మృతుడు రవిది ప్రభుత్వ హత్య: Sharmila

ABN , First Publish Date - 2021-12-11T18:29:05+05:30 IST

జిల్లాలోని హావేలి ఘనపూర్ మండలం బొగుడ భూపతిపూర్‌లో రైతు రవి కుటుంబాన్ని వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల పరామర్శించారు.

మృతుడు రవిది ప్రభుత్వ హత్య: Sharmila

మెదక్: జిల్లాలోని హావేలి ఘనపూర్ మండలం బొగుడ భూపతిపూర్‌లో రైతు రవి కుటుంబాన్ని వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల పరామర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత్రి మాట్లాడుతూ రైతు భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తారని... రైతు గుండె ఆగిపోయేలా  కేసీఆర్ చేస్తున్నారని మండిపడ్డారు. వడ్లు వేయాల్సిన రైతు ఉరి ఎందుకు వేసుకుంటున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ది నియంత పాలన అని అన్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆదుకోవడం లేదని... కుటుంబాలను పోషించలేని స్థితిలో రైతులున్నారని తెలిపారు. ధాన్యం కుప్పల మీద రైతులు చనిపోయే దౌర్భాగ్య స్థితి తెలంగాణలో ఉందని షర్మిల అన్నారు. తెలంగాణ లో 30 మంది రైతులు  చనిపోయారని తెలిపారు. రైతు రవి సీఎం కేసీఆర్‌కు లెటర్ రాసి చనిపోవడం బాధాకరమన్నారు. వరి వేసుకోకపోతే ఊరే వేసుకోవాలని బాధపడి రైతు రవి లెటర్ రాశాడని చెప్పారు. మద్దతు ధర ఇవ్వడమంటే రైతుకు భరోసా ఇవ్వడమని తెలిపారు.


తెలంగాణ రాష్ట్రంలో వరి వేయొద్దు అనే హక్కు సీఎం కేసీఆర్‌కు లేదన్నారు. పండించిన పంటకు కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. ఆఖరి గింజ వరకు కొంటా అని సీఎం కేసీఆర్ మాట ఇచ్చారని, ప్రభుత్వాలే మాట తప్పుతున్నాయని విమర్శించారు. బంగారు తెలంగాణ అన్నారని...రైతు బతుకలేకుండా చేస్తున్నారన్నారు. రైతు పంట పండించడం వరకే రైతు బాధ్యత అని మద్దతు ధర రైతు హక్కు అని స్పష్టం చేశారు. వరి వద్దన్న సీఎం మనకు వద్దన్నారు. మృతుడు రవిది ప్రభుత్వ హత్య అని ఆరోపించారు. రైతు రవి కుటుంబానికి సీఎం కేసీఆర్ కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుటుంబాన్ని ఆదుకునే వరకు ఇక్కడే నిరాహార దీక్ష చేస్తానని షర్మిల అన్నారు. 

Updated Date - 2021-12-11T18:29:05+05:30 IST