రైతు వంచన ప్రభుత్వం నడుస్తోంది!

ABN , First Publish Date - 2020-07-09T15:02:28+05:30 IST

దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని వైసీపీ ప్రభుత్వం రైతుదినోత్సవంగా ..

రైతు వంచన ప్రభుత్వం నడుస్తోంది!

రైతుల పంటలు కొనే నాథుడే కరవయ్యాడు

టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని వైసీపీ ప్రభుత్వం రైతుదినోత్సవంగా జరపటాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు తప్పుబట్టారు. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు దినోత్సవం జరిపే నైతిక హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదన్నారు. రైతులను అనేక రూపాల్లో సీఎం జగన్‌ మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా పసుపు, జొన్న, మొక్కజొన్న పంటలు కొనుగోలు చేశారని... నాలుగు నెలలు దాటినా రైతులకు డబ్బులు చెల్లించలేదని ఆరోపించారు.


మిర్చి విత్తనాలు కేజీ రూ.లక్షకి కొనుగోలు చేసే పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. కరోనా కారణంతో బ్యాంకులు పూర్తిస్థాయిలో పనిచేయటం లేదని, దీంతో రైతులకు క్రాప్‌లోన్లు, ఇతర రుణాలు అందటం లేదన్నారు. మిర్చి, పసుపు ఇతర పంటలను అమ్ముకునే పరిస్థితి లేదన్నారు. రైతు భరోసా కేంద్రాల వద్ద వైఎస్‌, జగన్‌ ఫొటోల హడావుడి, ఆర్భాటాలు తప్ప రైతులకు చేసిందేమిటని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం రైతులకు ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. పథకాల పేర్లు మార్చి ప్రచారాలు తప్ప వైసీపీ ప్రభుత్వం రైతులకు చేసిందేమీలేదని దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని జీవీ సవాలు విసిరారు.


మిర్చి యార్డు మాజీ చైర్మన్‌ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ న్యాయస్థానాల పట్ల జగన్‌ ప్రభుత్వానికి గౌరవం లేదన్నారు. సుప్రీంకోర్టు ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు తొలగించమని ఆదేశించినా రైతు భరోసా కేంద్రాలకు రంగులు తొలగించకపోవటమేంటని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో నేతలు ఎం.ధారునాయక్‌, షేక్‌ లాల్‌వజీర్‌, బొబ్బిలి రామారావు, షేక్‌ చిన్నబాజి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-09T15:02:28+05:30 IST