అమరావతి: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఒంగోలులో టీడీపీ నిర్వహించిన మహానాడు సభ విజయవంతమైంది. ఇసుకేస్తే రాలనంత మంది జనం సభకు తరలివచ్చారు. ఒంగోలు పసుపుమయమైంది. వైసీపీ పాలనకు చరమ గీతం పాడేందుకు మహానాడుతో నాంది పలకాలన్నట్టుగా ప్రజలు లక్షలాదిగా రావడం చూసి వైసీపీలో గుబులు రేగింది. వైసీపీ సభలకు ఖాళీ కుర్చీలు దర్శనమిస్తుండటం, ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ బెడిసికొట్టడం, ఎక్కడికెళ్లినా నిలదీస్తున్న పరిస్థితులు ఎదురుకావడంతో ఆ పార్టీ అధిష్టానంలో భయం పట్టుకుంది. మంత్రులు బస్సు యాత్రలు చేస్తున్నా మరీ పలచగా జనం కనిపిస్తుండటంతో వైసీపీకి ఓటమి గుబులు పట్టుకుంది. దీంతో.. టీడీపీకి జనంలో ఉన్న ఆదరణను అంచనా వేసేందుకు వైసీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. తమ బస్సు యాత్రలపై ఫోకస్ తగ్గించి మహానాడు సభపై వైసీపీ అదిష్టానం పూర్తిగా దృష్టి సారించినట్లు తెలిసింది. మహానాడుకు ఎంతమంది హాజరయ్యరన్న దానిపై ఉదయం నుంచి ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వైసీపీ అధిష్టానం ఆరా తీసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
మహానాడు సక్సెస్ అయిందని, 3 లక్షల మందికి పైగా సభకు హాజరయ్యారని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. ఒక్క మహానాడు ప్రాంగణంలోనే రెండు లక్షల 50 వేల మంది ఉన్నట్లు ఇంటెలిజెన్స్ తేల్చింది. 50 వేల వరకూ సభా ప్రాంగణం వెలుపల ఉన్నట్టు దృవీకరించింది. ఒక్క ప్రకాశం జిల్లా నుంచే సుమారు 80 వేల మందికి పైగా సభకు హాజరైనట్టు ఇంటెలిజెన్స్ వర్గాల ధృవీకరించడం గమనార్హం. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాలు నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చినట్లు తేల్చిన నిఘా వర్గాలు వైసీపీ అధిష్టానానికి నివేదిక ఇచ్చాయి. ఒంగోలులో మహానాడు సభకు పోటీగా నరసరావుపేటలో సామాజిక న్యాయభేరి పేరుతో వైసీపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. అయితే.. ఈ సభను సొంత పార్టీ కార్యకర్తలే పెద్దగా పట్టించుకోలేదు. నామమాత్రంగానే జనం కూడా వైసీపీ సభకు హాజరయ్యారు.