Abn logo
Jul 24 2021 @ 11:32AM

Viveka Murder Case : ముగ్గురి పేర్లు చెప్పా.. నాలుగో వ్యక్తి...!

  • ఆయన  పొడుగ్గా ఉన్నాడు.. ఎప్పుడూ చూడలేదు
  • స్థానికులకు వివరించిన రంగయ్య
  • జమ్మలమడుగు జడ్జికి వాంగ్మూలం
  • పులివెందులలో ఒంటరిగా వదిలేసిన సీబీఐ

కడప : వివేకా హత్య కేసులో జమ్మలమడుగు న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చిన వాచ్‌మన్‌ రంగయ్య శుక్రవారం రాత్రి స్థానికులు, మీడియా ప్రతినిధుల ఎదుట పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. హత్య జరిగిన రోజు వివేకానంద రెడ్డి నివాసానికి వచ్చిన ముగ్గురి పేర్లను జడ్జికి చెప్పానని తెలిపారు. నాలుగో వ్యక్తి కూడా ఉన్నారని... బాగా పొడవుగా ఉన్న ఆయనను గతంలో తాను చూడలేదని పేర్కొనడం రంగయ్య గమనార్హం. కోర్టులో జడ్జి ముందు ఏం చెప్పావని స్థానికులు, మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే.. పలు వివరాలు వెల్లడించారు.

పెద్దసారు 1500 ఇచ్చారు..! 

‘‘ఆ ముగ్గురిలో ఒకరు... తమ పేర్లు బయటికి చెబితే నన్ను నరికేస్తామన్నారు. అందుకే... భయపడ్డాను. సీబీఐ సారోళ్లు మేమున్నామని ధైర్యం చెప్పడంతో ఏమైనా కానీ అని సీబీఐ సారోళ్లకు, కోర్టులో అవే చెప్పాను’’ అని రంగయ్య వివరించారు. గురువారం నన్ను సీబీఐ అధికారులు జమ్మలమడుగు కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టు లేదంటే మళ్లీ కడపకు తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం మళ్లీ జమ్మలమడుగుకు తీసుకెళ్లి కోర్టులోకి పంపించారు. రాత్రి పెద్ద సారోళ్లు పులివెందులకు తీసుకొచ్చి జేఎన్‌టీయూ వద్ద వదిలేశారు. నా ఖర్చులకు ఏమైనా ఇవ్వండి సార్‌ అంటే ఢిల్లీ పెద్దసారు రూ.1,500 ఇచ్చారు. కాగా.. రంగయ్యను సీబీఐ అధికారులు ఒంటరిగా వదిలి వెళ్లడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందని, భద్రత కల్పించాల్సిన అవసరముందని చర్చించుకున్నారు.