అవి ఆత్మహత్యలు కావు.. కేసీఆర్ హత్యలు: షర్మిల

ABN , First Publish Date - 2021-09-01T00:42:37+05:30 IST

సిద్దిపేట : ఉద్యోగాలు రాక వందలాది మంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. అవన్నీ కేసీఆర్ హత్యలే అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఉద్యోగం రాలేదనే కారణంతో గజ్వేల్

అవి ఆత్మహత్యలు కావు.. కేసీఆర్ హత్యలు: షర్మిల

సిద్దిపేట : ఉద్యోగాలు రాక వందలాది మంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. అవన్నీ కేసీఆర్ హత్యలే అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఉద్యోగం రాలేదనే కారణంతో గజ్వేల్ నియోజకవర్గం ఆనంతరావుపల్లిలో ఆత్మహత్య చేసుకున్న కొప్పు రాజు కుటుంబాన్ని మంగళవారం షర్మిల పరామర్శించారు. అనంతరం ప్రజ్ఞాపూర్ శివారులోని గుండన్నపల్లి గ్రామంలో ఒక రోజు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యమంలో పాల్గొన్న కొప్పు రాజు.. ప్రస్తుతం ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ఐదేళ్ల వైఎస్సార్ పాలనలో రైతులు రాజులు కావాలనుకున్నారని చెప్పారు. తాలిబన్ల చేతుల్లో ఆఫ్గాన్‌లు చిక్కుకున్నట్లు.. ఏడేళ్లుగా తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల వారి చేతుల్లో చిక్కుకుని, ఆగమౌతున్నారని తెలిపారు.


 హుజురాబాద్ ఎన్నికల్లో నిరుద్యోగులంతా నామినేషన్లు వేయాలని.. వారికి వైఎస్సార్ టీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇంటికో ఉద్యోగం.. లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్న కేసీఆర్.. మాట నిలబెట్టుకోవాలన్నారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో నిరుద్యోగుల శాతం నాలుగింతలు పెరిగిందని చెప్పారు. 12వందల మంది విద్యార్థుల బలిదానాలతో తెలంగాణ వచ్చిందన్నారు. బంగారు తెలంగాణ అంటూ.. అప్పులు, చావుల తెలంగాణగా మార్చారని దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో దళితులపై 800 శాతం దాడులు పెరిగాయని తెలిపారు. హుజురాబాద్‌లో ఎన్నికలు రాగానే.. కేసీఆర్‌కు దళితులు బంధువులయ్యారని ఎద్దేవా చేశారు. దళితులకు దళితబంధు ఇవ్వడానికి.. ప్రభుత్వ భూములు అమ్మారని చెప్పారు. ఇప్పుడు పేదలకు పేద బంధు ఇవ్వడానికి ఏం అమ్ముతారని షర్మిల ప్రశ్నించారు.

Updated Date - 2021-09-01T00:42:37+05:30 IST