నిరుద్యోగి సాగర్ ఆత్మహత్య బాధాకరం: షర్మిల

ABN , First Publish Date - 2022-01-26T17:10:31+05:30 IST

నిరుద్యోగ యువకుడు సాగర్ ఆత్మహత్య చాలా బాధాకరమని వైఎస్ షర్మిల అన్నారు.

నిరుద్యోగి సాగర్ ఆత్మహత్య బాధాకరం: షర్మిల

హైదారబాద్: నోటిఫికేషన్లు పడటం లేదని నిరుపేద కుటుంబానికి చెందిన నిరుద్యోగ యువకుడు సాగర్ ఆత్మహత్య చాలా బాధాకరమని వైఎస్ షర్మిల అన్నారు. బుధవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగాలు రాక ఎంతోమంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అని హామీలిచ్చి పాలకులు విస్మరించారని ఆరోపించారు. ఎంతమంది చనిపోతున్నా పాలకుల్లో చలనం లేదని మండిపడ్డారు. నిరుద్యోగ యువత ఆత్మహత్యలపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.


‘ఇగ నోటిఫికేషన్‌ రావు. పిచ్చి లేస్తోంది’ అంటూ ఓ వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టాడు. అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ‘కరోనా ప్లస్‌ కేసీఆరే కారణం’ అని అంతకుముందు మరో స్టేటస్‌ పెట్టాడు. ఖమ్మం నగరంలో ఈ విషాదం జరిగింది.  రైలు పట్టాలపై తల, మొండెం వేరువడి మృతదేహం పడివుండటాన్ని చూసినవారంతా చలించిపోయారు. చెట్టంత ఎదిగిన కొడుకు బలవన్మరణానికి పాల్పడటం తో హమాలీ పనిచేసి కుటుంబాన్ని పోషిస్తున్న తండ్రి గుండెలవిసేలా రోదించాడు. మృతుడు.. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారానికి చెందిన ముత్యాల సాగర్‌ (23). తల్లిదండ్రులు ముత్యాల భద్రయ్య-కళమ్మ. సాగర్‌, ఖమ్మంలోనే డిగ్రీ పూర్తి చేశాడు. ఎన్‌సీసీలో సీ సర్టిఫికెట్‌ పొంది ఉండటంతో పోలీసు ఎస్సై కావాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఖమ్మంలో ఓ గది అద్దెకు తీసుకొని పార్ట్‌టైం ఉద్యోగాలు చేసుకుంటూనే  ప్రైవేటు స్టడీ సెంటర్‌లో ఎస్సై ఉద్యోగం కోసం కోచింగ్‌ తీసుకుంటున్నాడు. ఉద్యోగ నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేయకపోవడతో ఆవేదన చెందాడు. కరోనా పరిస్థితుల్లో తాను ఎస్సై ఉద్యోగం సాధించాలన్న కల తీరదేమోనని కలత చెందాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున తన వాట్సాప్‌ స్టేట్‌సలో రెండు మెసేజ్‌లు పెట్టాడు. అనంతరం ఖమ్మంలోని మామిళ్లగూడెం సమీపంలోని రైల్వే ట్రాక్‌ వద్ద రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. 

Updated Date - 2022-01-26T17:10:31+05:30 IST