లంచం అడిగితే.. జైల్లో వేయిస్తా.. : YSRCP MLA స్ట్రాంగ్ వార్నింగ్

ABN , First Publish Date - 2021-08-10T18:53:49+05:30 IST

గ్రామ సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ రాజేష్‌ రూ.12వేలు లంచం అడుగుతున్నాడని,....

లంచం అడిగితే.. జైల్లో వేయిస్తా.. : YSRCP MLA స్ట్రాంగ్ వార్నింగ్

చిత్తూరు జిల్లా/మదనపల్లె రూరల్‌ : నేతన్న నేస్తం లబ్ధి కోసం వెళ్తే చేనేత కార్మికుడి వద్ద రూ.12 వేలు లంచం అడుగుతాడా.. వెంటనే ఈయన్ని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లండి.. అంటూ మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్‌బాషా ఆగ్రహించారు. సోమవారం మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీలో ఎమ్మెల్యే నవాజ్‌బాషా ప్రజాసమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు చేనేత కార్మికులు తమకు నేతన్న నేస్తం జాబితాలో పేర్లు చేర్చాలంటే గ్రామ సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ రాజేష్‌ రూ.12వేలు లంచం అడుగుతున్నాడని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే వెంటనే వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ను పోలీసుస్టేషన్‌కు తరలించాలని, అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎంపీడీవో లీలామాధవిని ఆదేశించారు.


కోళ్లబైలు పంచాయతీలో ఇంటి కొళాయిలకు రూ.2,950కు రసీదు ఇచ్చి రూ.5,500 వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదుపై కూడా ఎమ్మెల్యే సీరియస్‌ అయ్యారు. దీనిపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను ఆదేశించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్‌ దండు కృష్ణారెడ్డి, సర్పంచ్‌ శరత్‌రెడ్డి,  వైసీపీ నేతలు బయ్యారెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మండల కార్యాలయంలో కోళ్లబైలు, వైఎ్‌సఆర్‌కాలనీ సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో సమావేశం నిర్వహించారు. లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు డబ్బులు వసూలు చేసినట్లు తనకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారన్నారు. అవినీతికి పాల్పడినట్లు తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - 2021-08-10T18:53:49+05:30 IST