Abn logo
Jun 1 2021 @ 18:56PM

వ్యక్తిత్వాన్ని మేలుకొలిపే రామకృష్ణ మఠం ‘యువ సంఘర్ష్’

రామకృష్ణ మఠం అంటే కేవలం మూర్తిత్రయం బోధనలను ప్రపంచానికి చేరవేసే సంస్థ మాత్రమే కాదు. యువతలో అంతర్గతంగా దాగున్న శక్తులను మేల్కొలిపి బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడంలో తనకు తానే సాటిగా నిలుస్తోంది. వ్యక్తిత్వం, శీల నిర్మాణంలో తనదైన పాత్ర పోషించడమేగాక.. సామాజిక సేవలో యువతను ముందుకు తీసుకువెళుతోంది. ‘యువతా మేలుకోండి.. మీ శక్తిని తెలుసుకోండి’ అంటూ శక్తిమంతమైన నాయకులుగా తయారు చేస్తోంది. ప్రపంచ స్థాయి వ్యక్తులుగా యువతను తీర్చిదిద్దేందుకు ఆర్కే మఠం వినూత్న కార్యక్రమాలను చేపడుతుంటుంది. కరోనా విపత్కర పరిస్థితులలోనూ తన జ్ఞాన, కర్మ యజ్ఞాన్ని అవిశ్రాంతంగా కొనసాగిస్తోంది. అందులో భాగంగా ‘యువ సంఘర్ష్ -2021’ పేరిట స్వామి వివేకానంద యూత్ లీడర్షిప్ అవార్డ్ పోటీలను నిర్వహిస్తోంది.   


‘వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్సీ’ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీలకు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈలకు చెందిన 11, 12 తరగతి పిల్లలతో పాటు రాష్ట్ర స్థాయి ఇంటర్మీడియట్ వాళ్లు కూడా అర్హులు. జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీలు ఆంగ్ల మాధ్యమంలో ఉంటాయి. మొత్తం ఐదు రౌండ్లలో పోటీలు నిర్వహిస్తారు. ఒక విజేతను ప్రకటిస్తారు. మూర్తిత్రయమైన రామకృష్ణపరమహంస, శారదామాత, స్వామి వివేకానంద బోధనలు, రామకృష్ణ మఠం సాహిత్యం నుంచి ప్రశ్నలు, గ్రూప్ యాక్టివిటీస్ ఉంటాయి. వక్తగా, కేవలం మాటలు మాత్రమే కాకుండా.. వివేకానందుల బోధనలను ఆచరణలో పెట్టే యోగ్యత కలిగిన వారిని గుర్తించే పనిలో భాగంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.  కోవిడ్ కారణంగా ఆన్‌లైన్‌లో పోటీలు ఏర్పాటు చేశారు. పోటీలలో పాల్గొనదలచిన వారు https://rkmath.org/ys/ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.


మొదటి రౌండ్‌ ఇలా...


పోటీకి ఎంపికైన అభ్యర్థి రామకృష్ణమఠం సాహిత్యం నుంచి తనకు నచ్చిన ఏదైనా ఒక పుస్తకాన్ని ఎంచుకుని దానిపై మాట్లాడాలి. దాన్నుంచి కొన్ని ప్రశ్నలు ఉంటాయి. స్వామిజీ బోధనలను ఎంతగా అర్థం చేసుకున్నారో లనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ రౌండ్.  


రెండో రౌండ్‌లో..


నిర్వాహకులు ఇచ్చిన అంశంపై వ్యాసం రాయాలి. అలాగే ఉపన్యాసించాల్సి ఉంటుంది. ప్రశ్నలు కూడా ఉంటాయి. వారు అడిగిన వాటికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. 


మూడో రౌండ్.. క్వార్టర్ ఫైనల్ 


ఈ రౌండ్‌లో గ్రూప్ యాక్టివిటీ ఉంటుంది.  ప్రాజెక్ట్ ఇస్తారు. దాన్ని నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలి.  


నాలుగో రౌండ్ అనగా... సెమీ ఫైనల్


మనకు నచ్చిన స్ఫూర్తిదాయకమైన నాయకుడిని(రాజకీయ నాయకులు మినహా) ఎంచుకోవాలి. వారి గురించి మాట్లాడాల్సి ఉంటుంది. వాళ్ల జీవితం నుంచి ఏమి నేర్చుకున్నాం? ఆచరణలో ఎంత వరకు పెడుతున్నాం. అనే అంశాలు దీనిలో ఉంటాయి. ఇక ఈ రౌండ్‌లో ఎవరైతే న్యాయనిర్ణేత ఉంటారో వారు ఒక విషయంపై మాట్లాడతారు. ప్రశ్నలు అడుగుతారు. ఏకాగ్రత, వినికిడి శక్తి, అవగాహన శక్తిపై పరీక్ష ఇది.  


చివరిది.. ఫైనల్ రౌండ్


ఈ రౌండ్‌లో కూడా గ్రూప్ యాక్టివిటీ ఒకటి ఉంటుంది. అలాగే ‘స్ట్రెస్ ఇంటర్వ్యూ’ ఉంటుంది. ప్రశ్నలు ఛాలెంజింగ్‌గా విసురుతారు. అందుకనుగుణంగా సమాధానాలు చెప్పిన వారిని విజేతగా ఎంపిక చేస్తారు.  


ఈ పోటీల గురించి గతేడాది యువ సంఘర్ష్ పోటీలలో చివరి వరకు నిలిచిన విద్యార్థి లీలా మహేశ్ మాట్లాడుతూ.. ‘‘మన గురించి మనం తెలుసుకొనేలా ఈ పోటీ ఉంటుంది. ఏం చేశాను? ఏం చేస్తున్నాను? ఏం చేయబోతున్నాను? అనే స్పష్టత వస్తుంది. అసలు పోటీ వాతావరణమే ఉండదు. చాలా సహజ సిద్ధంగా జరుగుతుంది. ఈ అనుభవం చాలా గొప్పగా ఉంటుంది. ప్రపంచాన్ని కొత్త కోణంలో చూస్తారు. వ్యక్తిత్వ, శీల నిర్మాణం జరుగుతుంది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలకు ఈ పోటీలలో పాల్గొన్నవారు ఎంపికయ్యారంటే... ఇది ఇచ్చే ఆత్మవిశ్వాసం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు’’ అంటూ తన అనుభవాలను పంచుకున్నాడు.