హాట్‌టాపిక్‌గా వైఎస్ వివేకా కుటుంబ సభ్యుల నిర్ణయం..!

ABN , First Publish Date - 2020-09-30T17:31:02+05:30 IST

మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారుల విచారణ ముమ్మరం చేశారు. తెరపైకి వస్తున్న కొత్త వ్యక్తుల చుట్టూ కేసు తిరుగుతోంది. ప్రధానంగా చెప్పుల షాప్‌ యజమాని

హాట్‌టాపిక్‌గా వైఎస్ వివేకా కుటుంబ సభ్యుల నిర్ణయం..!

మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారుల విచారణ ముమ్మరం చేశారు. తెరపైకి వస్తున్న కొత్త వ్యక్తుల చుట్టూ కేసు తిరుగుతోంది. ప్రధానంగా చెప్పుల షాప్‌ యజమాని మున్నా కుటుంబ సభ్యులు, స్నేహితులతోపాటు మరికొందరిని ఆరా తీస్తున్నారు. మరోవైపు సీబీఐ విచారణపై వివేకా కుటుంబ సభ్యులు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వివేకా కుటుంబ సభ్యులు తాజాగా తీసుకున్న సంచలన నిర్ణయం ఏమిటి? సీబీఐ కొత్తకోణంలో ముందుకు వెళ్తోందా? ఈ కథనం చూడండి..


కడప సెంట్రల్ జైలు కేంద్రంగా...

మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హ‌త్య కేసులో సీబీఐ ద‌ర్యాప్తు సాగుతోంది. ఈ ఏడాది జులైలో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు మొదటి ధపాలో 15 రోజులు విచారించారు. పులివెందులలో హత్య జరిగిన వివేకా ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. వివేకా కూతురు సునీతను వారంరోజులపాటు విచారించారు. ఇప్పుడు రెండో విడత విచారణలో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మూడు బృందాలుగా విడిపోయి హత్యకు గల కారణాలు, సూత్రధారులు, పాత్రధారులు ఎవరనే విషయాలపై శూలశోధన చేస్తున్నారు. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా కొందరు.. పులివెందుల, అనంతపురం, చిత్తూరు జిల్లాలో మరికొందరు అధికారులు సంచరిస్తూ అనుమానితుల నుంచి కూపీ లాగుతున్నారు. 


కాల్ డేటా ఆధారంగా...

పులివెందుల గెస్ట్‌హౌస్‌లో సీబీఐ అధికారులు మ‌కాం వేసి ద‌ర్యాప్తును వేగ‌వంతం చేశారు. విచార‌ణ‌లో భాగంగా త‌మ‌కు ల‌భ్యమైన ఆధారాలతో మ‌రికొంద‌రు ముఖ్యుల్ని ప్రశ్నించనున్నారు. పులివెందుల బ‌స్టాండ్‌కు స‌మీపంలోని చెప్పుల షాపు యజమాని మున్నాను అధికారులు విచారించారు. అతనికి సంబంధించిన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు లాకరులో 48 లక్షల నగదు, 25 తులాల బంగారు నగలను గుర్తించి జ‌ప్తు చేశారు. కడపకు చెందిన ఇద్దరు ముస్లిం మహిళలు, పులివెందులకు చెందిన బాబును సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వీరి నుంచి మరింత సమాచారం రాబట్టారు. ఈ ఇద్దరు మహిళలలో మున్నా రెండో భార్య ఉన్నట్లు తెలుస్తోంది. మున్నా చెప్పుల షాపులో పనిచేస్తున్న భాస్కర్ రెడ్డిని కూడా విచారించారు. పులివెందులకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పుల్లయ్య , నిజాంబీ, ప్రసాద్, ట్యాంకర్ బాషా, హజ్రత్, హిజ్రా చంటి మరో ఇద్దరు వ్యక్తులను అధికారులు ప్రశ్నించారు. వారు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ని రికార్డు చేసుకున్నారు. మరోవైపు మున్నా స్నేహితులను కూడా వాకబు చేశారు. అయితే వివేకా హత్యకు నాలుగు రోజుల ముందు మున్నా తన ఇద్దరు భార్యల పంచాయతీని ఆయన దగ్గరికి తీసుకెళ్లారట. ఆ సమయంలో వివేకాకు మున్నా ఫోన్ చేయడంతో కాల్‌డేటా ఆధారంగా ఫోన్‌ నెంబర్‌ గుర్తించి సీబీఐ అధికారులు విచారించినట్లు తెలుస్తోంది.  


మరోవైపు వివేకా ఇంట్లో పనిచేస్తున్న రాజశేఖర్‌ను సీబీఐ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు, ఆ ముందు రోజు ఏం జరిగిందో ఆరా తీశారు. రెండో విడత దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఆయనను మూడు రోజలపాటు ప్రశ్నించారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన నాటి ముందురోజు కాణిపాకం ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ఆయనను ప్రశ్నించారు. దీన్ని నిర్ధారించుకోడానికి ఇటీవల సీబీఐ అధికారులు రాజశేఖర్‌ను వెంటబెట్టుకుని చిత్తూరు జిల్లా కాణిపాకం వెళ్లొచ్చినట్లు సమాచారం.


వివేకా కుటుంబ సభ్యుల ఆందోళన..

అయితే మొదటి విడతలో కానీ, రెండో విడతలో కానీ, రాజకీయ నాయకులను సీబీఐ అధికారులు విచారించకపోవడం వివేకా కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, బాబాయ్ మనోహర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిలను ఎందుకు విచారించడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. వివేకాకు సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది, వాచ్‌మెన్‌, వంటమనుషులు, టైలర్లు, పులివెందులకు చెందిన కొందరు సాధారణ వ్యక్తులను మాత్రమే విచారిస్తున్నారని అంటున్నారు. గతంలో ఏర్పాటు చేసిన సిట్ బృందం వైఎస్ కుటుంబంలో కీలక వ్యక్తులను విచారించింది. వై.ఎస్.భాస్కర్ రెడ్డి, వై.ఎస్.మనోహర్ రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవిని ఆరా తీసింది. అప్పట్లో సిట్ బృందం విచారించిన అనుమానితులపై కాకుండా సీబీఐ అధికారులు కొత్త వ్యక్తులపై దృష్టి సారించారు. వివేకా హత్యకు నెల ముందు నుంచి ఆయనను ఎవరెవరు కలిశారు. ఎందుకు కలిశారు. ఆయనతో ఫోన్‌లో మాట్లాడిన సాధారణ వ్యక్తుల వివరాలు కాల్ డేటా ద్వారా సేకరించి ప్రశ్నిస్తున్నారు.


అమిత్ షాను కలవాలని నిర్ణయం...

మరోవైపు వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ ప్రముఖులను సీబీఐ విచారించి, కేసు మిస్టరీని త్వరితగతిన ఛేదించాలని వివేకా కూతురు సునీత, ఆయన భార్య సౌభాగ్యమ్మ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కోసం గట్టిగా ప్రయత్నాలు  చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసి తమకు న్యాయం చేయాలని కోరనున్నారని తెలుస్తోంది. వీరి అభ్యర్థనపై అమిత్‌ షా సానుకూలంగా స్పందిస్తే కేసు విచారణ త్వరలోనే కొలిక్కి రానుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదిఏమైనా వివేకా హత్య విచారణపై ఆయన కుటుంబ సభ్యులు కేంద్ర హోంమంత్రిని కలువనున్నారన్న విషయం ఇప్పుడు కడప జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.

Updated Date - 2020-09-30T17:31:02+05:30 IST