ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే వరకు పోరాడతా

ABN , First Publish Date - 2021-04-19T09:33:57+05:30 IST

ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు ఇవ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరుద్యోగులను బలి తీసుకుంటున్నారని వైఎస్‌ షర్మిల ఆరోపించారు.

ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే వరకు పోరాడతా

కేసీఆర్‌ మెడలు వంచైనా కొలువులు భర్తీ చేయిస్తా

రెండేళ్లలో మాదే అధికారం.. లక్షల్లో ఉద్యోగాలు సృష్టిస్తాం

లోట్‌సపాండ్‌లో ఉద్యోగ దీక్ష విరమించిన షర్మిల 


హైదరాబాద్‌/జగదేవ్‌పూర్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు ఇవ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరుద్యోగులను బలి తీసుకుంటున్నారని వైఎస్‌ షర్మిల ఆరోపించారు. నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేని విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలనే డిమాండ్‌తో షర్మిల గురువారం 72 గంటల ఉద్యోగ దీక్షను చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబ సభ్యుల సమక్షంలో ఆదివారం లోట్‌సపాండ్‌లో ఆమె నిమ్మ రసం తీసుకుని దీక్షను విరమించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడారు. ఏడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయడం లేదన్నారు. లక్షల్లో ప్రైవేటు ఉద్యోగాలు కల్పించే సత్తా కేసీఆర్‌కు లేదన్నారు. గడీల నుంచి దొరలు పాలిస్తుంటే ప్రతిపక్షాలు గాజులేసుకుని వత్తాసు పలుకుతున్నాయని విమర్శించారు.


నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకుని ఒక మహిళ నిలబడిందని, పోలీసుల భుజాల మీద గన్నుపెట్టి తమను టార్గెట్‌ చేశారని ఆరోపించారు. పాలకులకు ఎందుకంత భయమని షర్మిల ప్రశ్నించారు. ‘‘మా ఫిర్యాదు సైతం తీసుకోలేని స్థితిలో పోలీసులున్నారు. లా అండ్‌ ఆర్డర్‌ కాపాడేందుకు ఉన్నారా..? కేసీఆర్‌ ఆజ్ఞలను అమలు చేసేందుకు జీతాలు తీసుకుంటున్నారా..? ఆడోళ్ల మీదా మీ ప్రతాపం..? పాలకులు, పోలీసులకు సిగ్గుండాలి. పాలకుల అహంకారంపై మహిళా లోకం ఉమ్మేస్తుంది. తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌పై పోలీసులు మా బట్టలు లాగారు. నా చేయి విరిచారు. ఒక తమ్ముడి కాలు విరగ్గొటారు. యూనివర్సిటీల్లో వీసీలు సైతం లేరు. 3.85 లక్షల ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదు. ప్రైవేటు ఉద్యోగాలు కూడా రాక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.


ఆత్మహత్య చేసుకున్న రవీంద్రనాయక్‌ పిల్లలను చూస్తే ఏ ఒక్కరికైనా కన్నీరు రాకుండా ఉంటుందా..? పాలకులది గుండెనా..? బండరాయా..? ఎందుకు దీక్ష చేయాల్సి వచ్చిందో అర్థం చేసుకోవాలి. రాజన్న బిడ్డగా చెప్తున్నా.. నోటిఫికేషన్లు వచ్చే వరకు పోరాడుతా.. కేసీఆర్‌ మెడలు వంచైనా ఉద్యోగాలు భర్తీ చేయిస్తా.. నేను దీక్ష విరమించినప్పటికీ ప్రతి జిల్లాలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయి. రెండేళ్లలో మన ప్రభుత్వం వస్తుంది. ఏ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకోవద్దు. లక్షల్లో ప్రైవేట్‌ ఉద్యోగాలను సృష్టిస్తాం. నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తాం’’ అని షర్మిల అన్నారు. 

Updated Date - 2021-04-19T09:33:57+05:30 IST