ప్రతిపక్షాలు ఎందుకు ఏకమవుతున్నాయని ప్రశ్నలు
దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలని నేతల వ్యాఖ్యలు
పొత్తు లేకుండా పోరాడలేరా అంటూ రెచ్చగొట్టే ప్రకటనలు
అధికార పార్టీతో పొత్తుకు ముందుకురాని పార్టీలు
టీడీపీ వైపు బీజేపీ మొగ్గు చూపుతుందేమోనని ఆందోళన
(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఎన్నికలకు రెండేళ్ల ముందే రాష్ట్రంలో పొత్తులపై చర్చ మొదలైంది. ఈ అంశంపై ప్రతిపక్షాలు స్వరం పెంచుతుండటంతో అధికార వైసీపీలో గుబులు పెరుగుతోంది. ప్రతిపక్షాలు ఎందుకు ఏకమవుతున్నాయని, ఒంటరిగా ఎందుకు పోటీ చేయడం లేదని ఆ పార్టీ నేతలు పదేపదే ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ నేతలు కొన్ని రోజులుగా పదేపదే చేస్తున్న ప్రకటనలు వారిలో నెలకొన్న భయాన్ని సూచిస్తున్నాయన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినవస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల పొత్తులపై వైసీపీలో రేగుతున్న ప్రకంపనలకు ఇదే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు రెండు భిన్నమైన రాజకీయ వ్యూహాలతో ముందుకొచ్చాయి. విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో బీజేపీ పొత్తుతో టీడీపీ పోటీ చేయగా జనసేన పార్టీ వాటికి బయట నుంచి మద్దతు ఇచ్చింది. వైసీపీ, వామపక్షాలు, కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగాయి. 2019 ఎన్నికల సమయానికి టీడీపీ కూటమి విచ్ఛిన్నమైంది. టీడీపీ, బీజేపీ, జనసేన ఒంటరిగానే పోటీ చేశాయి. వైసీపీ ఒంటరిగా పోటీ చేసినా పొరుగున అధికారంలో ఉన్న టీఆర్ఎస్... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి అన్ని రకాలుగా సహకారం అందిందన్నది బహిరంగంగానే కనిపించింది. ఈ కారణంతోనే ఆ రెండు పార్టీలతో వైసీపీ నాయకత్వం ఎప్పుడూ మిత్రత్వ ధోరణితోనే వ్యవహరిస్తూ వస్తోంది. కింది స్థాయిలో ఎప్పుడైనా చిటపటలు వ్యక్తమైనా పై స్థాయిలో సంబంధాల్లో తేడా రాకుండా అధినాయకత్వం చూసుకొంటోంది.
2024 ఎన్నికలో మళ్లీ పొత్తు పొడిచే వాతావరణం బాగా ముందు నుంచే కనిపిస్తోంది. ప్రత్యేకించి వైసీపీతో బద్ధవైరంతో ఉన్న టీడీపీ, జనసేన పార్టీల మధ్య సయోధ్య పెరుగుతోంది. స్థానిక ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల ఈ పార్టీల శ్రేణులు కలసి పోటీ చేశాయి. విషయం ఆయా పార్టీల నాయకత్వాలకు తెలిసినా అడ్డుపెట్టలేదు. ఈ రెండు పార్టీల మధ్య పరస్పర విమర్శలు కూడా బాగా తగ్గిపోయాయి. పొత్తు విషయమై ఇప్పటికిప్పుడు నిర్దిష్టంగా చెప్పలేకపోయినా ఆ వాతావరణం ఏర్పడేలా ఉభయ పార్టీల నాయకత్వాల నుంచి ప్రకటనలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల బహిరంగ ప్రకటన చేశారు. రాజకీయాల్లో పొత్తులనేవి ఉంటూనే ఉంటాయని ఆదివారం చిత్తూరు జిల్లా పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. 2004 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీని ఓడించడానికి టీఆర్ఎస్, వామపక్షాలతో పొత్తు పెట్టుకొని వైఎస్ రాజశేఖరరెడ్డి పోటీచేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
గుంభనంగా బీజేపీ
టీడీపీ, జనసేనతో పోలిస్తే బీజేపీ కొంత గుంభనంగా వ్యవహరిస్తోంది. జనసేనతో తమ మైత్రి కొనసాగుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. జనసేన కూడా బీజేపీతో మైత్రి కొనసాగిస్తామనే అంటోంది. బీజేపీ కేంద్ర నాయకత్వం తమపట్ల సానుకూల వైఖరితో ఉందని వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ‘బీజేపీ, జనసేన ఒక కూటమిగా విడిగా పోటీ చేస్తే మాకు లాభం. ప్రతిపక్షం రెండు కూటములుగా ఉంటే ప్రభుత్వ వ్యతిరేకఓటు చీలిపోతుంది. ఈ దిశగా బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించే ప్రయత్నంలో మా సీఎం ఉన్నారు’ అని ఓ వైసీపీ ప్రముఖుడు చెప్పారు. ఎన్నికల నాటికి అప్పటి రాజకీయ పరిస్థితిని బట్టి తమ కేంద్ర నాయకత్వం తగిన నిర్ణయం తీసుకొంటుందని, దాని ప్రకారమే పొత్తు ఉంటుందని బీజేపీ ముఖ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు. రాజకీయంగా తాము బలహీనపడితే బీజేపీ తమవైపు ఉంటుందని తాము అనుకోవడం లేదని, మళ్లీ టీడీపీ వైపు మొగ్గుచూపినా ఆశ్చర్యం ఉండదని వైసీపీలో కొందరు నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ‘బీజేపీ ఓటు బ్యాంకు గురించి మేం భయపడటం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నందున ఆ పార్టీ కొన్ని వ్యవస్థలను ప్రభావితం చేయగలుగుతుంది. ఈ కారణంగానే పోయిన ఎన్నికల్లో టీడీపీ కొంత నష్టపోయింది. మళ్లీ ఆ పరిస్ధితి మాకు రాకుండా చూసుకోవాలని అనుకుంటున్నాం’ అని వైసీపీ నేత ఒకరు పేర్కొన్నారు.
వ్యూహాత్మకంగా దాడి
రాష్ట్రంలో మిగిలిన పార్టీలేవీ వైసీపీ పట్ల సానుకూలతతో లేకపోవడంతో ఆ పార్టీకి ఒంటరి పోరు తప్పని పరిస్థితి నెలకొంది. తాము ఒంటరిగా ఉండి ప్రతిపక్షాలు ఏకమైతే వాటి బలం పెరుగుతుందన్న ఆందోళనతో వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా పొత్తు ఆలోచనలపై దాడి చేస్తున్నారు. ‘దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి. పొత్తులతో తప్ప మాపై పోరాడలేరా’ అంటూ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. ఆ ప్రకటనల్లో భయమే ఎక్కువ కనిపిస్తోందని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్షాలు ఏకమైతే పైచేయి సాధిస్తాయన్న అనుమానమే వారితో ఈ ప్రకటనలు చేయిస్తోందని అంటున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా పైకి ఎలాంటి ప్రకటనలు ఇస్తున్నా అంతర్గతంగా మాత్రం తమ పార్టీ నాయకులు మరీ స్పీడుగా వెళ్లకుండా చూసుకొంటున్నాయి. ‘ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ముందు మనం బలపడటం ముఖ్యం. దానిపై దృష్టి పెట్టి పనిచేయండి. పొత్తులపై ఎక్కడా చర్చలు పెట్టవద్దు. ఆ సమయం వచ్చినప్పుడు వాటి విషయం చూసుకొందాం’ అని అంతర్గత సమావేశాల్లో పార్టీ నేతలకు చంద్రబాబు సూచిస్తున్నారు.