YS JAGAN పేరు చెప్పి రూ.45 లక్షలకు కుచ్చుటోపి

ABN , First Publish Date - 2021-10-25T06:12:07+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహనరెడ్డితోపాటు కుటుంబసభ్యులు తనకు అత్యంత సన్నిహితులు అని చెప్పి శ్రీవిద్య సేవా ట్రస్ట్‌ పీఠాధిపతి నరసింహస్వామి శిష్యుడు మోహనరెడ్డి ఘరానా మోసానికి తెగబడ్డాడు.

YS JAGAN పేరు చెప్పి రూ.45 లక్షలకు కుచ్చుటోపి

తాడిపత్రి, అక్టోబరు 24: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహనరెడ్డితోపాటు కుటుంబసభ్యులు తనకు అత్యంత సన్నిహితులు అని చెప్పి శ్రీవిద్య సేవా ట్రస్ట్‌ పీఠాధిపతి నరసింహస్వామి శిష్యుడు మోహన్‌రెడ్డి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. సీఎం జగన్‌తో కలిసి ఉన్న ఫొటోలతో నమ్మించి ఏకంగా రూ.45 లక్షలకు కుచ్చుటోపీ పెట్టాడు. మోసగాడు మోహన్‌రెడ్డిపై బాధితురాలు తులసమ్మ ఆదివారం రూరల్‌ సీఐ చిన్నపెద్దయ్యకు ఫిర్యాదు చేశారు.

మూడేళ్ల క్రితం తులసమ్మ దుబాయ్‌ నుంచి విమానంలో నాలుగు కిలోల బంగారాన్ని తీసుకువస్తూ బెంగళూరు ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులకు పట్టుబడింది. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు తులసమ్మపై కేసు నమోదుచేసి కోర్టుకు హాజరుపరిచారు. తదనంతరం పట్టుబడ్డ బంగారాన్ని విడిపించుకొనేందుకు పలురకాల ప్రయత్నాలు చేసింది. కొన్నిరోజుల క్రితం యూట్యూబ్‌ ఛానల్‌లో అనంతపురంలోని శ్రీవిద్య సేవా ట్రస్ట్‌ పీఠాధిపతి సద్గురు నరసింహస్వామి గురించి తెలుసుకున్న తులసమ్మ ఆయనను ఆశ్రయించి తన పరిస్థితిని వివరించింది.


తన శిష్యుడైన కడపజిల్లా పులివెందుల మండలం ఆవలాంపల్లికి చెందిన మోహన్‌రెడ్డికి సీఎం వైఎస్‌ జగన్ కుటుంబసభ్యులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్న బంగారాన్ని విడిపిస్తాడని పీఠాధిపతి చెప్పాడు. ఆయన సూచనల మేరకు అత్తగారి ఊరు అయిన బోడాయిపల్లిలో ఉంటున్న మోహన్‌రెడ్డిని కలుసుకొని పరిస్థితిని వివరించింది. కస్టమ్స్‌ వద్ద ఉన్న బంగారాన్ని విడిపించడం చిటికెలో పని అని మాయమాటలు చెప్పాడు. అందుకు అయ్యే ఖర్చు రూ.45 లక్షలను అకౌంట్‌లో వేయించుకొని తిరిగేందుకు కారు కూడా తీసుకున్నాడు. రోజులు గడుస్తున్నా కస్టమ్స్‌ నుంచి బంగారాన్ని విడిపించడంలో జాప్యం చేయడంతోపాటు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో మోసపోయానని తెలుసుకున్న ఆమె బోడాయిపల్లిలోని మోహన్‌రెడ్డి అత్తగారింటికి వచ్చి బోరున విలపిస్తూ నిరసన వ్యక్తం చేసింది. విషయం తెలుసుకున్న రూరల్‌ సీఐ చిన్నపెద్దయ్య బోడాయిపల్లికి వెళ్లి తులసమ్మతో మాట్లాడారు. సీఐ సూచనమేరకు బాధితురాలు తులసమ్మ అనంతపురం వెళ్లి నిందితునిపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

Updated Date - 2021-10-25T06:12:07+05:30 IST