చేతకాని.. చేయూత

ABN , First Publish Date - 2021-06-13T04:58:30+05:30 IST

చేతకాని.. చేయూత

చేతకాని.. చేయూత

జిల్లావ్యాప్తంగా వైఎస్సార్‌ చేయూత లబ్ధిదారుల తొలగింపునకు సిద్ధం

వలంటీర్ల ద్వారా ప్రత్యేక సర్వే

భారీగా తొలగింపునకు  ప్రణాళికలు 

కిందటి ఏడాది 1,90,524 మంది లబ్ధిదారులు

రూ.357.23 కోట్లు బ్యాంకు ఖాతాలకు జమ 

గరిష్ట ఆర్థిక సహాయం చేసే పథకం కాబట్టే తొలగింపు నిర్ణయం

ఆర్థిక భారాన్ని తగ్గించుకునే యత్నం 

‘వైఎస్సార్‌ చేయూత.. మారనున్న అక్కాచెల్లెమ్మల భవిత..’ అంటూ అట్టహాసంగా ప్రారంభించిన వైఎస్సార్‌ చేయూత ఇప్పుడు ఉత్తుత్తి చేయూతగా మారిపోయింది. ఈ పథకం ద్వారా లబ్ధిపొందే మహిళల తొలగింపు ప్రక్రియ ఇప్పుడు జిల్లావ్యాప్తంగా జోరందుకుంది. 

విజయవాడ, ఆంధ్రజ్యోతి : బలహీన, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన 45 ఏళ్లు పైబడిన మహిళలకు అమలుచేస్తున్న ‘వైఎస్సార్‌ చేయూత’ పథకంలో ఏరివేత మొదలైంది. ఇప్పటికే పెద్దసంఖ్యలో లబ్ధిదారులను తొలగించగా, తాజాగా వలంటీర్ల ద్వారా ఇంకా భారీస్థాయిలో కోత విధించేందుకు జిల్లాలో సర్వే ప్రారంభించారు. ఇతర పథకాల్లో లబ్ధి పొందుతున్నారని, ఇతర పింఛన్లు వస్తున్నాయని, ఆదాయ పన్ను, తదితర కారణాలతో భారీగా అనర్హుల జాబితాలు సిద్ధం చేశారు. దీంతో ఈ దఫా వేలాది సంఖ్యలో కుదింపు జరగనుందని తెలుస్తోంది. 

గత ఏడాది లబ్ధిదారులు ఇలా..

కిందటి ఏడాది జిల్లావ్యాప్తంగా 1,90,524 మందిని చేయూత లబ్ధిదారులుగా గుర్తించారు. దీనిని ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా పెట్టింది. అవనిగడ్డ నియోజకవర్గంలో 13,357 మంది, గన్నవరంలో 17,312 మంది, గుడివాడలో 11,141 మంది, జగ్గయ్యపేటలో 12,860 మంది, కైకలూరులో 13,784 మంది, మచిలీపట్నంలో 10,434 మంది, మైలవరంలో 12,793 మంది, నందిగామలో 9,161 మంది, నూజివీడులో 15,741 మంది, పామర్రులో 13,864 మంది, పెడనలో 11,193 మంది, పెనమలూరులో 13,848 మంది, తిరువూరులో 13,571 మంది, విజయవాడలో 21,515 మందికి.. మొత్తంగా రూ.357.23 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనాన్ని అందించారు. గత ఏడాది మొత్తం 2,12,414 మంది మహిళలు చేయూత పథ కం కోసం దరఖాస్తు చేయగా, వివిధ వడపోతల ద్వారా 1,90,524 మందిని అర్హులుగా గుర్తించారు. ఈ పథకాన్ని ప్రారంభించినపుడే వివిధ వడపోతల ద్వారా అర్హతలను నిర్ణయించగా, అవే లబ్ధిదారుల్లో చాలామంది ఇప్పుడు అనర్హులుగా మారుతున్నారు. 

ఆర్థిక భారమే కారణమా..?

చేయూత పథకంలో భాగంగా ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన ఆర్థిక సహాయాన్ని పరిశీలిస్తే.. మొత్తం 59,073 మంది ఎస్సీ వర్గాల మహిళలకు, 6,838 మంది ఎస్టీ వర్గాల మహిళలకు, 1,06,346 మంది బీసీ వర్గాల మహిళలకు, 15,624 మంది ముస్లిం మహిళలకు, 2,643 మంది క్రిస్టియన్‌ మహిళలకు లబ్ధి చేకూర్చారు. ఈ పథకంలో కిందటి ఏడాది దరఖాస్తు చేసిన వారిలో బలహీన వర్గాల మహిళలు 1,18,201 మంది ఉండగా, 1,06,346 మందిని ఎంపిక చేశారు. ఎస్సీ వర్గాలకు చెందిన 65,272 మంది మహిళలు దరఖాస్తు చేసుకోగా, 59,073 మందిని ఎంపిక చేశారు. ఎస్టీలకు చెందిన మహిళలు 7,757 మంది దరఖాస్తు చే సుకోగా, 6,838 మందిని అర్హులుగా గుర్తించారు. ఇక మైనారిటీ మహిళలు 20,336 మంది దరఖాస్తు చేసుకోగా, 15,624 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. ఇలా.. కిందటి ఏడాది అనేక వడపోతల అనంతరమే ఆర్థిక లబ్ధి కలిగించారు. ఈ ఏడాదికి వచ్చేసరికి ఈ లబ్ధిదారుల్లో కొత్తగా అర్హులైన వారిని కూడా కలుపుకొని వైఎస్సార్‌ చేయూత పథకాన్ని అమలు చేయాల్సి ఉండగా, అందుకు భిన్నంగా తొలగిస్తున్నారు. కొత్త లబ్ధిదారుల దరఖాస్తులు ఎన్ని వచ్చాయన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. పాత లబ్ధిదారులకు సంబంధించి మాత్రం ఇతర పింఛన్లు ఉన్నాయని, బహుళ పథకాలకు లబ్ధిదారులుగా ఉన్నారని, రుణాలకు ఆప్షన్‌ ఇచ్చిన వారిని అర్హుల జాబితా నుంచి తీసి పారేస్తున్నారు. తాజాగా వలంటీర్ల జాబితాల్లో ఉన్న లబ్ధిదారుల అర్హతను నిర్ణయించటానికి సర్వే చేయాలని ఒత్తిళ్లు చేస్తున్నారు. ప్రస్తుతం వలంటీర్లు కూడా ఇదే పనిలో బిజీగా ఉన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ప్రతి లబ్ధిదారుడికీ రూ.18,500 మేర ఆర్థిక ప్రయోజనం అందించాల్సి వస్తోంది. ఆర్థిక ఇబ్బందుల రీత్యా దీనిని భారంగా భావించటం వల్లే  ఈ వడపోతకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. 



Updated Date - 2021-06-13T04:58:30+05:30 IST