విప్లవ కథానాయకుడు ‘రెడ్ స్టార్’ మాదాల రంగారావు స్వయంగా కథను సమకూర్చి నటించి, స్వీయ సారథ్యంలో నిర్మించిన చిత్రం ‘యువతరం కదిలింది’. 1980 ఆగస్ట్ 15న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో యువతరాన్ని ఉర్రూతలూగించి, ఉవ్వెత్తున కదిలించి సంచలన విజయం సాధించింది. యువతకు ల్యాండ్ మార్క్ ఫిల్మ్‌గా ఈ చిత్రం నిలిచింది. ఇక ఈ చిత్రం విడుదలై నేటికి (2020, ఆగస్ట్ 15) 40 సంవత్సరాలు.
1980 ఆగస్ట్ 15న విడుదలైన ఈ చిత్రం ఉత్తమ ద్వితీయ చిత్రంగా నంది అవార్డు అందుకోవడంతో పాటు.. ఉత్తమ కథా రచయితగా మాదాలకు, ఉత్తమ నటుడిగా డాక్టర్ ప్రభాకర్ రెడ్డికి కూడా నంది అవార్డులు తెచ్చిపెట్టింది. అప్పటి రాష్ట్రపతి స్వర్గీయ నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి భవన్లో ప్రత్యేకంగా వీక్షించి ప్రశంసించిన ఈ చిత్రం ‘సితార, కళాసాగర్’ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను సైతం అందుకొంది.