షర్మిల సంచలన వ్యూహం!

ABN , First Publish Date - 2021-02-25T23:59:41+05:30 IST

షర్మిల సంచలన వ్యూహం!

షర్మిల సంచలన వ్యూహం!

కథన రంగంలో యువనేతలు.. వ్యూహ రచనలో సీనియర్లు.. ఇదే మంత్రంతో తంత్రం నడపాలని షర్మిల చూస్తున్నారు. పార్టీ పెట్టకుండానే పార్టీ పెట్టినంత పని చేసిన షర్మిల తన అడుగులు కూడా అదే రేంజ్‌లో వేస్తున్నారు. తండ్రికి క్లోజ్‌గా ఉన్న సీనియర్ నేతలను ఒక్కొక్కరిని రంగంలోకి దింపబోతున్నారు. అప్పుడు ఓ వెలుగు వెలిగి ఇప్పుడు రాజకీయ చీకట్లో మగ్గిపోతున్నవారికి షర్మిల పార్టీ కొవ్వొత్తిలా కనిపిస్తోంది. అందుకే వారు సైతం వెంటనే స్పందిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో పని చేసిన ఓ కీలక మంత్రి, కాంగ్రెస్‌లో కీలక పదవి నిర్వహించిన ఆ వ్యక్తి షర్మిలకు జై కొట్టబోతున్నారు. అలాగే రెండు పార్టీలు మారి ఇప్పుడు మంచి మలుపు కోసం ఎదురు చూస్తున్న ఓ ఫైర్ బ్రాండ్ నేత సైతం అదే దారి పట్టబోతున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరు మాజీ మంత్రులు. 


వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఇప్పటికే పుట్టేసింది. నామకరణం ఒక్కటే పెండింగ్. కానీ అడుగులు మాత్రం వేగంగా పడుతున్నాయి. నామకరణం నాటికి షర్మిల అంతా పకడ్బందీగా సెట్ చేసుకున్నారు. ఇప్పటికే తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి పని చేసిన అధికారులను తన సలహామండలిలో చేర్చుకున్న షర్మిల.. నాన్నతో కలిసి పని చేసిన సీనియర్లపైనా దృష్టి సారించారు. పార్టీలోకి ఎక్కువగా యువతనే ఆహ్వానిస్తున్నా వ్యూహ రచనకు, సలహాలకు మాత్రం పెద్దలనే పిలుస్తున్నారు. అందులో భాగంగానే ఇద్దరు మాజీ మంత్రులతో చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. వారిద్దరూ కూడా పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నట్లు సమాచారం. 



అయితే ఎవరా ఇద్దరు అనే దానిపై మాత్రం తెలంగాణ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. ఒకరు వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, ఆయన వైఎస్ మంత్రి వర్గంలో కీలక శాఖను చూసిన మంత్రి. తర్వాత కాలంలో పార్టీలోనూ కీలక పదవి చేపట్టిన నేత. సీనియరే అయినా మాస్ ఫాలోయింగ్ లేక చతికిలా పడ్డారు. వ్యూహకర్తే అయినా బలగం లేక వెనుక బడ్డారు. మంచి ఛాయిస్ కోసం ఎదురు చూస్తున్న ఆయనకు షర్మిల పార్టీ అందివచ్చిన అవకాశంలా కనిపిస్తోంది. అందుకే ఓకే చెప్పేశారని అంటున్నారు. ఆయన ఎవరు అన్నది త్వరలోనే తెరపై చూడొచ్చు. 

Updated Date - 2021-02-25T23:59:41+05:30 IST