కేసీఆర్‌.. పాలన చేస్తున్నావా? ఫాం హౌస్‌లో గాడిదలు కాస్తున్నావా?

ABN , First Publish Date - 2021-10-24T08:22:38+05:30 IST

‘‘అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి.. రాష్ట్ర పాలనను గాలికొదిలేసి ఫౌంహౌ్‌సలో గాడిదలు కాస్తున్నావా? లేక మొద్దు నిద్ర పోతున్నావా?’’ అంటూ సీఎం కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల మండిపడ్డారు.

కేసీఆర్‌.. పాలన చేస్తున్నావా? ఫాం హౌస్‌లో గాడిదలు కాస్తున్నావా?

  • అడగనిదే చీరలిచ్చావు.. అడిగినా ఉద్యోగాలివ్వవా..?
  • పెట్రోల్‌ ధరల పెంపు పాపం బీజేపీ, టీఆర్‌ఎస్‌దే: షర్మిల
  • ప్రజా సమస్యలు ఓపిగ్గా వింటూ నాలుగో రోజు పాదయాత్ర


శంషాబాద్‌ రూరల్‌/మహేశ్వరం/ఇబ్రహీంపట్నం: ‘‘అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి.. రాష్ట్ర పాలనను గాలికొదిలేసి ఫౌంహౌస్‌లో గాడిదలు కాస్తున్నావా? లేక మొద్దు నిద్ర పోతున్నావా?’’ అంటూ సీఎం కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల మండిపడ్డారు.  నిరుద్యోగులు ప్రాణాలర్పించి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు ఏమయ్యాయని నిలదీశారు. అడగనిదే బతుకమ్మ చీరలు ఇచ్చారని, అడిగినా యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక యువత తీవ్ర నిరాశతో ఉన్నారని అవేదన వ్యక్తం చేశారు. ఆమె ప్రజాప్రస్ధానం పాదయాత్ర శనివారం నాలుగో రోజు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం గొల్లపల్లిలో మొదలై మహేశ్వరం మండలం నాగరం వరకు సాగింది. మొత్తం 14 కిలోమీటర్లు యాత్ర కొనసాగింది. షర్మిల.. రైతులు, కూలీలు, యువకులు, మహిళలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పెద్దగోల్కొండలో మాట-ముచ్చట నిర్వహించారు.


రెండేళ్లు ఓపిక పట్టాలని.. రాజన్న సంక్షేమ రాజ్యం తెస్తానని హామీ ఇచ్చారు. రుణమాఫీ పేరిట 36 లక్షల మంది రైతులను మోసం చేశారని కేసీఆర్‌ను విమర్శించారు. బంగారు తెలంగాణ ఎక్కడుందో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పెట్రో ఉత్పత్తులకు సంబంధించి ప్రాథమిక ధర మీద ప్రభుత్వాలు రూ.60 ఎక్కువ వసూలు చేస్తున్నాయని.. ఇందులో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలకు సమాన పాపం ఉందన్నారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయని, నాణ్యమైన వైద్యం అందక పేదల ప్రాణాలు గాలిలో కలిశాయని ఆవేదన చెందారు.


ఉద్యోగం రావడం లేదంటూ యువతి కన్నీరు

బీఈడీ చేసినా ఉద్యోగం రావడం లేదంటూ చిన్నగోల్కొండలో జాన్సీ అనే యువతి షర్మిల ఎదుట కంటతడి పెట్టారు. 4 నెలలుగా జీతాలు రావడం లేదని గొల్లపల్లిలో పంచాయతీ కార్మికులు, పింఛన్లు రావడం లేదని వృద్ధులు ఆమె దృష్టికి తెచ్చారు. రషీద్‌గూడలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన షర్మిల.. ఒకే గదిలో ఎక్కువమంది పిల్లలను కూర్చోబెట్టడం చూసి ఉపాధ్యాయురాలిని ప్రశ్నించారు. 

Updated Date - 2021-10-24T08:22:38+05:30 IST