అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారుతోంది. రాబడి తగ్గిపోయింది. ఖర్చు, ఆదాయం మధ్య అంతరం పెరిగింది. ఆశించిన మేరకు నిధులు రాకపోవడంతో సంక్షేమ క్యాలండర్‌ను కూడా అమలు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆసరా వచ్చేనెలకు వాయిదా పడింది. తీరా ఏడాదిలో చేయాల్సిన అప్పు... నాలుగు నెలల్లోనే చేసి వాడేశారని కాగ్ బహిర్గతం చేసిన లెక్కలు ఇప్పుడు అందరినీ షాక్‌కు గురిచేస్తున్నాయి. వచ్చే నెల నుంచి సంక్షేమ పథకాల అమలు కష్టమేనని ఆలస్యంగా గుర్తించారు.
పథకాల అమలు, నిధుల కోసం వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఏపీ ఖజానా ఖాళీ కావడంతో ఏకంగా పథకాలనే వాయిదా వేస్తున్నారు. ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాల క్యాలండర్‌ను అమలు చేసి తీరుతానని శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఆసరా పథకం సెప్టెంబర్‌లో సంక్షేమ పథకాల క్యాలండర్లో అమలు చేస్తామని ప్రకటించారు. డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు సుమారు రూ. 7,500 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ నిధుల కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఇప్పటి వరకు కేంద్రం అదనంగా అనుమతి ఇచ్చిన రూ. 10,500 కోట్లలో రూ. 4వేల కోట్లు రిజర్వ్ బ్యాంక్ వద్ద సెక్యూరిటీ బాండ్లను వేలం వేసి సేకరించారు. అందులో రూ. 2వేల కోట్లను రిజర్వ్ బ్యాంక్ ఓడీ కింద జమ చేసుకుంది. మిగిలిన రూ. 2వేల కోట్లు ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యాయి. వివిధ శాఖల నుంచి వచ్చే ఆదాయం కూడా నెలాఖరుకు చేతికి రానుంది. రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా దాదాపుగా నిలిచిపోయాయి. దీంతో ఆసరా పథకానికి డబ్బులు సరిపోయే విధంగా లేవని సీఎం జగన్ నిర్ణయానికి వచ్చారు. దీంతో డ్వాక్రా మహిళలకు వచ్చే రూ. 7,500 కోట్లతో ఆయా గ్రూపులు ఏం చేయబోతున్నారో.. వారి కార్యక్రమాల వివరాలు తెలుసుకోవాలని వాలంటీర్లకు పనిపెట్టారు. ఈ వంకతో ఆసరాను వాయిదా వేశారు. వచ్చేనెలలో మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఉండడంతో వాటిన్నింటికి నిధులు ఎలా అని అధికారులు తలలు బాదుకుంటున్నారు.