షర్మిల, విజయలక్ష్మి కన్నీటి పర్యంతం

ABN , First Publish Date - 2021-10-20T08:48:04+05:30 IST

తెలంగాణలో వైఎస్సార్‌ సంక్షేమ పాలన తీసుకురావడమే లక్ష్యమని వైఎస్‌ షర్మిల స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేందుకే పార్టీ స్థాపించానని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వారితో కలిసి ప్రభుత్వాన్ని నిలదీయడమే లక్ష్యంగా ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేపడుతున్నట్లు..

షర్మిల, విజయలక్ష్మి కన్నీటి పర్యంతం

  • వైఎస్‌ సమాధి వద్ద ఉద్విగ్న వాతావరణం 
  • వైఎస్సార్‌ సంక్షేమ పాలనే లక్ష్యం 
  • సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకే
  • ప్రజా ప్రస్థానం పాదయాత్ర: వైఎస్‌ షర్మిల 
  • ప్రజలు, అభిమానులు ఆశీర్వదించాలని విజ్ఞప్తి 
  • పాదయాత్ర ప్రారంభానికి ముందు వైఎస్‌ సమాధి వద్ద భావోద్వేగం


వేంపల్లె, అక్టోబరు 19: తెలంగాణలో వైఎస్సార్‌ సంక్షేమ పాలన తీసుకురావడమే లక్ష్యమని వైఎస్‌ షర్మిల స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేందుకే పార్టీ స్థాపించానని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వారితో కలిసి ప్రభుత్వాన్ని నిలదీయడమే లక్ష్యంగా ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని స్థాపించి వంద రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా తల్లి విజయలక్ష్మితో కలిసి ఆమె మంగళవారం ఇడుపులపాయ వైఎస్సార్‌ ఘాట్‌లో నివాళులు అర్పించారు. ఈ సమయంలో వారిద్దరూ భావోద్వేగానికి గురయ్యారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకొన్నారు. ప్రార్థన సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. తెలంగాణలో ఈ నెల 20 నుంచి పాదయాత్ర ప్రారంభించనున్న సందర్భంగా వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కడప జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ను మంగళవారం సందర్శించారు. షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. 20న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలుపెడుతున్నానని, తెలంగాణ ప్రజలు, వైఎస్సార్‌ అభిమానులు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.




వైఎస్సార్‌ సంక్షేమ పాలన అంటే రైతులకు ఉచిత విద్యుత్‌, జలయజ్ఞం, పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించడం, స్వయం ఉపాధి ద్వారా మహిళలను లక్షాధికారులను చేయడం, ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వడమే కాదు భర్తీ చేయడం, ప్రైవేట్‌ రంగంలో విరివిగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమన్నారు. ప్రజా సమస్యలను, కష్టాలను నేరుగా తెలుసుకునేందుకు తెలంగాణలోని ప్రతి పల్లెను, ప్రతి గడపను తట్టి, ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాన్ని నిలదీయడమే లక్ష్యంగా పాదయాత్ర చేపడుతున్నట్లు ప్రకటించారు. అనంతరం మధ్యాహ్నం 3గంటలకు ఇడుపులపాయ నుంచి రోడ్డుమార్గంలో కడప వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో వైఎస్‌ షర్మిల, విజయలక్ష్మి హైదరాబాద్‌కు వెళ్లారు.

Updated Date - 2021-10-20T08:48:04+05:30 IST