తెలంగాణ తాలిబాన్లు.. కేసీఆర్‌, కేటీఆర్‌!

ABN , First Publish Date - 2021-10-28T09:35:47+05:30 IST

తాలిబాన్ల చేతిలో అఫ్ఘానిస్థాన్‌లా.. కేసీఆర్‌ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిందని ..

తెలంగాణ తాలిబాన్లు.. కేసీఆర్‌, కేటీఆర్‌!

ఈ కుటుంబం చేతిలో బందీగా రాష్ట్రం

రైతులపై పెత్తనమేంటి?: షర్మిల 

ఇబ్రహీంపట్నం/ కందుకూరు/ మహేశ్వరం: తాలిబాన్ల చేతిలో అఫ్ఘానిస్థాన్‌లా.. కేసీఆర్‌ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిందని వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌లు తెలంగాణ తాలిబాన్లలా తయారయ్యారని, ఈ కుటుంబం నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర.. బుధవారం ఉదయం తిమ్మాపూర్‌ నుంచి మొదలై రాచులూరు, బేగంపేట, మాదాపూర్‌ల మీదుగా 12 కిలోమీటర్ల పాటు కొనసాగి.. సాయంత్రానికి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎలిమినేడుకు చేరుకుంది. ఇక్కడ జరిగిన ‘మాట-ముచ్చట’ కార్యక్రమంలో షర్మిల మాట్లాడారు. కేసీఆర్‌ పాలనలో రైతుకు స్వేచ్ఛ లేకుండా పోతోందన్నారు. ‘‘ఏ భూమిలో ఏ పంట వేసుకోవాలో రైతుకు తెలుసు. ఈ విషయంలో పాలకుల నిర్ణయమేంటి? ఇది రైతు స్వేచ్ఛను హరించడం కాదా? యాసంగిలో వరి సాగు చేయొద్దని ప్రభుత్వం చెప్పడం ఏంటి? ఏడేళ్ల కాలంలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 


రైతు ప్రభుత్వమని చెప్పుకునేవారు దీనికి ఏం సమాధానం చెబుతారు? ఇన్‌పుట్‌ సబ్సిడీలు లేవు. పంటలకు బీమా లేదు. యంత్రలక్ష్మి లేదు. మొత్తంగా వ్యవసాయ రంగాన్నే భారంగా మార్చేశారు’’ అని షర్మిల మండిపడ్డారు. కేసీఆర్‌ ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఒక్కటీ అమలు కాలేదని, ఏ ఒక్క మాటా నిలబెట్టుకోలేదని విమర్శించారు. ‘‘రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉంది. చిన్నారులపై హత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ దారుణాలకు సీఎం కేసీఆరేబాధ్యత వహించాలి’’ అని డిమాండ్‌ చేశారు.  చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తి చేసుకున్న షర్మిలకు.. టీఆర్‌ఎస్‌ నేత వేణుగోపాల్‌రెడ్డి, సుధారెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలు అందజేయడం గమనార్హం. 

Updated Date - 2021-10-28T09:35:47+05:30 IST