వైఎస్‌ జగన కక్షపూరిత చర్యలు మానుకోవాలి

ABN , First Publish Date - 2021-01-18T05:30:00+05:30 IST

2018వ సంవత్సరం నాటి పూల అంగళ్ల వద్ద కేసుకు సంబంధించి ఈనెల 3న అరెస్టు అయి కడప కేంద్ర కారాగార రిమాండ్‌ ఖైదీగా ఉన్న బీటెక్‌ రవికి సోమవారం కోర్టు బెయిలు మంజూరు చేయడంతో సాయంత్రం 6గంటలకు ఆయన విడుదలయ్యారు.

వైఎస్‌ జగన కక్షపూరిత చర్యలు మానుకోవాలి
సెంట్రల్‌ జైలు వెలుపల మీడియాతో మాట్లాడుతున్న బీటెక్‌ రవి

మీ చిన్నాన్న వైఎస్‌ వివేకా కేసును త్వరగా ఛేదించండి

మేము కేసులకు భయపడం

ఎమ్మెల్సీ బీటెక్‌ రవి

కడప (క్రైం), జనవరి 18: వైఎస్‌ జగన కక్షపూరిత చర్యలు మానుకోవాలని, టీడీపీ నాయకులపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి చేసి లొంగదీసుకోవాలని చూసినా భయపడేది లేదని ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అన్నారు. 2018వ సంవత్సరం నాటి పూల అంగళ్ల వద్ద కేసుకు సంబంధించి ఈనెల 3న అరెస్టు అయి కడప కేంద్ర కారాగార రిమాండ్‌ ఖైదీగా ఉన్న బీటెక్‌ రవికి సోమవారం కోర్టు బెయిలు మంజూరు చేయడంతో సాయంత్రం 6గంటలకు ఆయన విడుదలయ్యారు. అనంతరం సెంట్రల్‌ జైలు వెలుపల ఆయన మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గంలో ధైర్యంగా ఉంటామని ఇలాంటి కేసులు ఎన్నో చూశామని అన్నారు. బాధాకర విషయమేమంటే ఐపీఎస్‌ అధికారులు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని తెలిపారు. ఎన్నికల కాన్వాయ్‌లో వారికెదురుగానే తిరిగానని, మంత్రుల మీటింగ్‌లో పాల్గొన్నానని, జిల్లా ఎస్పీని రెండుమూడుసార్లు కలిశామని అన్నారు. అప్పుడంతా అరెస్టు చేయకుండా అంతర్జాతీయ స్మగ్లర్లలా తనను చెన్నై ఎయిర్‌పోర్టులో అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్టులో ఎస్సీ ఎస్టీ  కేసులో అరెస్టు చేస్తున్నామని పోలీసులు అన్నారని తెలిపారు. రెండు మూడుగంటల వ్యవధిలో ఎస్సీ ఎస్టీ కేసు కాదని, 2018 కేసుకు సంబంధించి అరెస్టు చేస్తున్నామని ఎస్పీ చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఐపీఎస్‌ అఽధికారులు ఇంత అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదన్నారు. సీఎం జగనమోహనరెడ్డి పాలనలో వైఎస్‌ రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని అన్నారు. దళిత మహిళ హత్య జరిగితే ఆమె కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని తాము వెళ్లామన్నారు. ఆమె కుటుంబసభ్యులను బెదిరించి తమపై కేసులు పెట్టారన్నారు. తమపై కేసులు పెడుతున్న సమయాన్ని నష్టపోయిన రైతులకు కేటాయించి వారిని ఆదుకుంటే తాము ఎంతో సంతోషపడతామన్నారు. పులివెందుల నియోజకవర్గంలో అరటి, చీనీ, శెనగ రైతులు పూర్తిగా నష్టపోయారని, వారికి పరిహారం అందించకుండా కేవలం టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టేందుకే చూస్తున్నారన్నారు. ఎస్సీ ఎస్టీ కేసులను నీచాతినీచంగా వాడుకునే వ్యక్తి కేవలం జగనమోహనరెడ్డి ఆయన ప్రభుత్వమేనని ఆరోపించారు. మీ చిన్నాన్న అయిన వైఎస్‌ వివేకానందరెడ్డి కేసును సీబీఐకి అప్పగిస్తామని చెప్పారని, మొదట ఆ కేసును ఛేదించాలని డిమాండ్‌ చేశారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, తమకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, టీడీపీ అండ ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, పీరయ్య, బీటెక్‌ రవి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-18T05:30:00+05:30 IST