మాట తప్పని నైజం వైఎస్సార్‌ది

ABN , First Publish Date - 2022-08-11T05:15:22+05:30 IST

మాట తప్పని నైజం వైఎస్సార్‌ది

మాట తప్పని నైజం వైఎస్సార్‌ది
దుద్యాల్‌లో మాట ముచ్చటకార్యక్రమంలో వైఎస్‌ షర్మిల


  • రెండో రోజు ప్రజాప్రస్థాన పాదయాత్రలో వైఎస్‌ షర్మిల 

బొంరాస్‌పేట్‌ /కొడంగల్‌ రూరల్‌, ఆగస్టు10: మాట తప్పని, మడమ తప్పని నైజం దివంగత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నైజమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత్రి వైఎస్‌ షర్మిల అన్నారు.  రెండోరోజు ప్రజాప్రస్థాన పాదయాత్ర కొడంగల్‌ నుంచి పర్సాపూర్‌, హస్నాబాద్‌ మీదుగా దుద్యాల్‌ గ్రామం వరకు సాగింది.  అనంతరం దుద్యాల్‌లో మాట ముచ్చట కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ వైఎస్సార్‌ ఐదేళ్లు మాత్రమే ముఖ్యమంత్రి  ఉన్నా, 13 ఏళ్లుగా  ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని గుర్తు చేశారు. కేసీఆర్‌ను ప్రజలు రెండు సార్లు  తెలంగాణ రాష్ట్ర సీఎంగా చేస్తే ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను నట్టేటా ముంచి కుటంబ పాలనతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. బంగారు తెలంగాణను బతుకు లేని తెలంగాణగా మార్చి అప్పుల ఊబిలోకి నెట్టారని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదన్నారు. ఈసారి ప్రజలు కేసీఆర్‌ను నమ్మి ఓటేస్తే నియంత పాలనతో అధోగతి పాలు చేస్తారని విమర్శించారు.  వైఎస్సార్‌ సంక్షేమ పాలన అందించేందుకు వైఎస్సార్‌టీపీ పార్టీని స్థాపించినట్లు పేర్కొన్నారు. వైఎస్సార్‌టీపీ అధికారంలోకి రాగానే మొదటి సంతకం నిరుద్యోగుల కోసం ఉద్యోగాల కల్పన ఫైల్‌పై చేస్తామన్నారు. ప్రతీ పేదవాడికి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ పింఛన్లు అందిస్తామన్నారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేస్తూ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి పునర్‌వైభవం తీసుకొస్తామన్నారు. ఓట్లు కావాల్సిన ప్రతీసారి కేసీఆర్‌ ప్రజలకు మాయ మాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన  హామీని విస్మరించడం పరిపాటిగా మారిందన్నారు. అనంతరం లగచర్ల-హకీంపేట్‌ క్రాస్‌రోడ్డులో బస చేశారు. 

 దుద్యాల్‌లో టీఆర్‌ఎస్‌ -వైఎస్సార్‌టీపీ మధ్య ఉద్రిక్తత 

దుద్యాల్‌లో మాట-ముచ్చట కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ షర్మిలను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలను  అడ్డుకున్నారు. కొడంగల్‌ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిపై చేసిన ఆరోపణలకు వెంటనే క్షమాపణ చెప్పాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీంతో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలను  పోలీసులు ఎక్కడిక్కడే కట్టడి చేశారు. 



Updated Date - 2022-08-11T05:15:22+05:30 IST