లో కీలక సూత్రధారుల్లో ఒకడిగా ఉన్న జవహరీ.. ఆరోగ్యం బాగాలేక చనిపోయాడంటూ కొన్నాళ్ల క్రితం వార్తాలు వచ్చాయి. కానీ జులైలో ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన రిపోర్టు అతడు బతికే ఉందని చెప్పింది. అల్ జవహరీ బతికే ఉన్నాడని, స్వేచ్ఛగా తిరుగాడుతున్నాడని వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు తిరిగి అధికారం చేజిక్కించుకోవడంతో అతడు మళ్లీ దాడులకు పాల్పడే ముప్పుపొంచివుందని హెచ్చరించింది. అఫ్ఘాన్‌లో ఉగ్రవాదులను సంఘటితం చేసే అవకాశాలున్నాయని సూచించింది. ఈ ప్రకటన వచ్చిన కొన్ని రోజుల వ్యవధిలోనే అమెరికా  అంతమొందించింది. 


తగిన శాస్తే జరిగింది..

జవహరీని అంతమొందించడంపై చార్లెస్ ఉల్ఫ్ అనే అమెరికన్ స్పందించాడు. ‘‘ 9/11 దాడుల్లో నా భార్యను కోల్పోయాను. అల్ జవహరీ చనిపోయాడనే వార్త గొప్పగా అనిపించింది. జవహరీ చావు కోల్పోయినవారిని తిరిగి తెచ్చివ్వలేదు. కాకపోతే ఈ చర్య ప్రపంచాన్ని సురక్షితంగా ఉంచుతుంది. ఇక అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందిస్తూ.. సంఘ విద్రోహక సామూహిక హత్యల మాస్టర్ ఇక లేడని వ్యాఖ్యానించారు. ఈ విజయాన్ని అమెరికన్లు అందరూ స్వాగతించాలని పేర్కొన్నారు. 


2011లో ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా చంపినప్పటికీ ఇటివల కాలంలో జిహాదీ ముప్పు పెరుగుతోందని అమెరికా గమనించింది. ముఖ్యంగా అల్ ఖైదా నెట్‌వర్క్ విస్తరణకు విరోధి దేశం ఇరాన్ సాయపడుతోందని అమెరికా బలంగా నమ్ముతోంది. ముఖ్యంగా ఫిలిప్పైన్స్ సహా మధ్యప్రాశ్చ్య దేశాలు, ఆఫ్రికా దేశాల్లో అల్ ఖైదా నెట్‌వర్క్‌లకు ఇరాన్ సహకరిస్తోందని అమెరికా భావిస్తోంది. జవహరీ అంతమైనా నెట్‌వర్క్ ఇంకా క్రియాశీలకంగానే ఉన్నాయని ఆందోళన చెందుతోంది. మరోవైపు అమెరికా జరిపిన ఈ దాడితో అఫ్ఘనిస్తాన్ ఉగ్రమూకలకు స్థావరంగా మారుతోందని తేటతెల్లమైంది. దీంతో దోహా ఒప్పందాన్ని అఫ్ఘనిస్తాన్ ఉల్లంఘించడమేనని అమెరికా విమర్శించింది. జవహరి అక్కడే ఉన్నాడనే విషయం అఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి ముందే తెలుసనని చెబుతోంది.

Updated Date - 2022-08-02T17:27:01+05:30 IST