ఉద్రిక్తంగా షర్మిల దీక్ష

ABN , First Publish Date - 2021-04-16T10:59:09+05:30 IST

తెలంగాణలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిల తొలి నిరసన కార్యక్రమం తీవ్ర

ఉద్రిక్తంగా షర్మిల దీక్ష

సాయంత్రం వరకే అనుమతి

తర్వాత పాదయాత్రగా ముందుకు

అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం

ఇరుపక్షాల మధ్య తోపులాట

సొమ్మసిల్లిన షర్మిల... చేతికి గాయం

ఇంట్లోనే దీక్ష కొనసాగిస్తున్న షర్మిల

తల్లి, వివేకా కుమార్తె సంఘీభావం


కవాడిగూడ, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిల తొలి నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు, అభిమానుల మధ్య జరిగిన తోపులాటలో ఆమె ఒక దశలో సొమ్మసిల్లి పడిపోయారు. ఆమె చేతికి గాయం కూడా అయ్యింది. ఉద్యోగాల భర్తీ చేపట్టాలంటూ గురువారం ఇందిరా పార్కు సమీపంలోని ధర్నా చౌక్‌ వద్ద ఆమె ‘ఉద్యోగ దీక్ష’ పేరిట నిరశనకు దిగారు. మూడు రోజులు నిరాహార దీక్ష చేపడతామని ఖమ్మం సభలో ప్రకటించినప్పటికీ... పోలీసులు గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు.


‘‘72 గంటల పాటు దీక్ష చేస్తానని మాట ఇచ్చాం. దానిని నిలబెట్టుకుంటాను. కేసీఆర్‌ దొరగారికి సవాల్‌ విసురుతున్నా! ఇక్కడ నుంచి పోలీసులు ఠాణాకు తరలించినా... లోట్‌సపాండ్‌కు తీసుకెళ్లినా మూడు రోజులపాటు దీక్ష చేస్తా’’ అని షర్మిల ప్రకటించారు. సాయంత్రం 5 గంటలుకాగానే... ఇక నిరశన ముగించాలని పోలీసులు కోరారు. ఇందిరాపార్కు చౌరస్తా వరకు పాదయాత్రగా వెళ్లి... అక్కడి నుంచి వాహనాలలో లోట్‌సపాండ్‌కు వెళ్లి దీక్ష కొనసాగిస్తానని షర్మిల చెప్పారు. అందుకు పోలీసులు సరే అన్నారు. 5.45 గంటలకు వందలాది మందితో షర్మిల పాదయాత్రగా బయలుదేరారు. ఇందిరాపార్కు చౌరస్తా వద్ద ఆగి వాహనంలో లోట్‌సపాండ్‌కు వెళ్లాల్సినప్పటికీ... అలాగే పాదయాత్రను కొనసాగించారు. పాదయాత్ర తెలుగుతల్లి ఫ్లైఓవర్‌పై బూర్గుల రామకృష్ణ భవన్‌ వద్దకు రాగానే పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.


ఒకదశలో షర్మిల సొమ్మసిల్లి పడిపోతుండగా అక్కడే ఉన్న మహిళా పోలీసులు, కార్యకర్తలు ఆమెను పట్టుకుని నీళ్లు తాగించారు. చివరికి... పోలీసులు షర్మిలను లోట్‌సపాండ్‌లోని ఆమె నివాసానికి తీసుకెళ్లారు. వైద్యులు వచ్చి ఆమెను పరీక్షించారు. చేతికి గాయమైనట్లు తెలిపారు. కుడిచేతికి పట్టీ కట్టారు. తన నివాసంలోనే 72 గంటలు దీక్ష కొనసాగిస్తానని షర్మిల తేల్చి చెప్పారు. తల్లి విజయలక్ష్మితో పాటు బాబాయి  వైఎస్‌ వివేకా కూమార్తె డాక్టర్‌ సునీత రాత్రి పది గంటల వరకు అక్కడే ఉంది. ఆమెకు సంఘీభావం ప్రకటించారు. 



‘సాక్షి’కి చురకలు

తన సోదరుడు వైఎస్‌ జగన్‌ సొంత చానల్‌ ‘సాక్షి’కి షర్మిల చురకలు అంటించారు. వేదికపై ఉన్న వైఎస్‌ విజయలక్ష్మి కనిపించడంలేదంటూ అభిమానులు చెప్పడంతో... కెమెరాలను పక్కన పెట్టాలని టీవీ చానళ్ల ప్రతినిధులకు షర్మిల సూచించారు. అక్కడే ఉన్న ఒక విలేఖరి...‘మాది సాక్షి చానల్‌’ అని చెప్పారు. ‘‘కవరేజీ చాలమ్మా! మీ సాక్షిలో ఎలాగూ మాకు కవరేజీ ఇవ్వరుకదా’’ అని షర్మిల చురకలు అంటించారు. పక్కనే ఉన్న విజయలక్ష్మి నవ్వతూనే తన చేతితో షర్మిలను తట్టి... అలా మాట్లాడొద్దు అన్నట్లుగా వారించారు. ‘ఉద్యోగ దీక్ష’కు బీసీ నాయకుడు ఆర్‌.కృష్ణయ్య, కంచ ఐలయ్య తదితరులు హాజరై సంఘీభావం ప్రకటించారు. 

Updated Date - 2021-04-16T10:59:09+05:30 IST