వార్డు మెంబరుగా కూడా గెలవలేవు.. ముద్దరబోయినపై YSRCP ఎమ్మెల్యే ఫైర్‌

ABN , First Publish Date - 2022-03-20T18:03:48+05:30 IST

నూజివీడులో వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని ముద్దరబోయిన వెంకటేశ్వరరావు

వార్డు మెంబరుగా కూడా గెలవలేవు.. ముద్దరబోయినపై YSRCP ఎమ్మెల్యే ఫైర్‌

  • వైసీపీ వర్సెస్‌ టీడీపీ


కృష్ణా/నూజివీడు : నూజివీడులో వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పేలుతున్న అవాకులు చవాకులకు సమాధానం చెప్పడానికే బహిరంగ చర్చకు సిద్ధమయ్యానని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు అన్నారు. శనివారం గృహనిర్బంధంలో ఉన్న ఆయన తన స్వగృహంలో విలేకర్లతో మాట్లాడుతూ.. తన కుటుంబ చరిత్ర గురించి మాట్లాడే అర్హత ముద్దరబోయినకు లేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతికి తావులేదన్నారు. నియోజకవర్గ పరిధిలోని క్వారీల కోసం అనేకమంది పెద్దలు సిఫార్సులు చేయించినా తానెవరికీ లొంగలేదన్నారు. గౌరవసభ పేరుతో ముద్దరబోయిన గ్రామాల్లో తిరుగుతూ సీఎం జగన్‌పైన, నాపైన స్థాయిని మరిచి విమర్శలు చేస్తున్నాడన్నారు. తాను చేసిన అభివృద్ధి ఏమిటో నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. మహామహులైన కోటగిరి హనుమంతరావు, పాలడగు వెంకట్రావులతో తలపడిన వాడిని, నువ్వా నన్ను విమర్శించేది అని ముద్దరబోయినపై విరుచుకుపడ్డారు.


నాయకుల హౌస్‌ అరెస్టు

నూజివీడు అభివృద్ధిపై శనివారం పెద్దగాంధీబొమ్మ సెంటర్‌లో ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు, నూజివీడు టీడీపీ ఇన్‌చార్జ్‌ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు బహిరంగ చర్చకు పిలుపు ఇచ్చిన నేపథ్యంగా మండలంలో పోలీసులు టీడీపీ, వైకాపా నాయకులను గృహనిర్భందం చేశారు. తెల్లవారుజామునే పోలీసులు నాయకుల ఇళ్లకు  వెళ్లి బహిరంగ చర్చకు  పోలీసు అనుమతి లేనందున ఈ చర్చకు నూజివీడు వెళ్లేందుకు అనుమతి లేదని నోటీసులు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి 9 మందిని, వైఎస్సార్‌  కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆరుగురు నాయకులను  గృహనిర్భందం చేశారు. అనంతరం టీడీపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్‌  స్టేషన్‌కు తరలించి సాయంత్రం వరకూ  స్టేషన్‌లోనే ఉంచారు. నూజివీడులో ముద్దరబోయినను అరెస్టు చేసిన అనంతరం నాయకులను విడిచిపెట్టారు.


అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేస్తాం..

నూజివీడు నియోజకవర్గానికి టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధిపై ఇన్‌చార్జ్‌ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు రాగానే శ్వేతపత్రం విడుదల చేస్తామని నూజివీడు మాజీ ఏఎంసీ ఛైర్మన్‌ కాపా శ్రీనివాసరావు అన్నారు. శనివారం పోలీసు నిర్బంధం తర్వాత టీడీపీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులతో కలసి ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అభివృద్ధి టీడీపీదేనని, ఈ విషయం నియోజకవర్గంలోని రెండున్నర లక్షలమంది ఓటర్లకు తెలుసున్నారు. అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమంటే నేరస్థులవలే స్టేషన్‌లో నిర్బంధించారని, పోలీసులతో నిర్వీర్యం చేసేందుకు చూసినా, ఎమ్మెల్యే చెప్పిన సమయానికి ముద్దరబోయిన పెద్దగాంధీబొమ్మ సెంటర్‌కు వచ్చి విజయం సాధించారన్నారు. తమ నాయకుడిని పోలీసులు ఎక్కడకు తీసుకువెళ్లారో తెలపాలన్నారు. ముద్దరబోయిన తిరిగిరాగానే అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని, అదేవిధంగా వైసీపీ హయాంలో గత మూడేళ్లలో ఏం అభివృద్ధి చేశారో ఎమ్మెల్యే కూడా శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుందన్నారు. 

Updated Date - 2022-03-20T18:03:48+05:30 IST