YSRCP MLAపై సొంత పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు.. ఏం జరుగుతుందో..!?

ABN , First Publish Date - 2021-12-31T12:22:53+05:30 IST

YSRCP MLAపై సొంత పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు.. ఏం జరుగుతుందో..!?

YSRCP MLAపై సొంత పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు.. ఏం జరుగుతుందో..!?

చిత్తూరు జిల్లా /తిరుపతి : తంబళ్లపల్లె నియోజకవర్గంలో తాలిబన్‌ రాజ్యం నడుస్తోందని అదే నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత, ఆ పార్టీ జడ్పీటీసీ భర్త మద్దిరెడ్డి కొండ్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం జగన్మోహన్‌రెడ్డిని చూసి పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించామని, అయితే ఆయన పుంగనూరు నుంచీ తమ నియోజకవర్గానికి వచ్చి తమపైనే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి వేధింపులు, అవమానాలే మిగులుతున్నాయన్నారు. జగన్‌కు చెబుదామంటే కలవనివ్వకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. అందుకే మీడియా ద్వారానైనా జగన్‌ దృష్టికి తీసుకెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. గురువారం సాయంత్రం ఆయన తిరుపతిలో తంబళ్ళపల్లె ఎమ్మెల్యేపై పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు చేశారు.


పార్టీ కోసం పనిచేసిన వారిని జగన్‌ వర్గంగా, వారికి జైకొట్టే వారిని పెద్దిరెడ్డి వర్గంగా గుర్తిస్తున్నారని ఆరోపించారు. పుంగనూరు, పీలేరు ప్రాంతాల నుంచీ వచ్చిన వంద మంది పెద్దిరెడ్డి అనుచరులదే నియోజకవర్గంలో పెత్తనం సాగుతోందన్నారు.వర్కులొస్తే వారి కంపెనీకే వెళుతున్నాయని, చివరికి వేరుశనగ కాయలొచ్చినా వారికేనంటూ ఆరోపించారు.  పార్టీ కోసం కష్టపడిన వారికి సర్పంచులు, ఎంపీటీసీలుగా అవకాశం ఇవ్వలేదన్నారు. ఎన్నికల్లో గెలిచిన వారిని ఓడినట్టు, ఓడిన వారిని గెలిచినట్టు డిక్లేర్‌ చేయించారని ఆరోపించారు. సర్పంచ్‌ ఎన్నికల్లో తమ అభ్యర్థులు ఎక్కువమంది గెలవడంతో అప్పటి నుంచీ కక్ష కట్టారని ఆరోపించారు. తనపై వేధింపులు పెరిగాయని, అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో కూడా ఇన్ని బాధలు పడలేదని వాపోయారు. తన వాహనాలను పోలీసులతో ఆపించి తనిఖీల పేరిట గంటల తరబడీ నిలబెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. 


తన భార్య వైసీపీ తరపున తంబళ్ళపల్లె జడ్పీటీసీగా గెలిచారని, అయితే ఆమెను ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించకుండా అవమానిస్తున్నారన్నారు. సమావేశాలకు వెళ్ళినా వేదికపైకి పిలవకుండా అవమానించడంతో ఆమె నేలపై కూర్చుని తిరిగొచ్చిన సందర్భాలు వున్నాయన్నారు. తనపై వరుసగా అక్రమ కేసులు పెట్టిస్తున్నారని, ఇదివరకూ రేప్‌ కేసు ఒకటి బనాయించగా ఇపుడు మదనపల్లె వన్‌ టౌన్‌లో ఫోర్‌ ట్వంటీ కేసు పెట్టారని ఆరోపించారు. ప్రస్తుతం తాను అజ్ఞాతవాసంలో వున్నానని, తనకు ఏమి జరిగినా దానికి ఎమ్మెల్యేదే బాధ్యతని స్పష్టం చేశారు.  పార్టీ కోసం ఓపిక పట్టామని, నియోజకవర్గంలో పరిస్థితులను జగన్‌ దృష్టికి తీసుకెళ్దామని విజయవాడకు చాలాసార్లు వెళ్ళానని, అయితే ఆయన అపాయింట్‌మెంట్‌ దొరక్కుండా అడ్డుకున్నారని ఆరోపించారు. చివరికి జగన్‌ ఢిల్లీ వెళ్ళిన సందర్భాల్లో కూడా పలుసార్లు అక్కడైనా కలుద్దామని వెళ్ళానని, కానీ వీలు కాలేదన్నారు.  తాము జగన్‌ కోసం ప్రాణమిస్తామని, ఆయన కోసం ఏమైనా చేస్తామని మధ్యలో పెద్దిరెడ్డి ఎవరంటూ కొండ్రెడ్డి ప్రశ్నించారు. తమ నియోజకవర్గాన్ని కొల్లగొట్టకుండా చూడాలని, నియోజకవర్గంలో పార్టీని బతికించుకోవాల్సి వుందన్నారు. 

Updated Date - 2021-12-31T12:22:53+05:30 IST