వైఎస్‌ఆర్‌ జలకలే..!

ABN , First Publish Date - 2022-04-27T05:59:24+05:30 IST

టీడీపీ హయాంలో ఎన్టీఆర్‌ జలశ్రీగా ఉన్న ఈ పథకానికి జగన్‌ సర్కార్‌ పేరు మార్చి వైఎ్‌సఆర్‌ జలకళగా నామకరణం చేసింది. అర్హులైన రైతులకు బోరు, మోటారు, విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తామని చెప్పింది. దీంతో పేద రైతులు ఎంతో సంతోషించారు. ఉచితంగా బోరు వస్తుందని సంబరపడ్డారు. అయితే ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టిన తరువాత పలు నిబంధనలు తీసుకొచ్చి అర్హత పేరిట రైతులకు కోత పెట్టారనే విమర్శ ఉంది. ఉమ్మడి జిల్లాలో 588 బోర్లు వేయగా 550 బోర్లలో నీళ్లు పడ్డాయి.

వైఎస్‌ఆర్‌ జలకలే..!

ఆర్భాటంగా ఆరంభం... అమలులో నిస్తేజం 

రైతుకు బోరు మోటారు, విద్యుత్‌ కనెక్షన్‌ అంటూ ప్రకటన 

బోర్లు సరే.. మోటార్లు ఎక్కడ ? 

సగం బోర్లకే విద్యుత్‌ కనెక్షన్‌ 

మోటార్‌ కోసం ఎదురు చూపు 

జూన్‌ ఒకటి నుంచి ఖరీఫ్‌ మొదలు 

ఆందోళనలో అన్నదాతలు


అంతన్నారు ఇంతన్నారే గంగరాజు... అనే లిరిక్‌ జగన్‌ సర్కార్‌కు అచ్చు సరిపోతుంది. ప్రభుత్వ పథకాల ప్రారంభ సమయంలో వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు చేసే హంగు, ఆర్భాటం అంతా ఇంత కాదు. పేదలు, రైతులు, కార్మికులు ఇలా అన్నిరకాల వారి జీవన ప్రమాణాలు మారిపోతాయంటూ గొప్పలు చెబుతారు. అయితే క్షేత్ర స్థాయిలో ఆ పథకాల అమలయ్యేసరికి ప్రచారానికి, అమలు తీరుకు నక్కకు, నాగలోకానికి తేడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇందుకు ఉదాహరణే 20 నెలల క్రితం ప్రారంభించిన వైఎ్‌సఆర్‌ జలకళ పథకాన్ని చెపుకోవచ్చు. 


కడప, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి) : టీడీపీ హయాంలో ఎన్టీఆర్‌ జలశ్రీగా ఉన్న ఈ పథకానికి జగన్‌ సర్కార్‌ పేరు మార్చి వైఎ్‌సఆర్‌ జలకళగా నామకరణం చేసింది. అర్హులైన రైతులకు బోరు, మోటారు, విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తామని చెప్పింది. దీంతో పేద రైతులు ఎంతో సంతోషించారు. ఉచితంగా బోరు వస్తుందని సంబరపడ్డారు. అయితే ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టిన తరువాత పలు నిబంధనలు తీసుకొచ్చి అర్హత పేరిట రైతులకు కోత పెట్టారనే విమర్శ ఉంది. ఉమ్మడి  జిల్లాలో 588 బోర్లు వేయగా 550 బోర్లలో నీళ్లు పడ్డాయి. 82 బోర్లు ఫెయిల్‌ అయ్యాయి. విద్యుత్‌ కనెక్షన్‌కు అర్హులైన రైతులను 346 మందిగా గుర్తించారు. అయితే ఇప్పటి వరకు 120 వ్యవసాయ బోర్లకు మాత్రమే విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చారు. కరెంట్‌ కనెక్షన్‌ విషయంలో మిగతా జిల్లాలతో పోల్చుకుంటే మనం మొదటి స్థానంలో ఉన్నాం. 


బోర్లు సరే... మోటార్లు, విద్యుత్‌ కనెక్షన్లు ఏవీ... 

ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న సన్న, చిన్నకారు రైతులకు బోరు, మోటారు, విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తానని ప్రభుత్వం చెప్పింది. 5 నుంచి 10 ఎకరాల మధ్య ఉన్న రైతులకు బోరు వేస్తామని చెప్పింది. నియోజకవర్గానికి ఒక్కో బోరు బండిని కేటాయించింది. రైతుల నుంచి సుమారు 3 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే వాటిని ఫిల్టర్‌ చేయగా 1207 మందిని అర్హులుగా గుర్తించారు. బోరు డ్రిల్లింగ్‌ చేసినప్పటికీ బిల్లులు ఆలస్యం, డీజల్‌ రేట్లు పెరుగుతుండడంతో ప్రభుత్వం ఇచ్చే డబ్బు సరిపోదని రిగ్‌ యజమానులు చేతులెత్తేశారు. దీంతో కొద్ది రోజుల పాటు బోరు డ్రిల్లింగ్‌ జరగలేదు. చివరకు బోరు రిగ్‌ కాంట్రాక్టర్లతో చర్చలు జరిగాయి. ఒక్కో రైతుకు 600 అడుగుల లోపు బోరు వేస్తారు. కొన్ని చోట్ల 200 నుంచి 300 మధ్య  నీరు పడుతుండగా మరి కొన్ని చోట్ల 600 మధ్య పడతాయి. బోరు తవ్వకానికి రూ.60 వేల నుంచి రూ.1.20 లక్షలు ఖర్చు అవుతుం ది. విద్యుత్‌ కనెక్షన్‌కు ఆ ప్రాంతంలో ఉన్న విద్యుత్‌ స్తంభాలు, కేబుల్‌ను బట్టి రూ.లక్ష నుంచి రూ.4లక్షల లోపు ఖర్చు అవుతుంది. 5 ఎకరాల్లోపు ఉన్న రైతుకు మోటారు, విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. దీంతో ఉమ్మడి జిల్లాలో 346 మంది విద్యుత్‌ కనెక్షన్‌లకు అర్హులని గ్రామీణాభివృద్ధిశాఖ వారి వివరాలను ఎస్పీడీసీఎల్‌కు పంపింది. కడప జిల్లాలో 279 మంది అర్హులు కాగా ఉమ్మడి జిల్లాలో అయితే 346 మంది, ఇక విద్యుత్‌ కనెక్షన్‌ వేయడానికి ఫీజుబులిటీ 285 మాత్రమే ఉన్నట్లు ఎస్పీడీసీఎల్‌ అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆ దరఖాస్తులకు అనుమతించారు. ఇప్పటి వరకు కడప జిల్లాలో 79 మందికి కనెక్షన్‌ ఇవ్వగా ఉమ్మడి జిల్లాలో అయితే 120 కనెక్షన్లు ఇచ్చారు.


మోటార్లు ఏవీ.. 

బోరు, మోటారు, విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తామనడంతో సన్న, చిన్నకారు రైతులు సంతోషించారు. బోరు, మోటారు, విద్యుత్‌ కనెక్షన్‌కు సొంతగా సొమ్ము చెల్లించే శక్తి లేక వర్షాధారం ఆధారంగా పంటలు సాగు చేస్తున్నారు. వైఎ్‌సఆర్‌ జలకళతో మోటార్ల ద్వారా వచ్చే నీటితో పంటలు పండించుకోవచ్చని అనందపడ్డారు. అయితే కొన్ని చోట్ల బోర్లు వేసినప్పటికీ ఏడాది దాటినా మోటారుతో కనెక్షన్‌ ఇవ్వలేదు. ప్రభుత్వ స్థాయిలోనే మోటా ర్ల సరఫరా కోసం ఇంకా టెండర్‌ ఖరారు కాలేదని సమాచారం.  మోటార్ల టెండర్‌ ఖరారు కాకపోతే ఆ మోటార్లు ఎప్పుడొస్తాయో ఎప్పుడు బిగిస్తారో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. జూన్‌ 1 నుంచి ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం అవుతుంది. ఆలోపు విద్యుత్‌ కనెక్షన్లు, మోటార్లు ఇస్తే అందరి మాదిరిగా పంటలు సాగు చేసుకోవచ్చని రైతులు ఆశిస్తున్నారు. 


నియోజకవర్గ వారీగా వైఎ్‌సఆర్‌ జలకళ బోర్లు  

నియోజకవర్గం బోర్ల తవ్వకానికి తవ్విన బోర్లు సక్సెస్‌  ఫెయిల్‌ 

        అనుమతి

బద్వేలు 478 350 331 19

జమ్మలమడుగు 33 11 7 4

కమలాపురం         185 48 39 9

కోడూరు 29 9 8 1

ప్రొద్దుటూరు         0 0 0 0

పులివెందుల         110 52 31 21

రాజంపేట 23 3 3 0

రాయచోటి 291 103 76 27

మైదుకూరు         58 12 11 1

మొత్తం 1207 588          506   82


విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వడంలో కడప జిల్లాకు మొదటి స్థానం 

- మద్దిలేటి, ఏపీడీ 

వైఎ్‌సఆర్‌ జలకళ బోర్లకు విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వడంలో కడప జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఉమ్మడి జిల్లాలో విద్యుత్‌ కనెక్షన్లకు 346 రైతులు అర్హులని గుర్తించారు. ఇప్పటి వరకు 120 కనెక్షన్లు ఇచ్చాం. మిగతా బోర్లకు కూడా కనెక్షన్‌ ఇచ్చే కార్యక్రమాన్ని ఎస్పీడీసీఎల్‌ అధికారులు చేస్తున్నారు. వీలైనంత త్వరగా అందరికీ విద్యుత్‌ కనెక్షన్లు ఇస్తాం. 



Updated Date - 2022-04-27T05:59:24+05:30 IST