నేను దీక్ష చేస్తేనే ప్రభుత్వంలో కదలిక

ABN , First Publish Date - 2021-09-17T09:14:22+05:30 IST

తాను దీక్ష చేస్తేనే చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడు రాజును పట్టుకోవడంలో ప్రభుత్వంలో కదలిక వచ్చిందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ‘‘వారం రోజులుగా పోలీసులు

నేను దీక్ష చేస్తేనే ప్రభుత్వంలో కదలిక

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ గురించి ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాన్ని చూపుతున్న షర్మిల

హత్యాచార నిందితుడికి దేవుడే శిక్ష విధిస్తే.. మరి ముఖ్యమంత్రి ఎందుకు ఉన్నట్టు: షర్మిల


హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): తాను దీక్ష చేస్తేనే చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడు రాజును పట్టుకోవడంలో ప్రభుత్వంలో కదలిక వచ్చిందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ‘‘వారం రోజులుగా పోలీసులు నిందితుడిని పట్టుకోలేదు. ప్రభుత్వం స్పందించలేదు. దీంతో మేం బుధవారం నిరసన దీక్ష చేశాం. మేం దీక్ష చేసిన తర్వాతే ప్రభుత్వంలో చలనం వచ్చింది. హోంమంత్రితో పాటు గిరిజన మంత్రి బాధిత కుటుంబాన్ని పరామర్శించి సాయం చేస్తామని చెప్పారు’’ అని ఆమె పేర్కొన్నారు. గురువారం లోట్‌సపాండ్‌లో షర్మిల మీడియాతో మాట్లాడారు.  ‘‘చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. అసమర్థ ప్రభుత్వం, పోలీసులు చేయని న్యాయం.. ఆ దేవుడు చేశాడు. ఇది ముమ్మాటికీ కేసీఆర్‌ వైఫల్యమే. దేవుడే శిక్ష వేస్తుంటే మరి ముఖ్యమంత్రి ఎందుకు ఉన్నట్టు? ఇంతటి భయానక హత్యాచారాలు జరుగుతుంటే నిందితుల్ని పట్టుకుని, కఠినంగా శిక్షించకపోవడంతోనే హత్యాచారాలు జరుగుతున్నాయి. దీనికి నిదర్శనమే ఈ రోజు జగిత్యాలలో ఐదేళ్ల చిన్నారిపై జరిగిన దాడి, హైదరాబాద్‌లో తొమ్మిదేళ్ల బాలికపై జరిగిన అత్యాచారయత్నం.


రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి, డ్రగ్స్‌, మద్యం విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. కేసీఆర్‌ సీఎం అయ్యాక మహిళలపై అత్యాచారాలు 300 శాతం పెరిగిపోయాయి. దీనికి కారణం.. గల్లీకో బారు.. వీధికో వైన్‌ షాప్‌.. ఎక్కడికి వెళ్లినా మద్యం ఏరులై పారుతోంది’’ అని షర్మిల అన్నారు. కాగా, చిన్నారి హత్యాచార ఘటనపై సీఎం కేసీఆర్‌ స్పందించాలంటూ షర్మిల చేపట్టిన దీక్షను బుధవారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. సింగరేణి కాలనీలో బుధవారం మధ్యాహ్నం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం అనూహ్యంగా ఆమె అక్కడే నిరాహార దీక్షకు కూర్చున్నారు.


కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఇంకెన్నాళ్లు కడతారు?

హైదరాబాద్‌లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఇంకెన్నాళ్లు కడతారని సీఎం కేసీఆర్‌ను షర్మిల ప్రశ్నించారు. దానిని పూర్తిచేస్తే నిఘా వ్యవస్థ మరింత అందుబాటులోకి వచ్చేదని అన్నారు. ఏళ్ల నుంచి కడుతున్న ఈ సెంటర్‌పై రూ.వందల కోట్లు వెచ్చించారని విమర్శించారు.

Updated Date - 2021-09-17T09:14:22+05:30 IST