మోసగాడు కేసీఆర్‌ని దేనితో కొట్టాలి?

ABN , First Publish Date - 2022-04-18T08:52:30+05:30 IST

తన మాయమాటలతో రైతులను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ని దేనితో కొట్టాలని వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. ఆయన చెప్పిన ఒక్క మాటతో, చేసిన ఒక్క సంతకంతో రాష్ట్రంలో 17 లక్షల

మోసగాడు కేసీఆర్‌ని దేనితో కొట్టాలి?

సీఎం నిర్వాకంతో 17లక్షల మంది రైతులకు నష్టం

ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలి: షర్మిల

కొత్తగూడెం ఎమ్మెల్యేపై చర్యలకు డిమాండ్‌


సుజాతనగర్‌, ఏప్రిల్‌ 17: తన మాయమాటలతో రైతులను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ని దేనితో కొట్టాలని వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. ఆయన చెప్పిన ఒక్క మాటతో, చేసిన ఒక్క సంతకంతో రాష్ట్రంలో 17 లక్షల మంది రైతులు నష్టపోయారని ఆమె విమర్శించారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర 58వ రోజైన ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్‌ మండలంలో కొనసాగింది. ఉదయం పాత అంజనాపురం క్యాంప్‌ నుంచి ప్రారంభమైన యాత్ర.. సింగభూపాలెం, సుజాతనగర్‌, సీతంపేట బంజర, కోమటిపల్లి, చింతలతండా, పాత నిమ్మలగూడెం, నిమ్మలగూడెం గ్రామాల మీదుగా కొనసాగింది.


సుజాతనగర్‌లో ‘రైతుగోస’ మహాధర్నాలో, కోమటిపల్లి గ్రామంలో గ్రామస్థులతో మాట-ముచ్చట కార్యక్రమంలో షర్మిల మాట్లాడారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొంటుంది కాబట్టి ఎవరూ మాట్లాడకూడదని, ఎవరైనా టీఆర్‌ఎస్‌ గురించి తప్పుగా మాట్లాడితే వరి కంకులతో కొట్టాలని వరి కొనుగోళ్లపై పల్లా రాజేశ్వరరెడ్డి అనే ఎమ్మెల్సీ అన్నారు. మరి 17 లక్షల ఎకరాల్లో వరి సాగుచేయకుండా అడ్డుకున్న కేసీఆర్‌ను ఏ చీపురుతో కొట్టాలి? రైతులను మోసం చేస్తున్నందుకు ముఖ్యమంత్రిని ఏ చెప్పులతో కొట్టాలి?’’ అని షర్మిల నిలదీశారు. వరి వేయవద్దని చెప్పి రైతులను మోసగించిన కేసీఆర్‌ ఎకరాకు రూ.25 వేల పరిహారం రైతులకు అందించాలని ఆమె డిమాండ్‌ చేశారు. అలాగే కొత్తగూడెం ఎమ్మెల్యే కుమారుడు చేసిన అరాచకాలకు చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారని, ఇంతవరకు ఆ ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు. కాగా యాత్ర అయిపోయిన తర్వాత రాత్రి సజాతనగర్‌ మండలంలోని గరీబ్‌పేట వద్ద ఆమె బసచేశారు.


నేటి పాదయాత్ర షెడ్యూల్‌

షర్మిల పాదయాత్ర 59వ రోజైన సోమవారం గరీబ్‌పేట నుంచి ప్రారంభమవుతుంది. గరీబ్‌పేటలో జరిగే రైతుగోస ధర్నాలో ఆమె పాల్గొంటారు. అనంతరం లక్ష్మీదేవిపల్లి మండలంలోని రుద్రంపూర్‌, రామవరం, ఎస్‌సీబీ నగర్‌ మీదుగా కొత్తగూడెం చేరుకుంటారు. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత కొత్తగూడెం త్రీటౌన్‌ పరిధిలో బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి లక్ష్మీదేవిపల్లిలో బసచేస్తారు.

Updated Date - 2022-04-18T08:52:30+05:30 IST