పరిశ్రమలకు ప్రోత్సాహకాలు విడుదల చేసిన YS Jagan

ABN , First Publish Date - 2021-09-03T19:00:40+05:30 IST

చిన్నతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు నేడు శ్రీకారం చుట్టామన్నారు...

పరిశ్రమలకు ప్రోత్సాహకాలు విడుదల చేసిన YS Jagan

అమరావతి : ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్, టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. శుక్రవారం నాడు సీఎం కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఎంఎస్‌ఎంఈలకు రూ.440 కోట్లు, టెక్స్‌టైల్‌కు రూ.684 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేశారు. చిన్నతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు నేడు శ్రీకారం చుట్టామన్నారు. 97,423 మంది పారిశ్రామిక వేత్తలు ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటు చేశామన్నారు. 


త్వరలో మరో 62 భారీ, మెగా ప్రాజెక్టులు..!

పరిశ్రమల ఏర్పాటు ద్వారా 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా అడుగులు వేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 62 %, మహిళలకు 42 % ప్రోత్సాహకాలు అందించామని.. పరిశ్రమల్లో 75 % ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం కూడా చేశామన్న విషయాన్ని ఈ సందర్భంగా జగన్ గుర్తు చేశారు. ఈ రెండున్నరేళ్లలో 68 భారీ, మెగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయని.. త్వరలో మరో 62 భారీ, మెగా ప్రాజెక్టులు ప్రారంభమవుతాయని సీఎం స్పష్టం చేశారు. అంతేకాకుండా.. భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నంలో గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మరో 9 కొత్త ఫిషింగ్‌ హార్బర్‌లను ఏర్పాటు చేయబోతున్నట్లు ఈ సందర్భంగా జగన్ స్పష్టం చేశారు.


చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం..!

చిన్నతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు శ్రీకారం చుట్టాం. 97,423 మంది పారిశ్రామిక వేత్తలు ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కల్పిస్తున్నాం. పరిశ్రమలు తెచ్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇస్తుందన్న నమ్మకం కలిగించాలి. గత ప్రభుత్వాలు పెట్టిన బకాయిలు రూ. 1,588 కోట్లను చెల్లించాం. ఇప్పటి వరకూ రూ. 2,086 కోట్లు ప్రోత్సాహకాలు అందించాం. పారిశ్రామిక రంగానికి కావాల్సిన విద్యుత్ ఉత్తత్తిపై ప్రత్యేక దృష్టిపెట్టాం. పారిశ్రామిక విధానంలో భాగంగా జగనన్న బడుగు వికాస్ పథకాన్ని తీసుకొచ్చాం. మా సంక్షేమ పథకాలతో జనంలో కొనుగోలు శక్తి పెరిగింది. కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలను ఆపలేదు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోందిఅని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. కాగా.. ఈ కార్యక్రమానికి మంత్రులు గౌతమ్ రెడ్డి, శంకర నారాయణ సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Updated Date - 2021-09-03T19:00:40+05:30 IST