వైసీపీలో వైవీ సుబ్బారెడ్డి కలకలం

ABN , First Publish Date - 2021-07-06T07:13:21+05:30 IST

వైసీపీ రాష్ట్ర నాయకుడు, టీటీడీ మాజీ చైర్మన్‌..

వైసీపీలో వైవీ సుబ్బారెడ్డి కలకలం

ఎమ్మెల్సీ, మంత్రి పదవి వైపు చూపు?


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు): వైసీపీ రాష్ట్ర నాయకుడు, టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటన, చేసిన ప్రకటన రాజకీయంగా ఆ పార్టీలో కలకలం సృష్టించింది. తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని భావిస్తున్నట్లు వైవీ వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. జిల్లాలో సీఎం కుటుంబ బంధువులుగా వైవీ, మంత్రి బాలినేని ఉన్నారు. 2014లో ఒంగోలు ఎంపీగా గెలుపొందిన వైవీని 2019లో పోటీ నుంచి తప్పించి ఆయన స్థానంలో మాగుంటను రంగంలోకి దింపి ఆశించిన ఫలితాన్ని వైసీపీ పొందింది. తదనంతరం వైవీకి టీటీడీ చైర్మన్‌ పదవిని ఇచ్చినప్పటికీ క్రమేపీ జిల్లాలో పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంచారు. ఈ నేపథ్యంలో ఇటీవల వైవీ టీటీడీ చైర్మన్‌ పదవీకాలం ముగిసింది. దీంతో ఆయన రాజకీయ భవితవ్యం ఏమిటనే అంశం చర్చకొచ్చింది. గత ఎన్నికల్లో ఎంపీ పోటీ నుంచి తప్పించినప్పుడే వైవీ భవిష్యత్తులో రాజ్యసభ స్థానం ఇవ్వాలని కోరారని, అందుకు జగన్‌ ఆమోదించారన్న ప్రచారం ఉంది. అయితే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ఢిల్లీలో చక్రం తిప్పుతున్న నేపథ్యంలో ఖాళీ అయిన స్థానాల నుంచి వైవీకి అవకాశం కల్పించకపోవటం విశేషం.


మంత్రి పదవి కోసం..

ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేసి తొలి మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసిన సమయంలో రెండున్నరేళ్లకు మంత్రి వర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తానని ప్రకటించారు. కనీసం 80శాతం మందిని తొలగించి కొత్తవారికి అవకాశం ఇస్తానని వెల్లడించారు. ఆ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వైవీ  భవిష్యత్తులో వచ్చే రాజ్యసభ సభ్యత్వం తీసుకుని ఢిల్లీలో చక్రం తిప్పే ప్రయత్నం చేస్తారా లేక ఎమ్మెల్సీగా ఎంపికై మంత్రివర్గంలో స్థానం కోసం ప్రయత్నిస్తారా అన్న ఊహాగానాలు వచ్చాయి. ఆయన్ను తిరిగి టీటీడీ చైర్మన్‌గానే కొనసాగించాలని జగన్‌ భావిస్తున్నట్లు వెల్లడైంది. 


వైఖరి మార్చిన వైవీ

ఈ నేపథ్యంలో జిల్లాకు వచ్చిన వైవీ గత రెండేళ్లలో లేని పోకడను ప్రదర్శించారు. సింగరకొండలోని ఆంజనేయస్వామి దేవాలయంలో సొంత నిధులతో నిర్మించిన పొంగలిశాల ప్రారంభానికి ఆయన ఆదివారం వచ్చారు. ఈ సందర్భంగా గత రెండున్నరేళ్లలో ఎప్పుడూ లేనివిధంగా ఆయన పీఏ అటు అద్దంకి నియోజకవర్గంలోను, ఇటు జిల్లాలోను వైసీపీలోని పలువురు నేతలకు ఫోన్‌చేసి కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. అద్దంకి నియోజకవర్గంతోపాటు, ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గంలోనూ, చివరికి మంత్రి బాలినేని ప్రాతినిధ్యం వహిస్తున్న ఒంగోలు సెగ్మెంట్‌లో గతంలో వైవీతో సన్నిహితంగా ఉన్న నాయకులను కూడా ఫోన్లు చేసి పిలిచారు. దీంతో వైవీకి స్వాగతం పలికేందుకు లేక ఒంగోలులో ఆయనను కలిసేందుకు అద్దంకి నియోజకవర్గం కన్నా జిల్లాలోని ఇతర ప్రాంతాల వారు అధికంగా వచ్చారు. అద్దంకి నియోజకవర్గం నుంచి అసమ్మతివాదులుగా పేరుపొందిన వారంతా ముందుండి వైవీ కార్యక్రమాలను నిర్వహించారు.


కీలకమైన ప్రకటన 

ఈ కార్యక్రమాల అనంతరం ఒంగోలులోని తన నివాసంలో వైవీ చేసిన ప్రకటన కీలకంగా మారింది. ప్రత్యేకించి సీఎం జగన్‌ కుటుంబానికి చెందిన చానల్‌ వారిని పిలిపించుకుని ఆయన ప్రకటన ఇవ్వటమే గాక అది ప్రచారమయ్యే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. ఆ ప్రకటనలో తనకు ప్రత్యక్ష రాజకీయాల మీద ఆసక్తి ఉందని, ఈ వైపే రావాలనుకుంటున్నానని స్పష్టంగా వెల్లడించారు. తద్వారా టీటీడీ చైర్మన్‌ పదవిని తిరిగి ఆశించటం లేదనే విషయాన్ని చెప్పకనే చెప్పారు.  పూర్వకాలం నుంచి పార్టీలో పనిచేసిన వారికి అన్యాయం జరుగుతోందని, వారందరికీ న్యాయం జరగాలంటే తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలి అన్న తరహాలో ఆయన మాటలు ఉన్నాయి.  సొంత జిల్లాకు వచ్చి వైవీ ఇలాంటి ప్రకటన చేయటంలోని ఆంతర్యం ఏమిటనేదే చర్చనీయాంశమైంది. రాజ్యసభ పదవిని ఆశిస్తున్నారా, మంత్రి పదవి కోసం ప్రయత్నాల్లో ఉన్నారా అనే విషయాన్ని పక్కనబెడితే జిల్లాలో కోల్పోతున్న పెత్తనాన్ని కూడా వైవీ తిరిగి కోరుకుంటున్నారనే భావన వారి అనుచరుల ద్వారా తెలుస్తోంది. త్వరలో మంత్రివర్గ విస్తరణ ప్రచారం నేపథ్యంలో వైవీ తీసుకున్న నిర్ణయం కీలకమైంది. మరి జగన్‌  నిర్ణయం ఎలాంటి ఉంటుందో వేచి చూడాలి. 


Updated Date - 2021-07-06T07:13:21+05:30 IST