మాట మారింది!

ABN , First Publish Date - 2022-05-18T08:08:48+05:30 IST

‘‘పర్యావరణహిత విద్యుత్తుకు పెద్దపీట వేస్తాం. దేశంలో ఎక్కడాలేని విధంగా రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తాం!

మాట మారింది!

‘గ్రీన్‌కో’ ఐఆర్‌ఈపీపై ముఖ్యమంత్రి జగన్‌ తీరు

కర్నూలు జిల్లాలో అతి భారీ విద్యుత్‌ ప్రాజెక్టు

ఒకేచోట సౌర, పవన, జల విద్యుదుత్పత్తి

రూ.30వేల కోట్లతో చేపట్టిన గ్రీన్‌కో సంస్థ

చంద్రబాబు హయాంలోనే కుదిరిన ఒప్పందం

భూముల కేటాయింపు, పనులు కూడా ప్రారంభం

అధికారంలోకి రాగానే గ్రీన్‌కోపై జగన్‌ విమర్శలు

ఐఆర్‌ఈపీపై నీలి నీడలు.. నెమ్మదించిన పనులు

ఆ తర్వాత అదే ప్రాజెక్టుకు కేబినెట్‌ ఆమోదం

ఇప్పుడు కాంక్రీట్‌ పనులు ప్రారంభించిన జగన్‌


నాడు: ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు అడ్డంకులు

నేడు: కాంక్రీట్‌ పనులుప్రారంభించి అభినందనలు


(కర్నూలు/అమరావతి - ఆంధ్రజ్యోతి):‘‘పర్యావరణహిత విద్యుత్తుకు పెద్దపీట వేస్తాం. దేశంలో ఎక్కడాలేని విధంగా రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తాం!’’... ఇవి ముఖ్యమంత్రి జగన్‌ చెప్పిన మాటలు! మంగళవారం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో ‘గ్రీన్‌కో’ సంస్థ నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ప్రాజెక్టు కాంక్రీట్‌ పనులు ప్రారంభిస్తూ పలికిన


 పలుకులు! ఇదే ముఖ్యమంత్రి జగన్‌ అధికారంలోకి వచ్చీ రాగానే... పర్యావరణహిత విద్యుత్తులో కీలకమైన పవన, సౌర విద్యుత్తు కంపెనీలపై విరుచుకుపడ్డారు. సౌర, పవన విద్యుత్తు విషయంలో టీడీపీ హయాంలో అక్రమాలు జరిగాయని, గ్రీన్‌కో, రెన్యూ, మిత్రా అనే మూడు కంపెనీలకే సోలార్‌ పవర్‌ ప్లాంట్లు కట్టబెట్టారని చెప్పారు.  ఇప్పుడు అదే గ్రీన్‌కో కంపెనీ ప్రాజెక్టును ‘అద్భుతం... అసామాన్యం’ అని పొగిడారు. అప్పుడు వద్దన్న కంపెనీ ఇప్పుడు ఎందుకు ముద్దొచ్చింది? మధ్యలో ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. 


టీడీపీ హయాంలో మొదలై...

ఒకేచోట పవన విద్యుత్తు, సౌర విద్యుత్తు, జల విద్యుత్తు ఉత్పత్తి! మొత్తం 5230 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యం! ప్రపంచంలోనే అతిపెద్ద ‘సమీకృత పునరుత్పాదక విద్యుదుత్పత్తి (ఐఆర్‌ఈపీ) కేంద్రమిది! పర్యావరణహిత విద్యుదుత్పత్తిలో పేరెన్నికగన్న గ్రీన్‌కో చేపట్టిన ప్రాజెక్టు ఇది. రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమలోని కర్నూలు జిల్లాను ‘పవర్‌ సెంటర్‌’గా మార్చాలని టీడీపీ సర్కారు భావించింది. అందులో భాగంగానే... గ్రీన్‌కో ఏకంగా రూ.30వేల కోట్ల పెట్టుబడులతో ఐఆర్‌ఈపీ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టును 2018లో అప్పటి సీఎం చంద్రబాబు ప్రభుత్వం ముందుంచింది. పునరుత్పాదక విద్యుదుత్పత్తికి పెద్దపీట వేయాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా... గ్రీన్‌కో ప్రతిపాదనలకు బాబు సర్కారు ‘గ్రీన్‌ సిగ్నల్‌’ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 4,766.28 ఎకరాల భూములను ఓర్వకల్లు మండలం ఉశేనాపురం, కాల్వ, బ్రాహ్మణపల్లి, గుమ్మటంతండా, పాణ్యం మండలం పిన్నాపురం గ్రామాల్లో కేటాయించింది. ఎకరా ధరను రూ.2.50 లక్షలుగా నిర్ణయించారు. కీలకమైన పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌ ఉత్పత్తికి అవసరమైన 2.50 టీఎంసీల నీటిని గోరుకల్లు రిజర్వాయరు నుంచి కేటాయించారు. కేంద్రం నుంచి అన్నిరకాల అనుమతులు లభించాయి. గ్రీన్‌కో సంస్థ పనులను కూడా ప్రారంభించింది. 2019లో ఈ ప్రాజెక్టు పనులకు చంద్రబాబు లాంఛనంగా శంకుస్థాపన చేయాల్సి ఉండగా... అప్పుడే ఎన్నికల హడావుడి మొదలైంది. షెడ్యూలు కూడా విడుదలైంది. కానీ... అప్పటికే భూ కేటాయింపు పూర్తయి, అనుమతులన్నీ రావడంతో గ్రీన్‌కో సంస్థ ప్రాజెక్టు పనులను మొదలుపెట్టింది.


జగన్‌ అధికారంలోకి రాగానే... 

ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం 2019 మే 30న జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వచ్చీ రాగానే సౌర, పవన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) రద్దు చేశారు. అసెంబ్లీలో పెద్ద స్ర్కీన్‌ మీద లెక్కలు ప్రదర్శిస్తూ... చంద్రబాబు హయాంలో అక్రమాలు జరిగాయన్నారు. ‘గ్రీన్‌కో’ సోలార్‌ప్లాంట్ల పైనా విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాలతో గ్రీన్‌కో సంస్థ డోలాయమానంలో పడింది. కర్నూలు జిల్లాలో చేపట్టిన ఐఆర్‌ఈపీపై నీలి నీడలు అలుముకున్నాయి. పనులు నెమ్మదించాయి. ఒక దశలో మొత్తం ప్రాజెక్టునే నిలిపివేయాలని గ్రీన్‌కో భావించినట్లు కూడా చెబుతారు. కానీ... అప్పటికే రూ.వెయ్యి కోట్ల విలువైన పనులు చేయడంతో ముందుకే వెళ్లాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వ పెద్దలతో సమస్యలు ‘సామరస్యపూర్వకం’గా పరిష్కరించుకునే దిశగా అడుగులు పడ్డాయి. చంద్రబాబు హయాంలో ఎకరం విలువ రూ.2.50 లక్షలకు కేటాయించగా... జగన్‌ సర్కారు దానిని రూ.5లక్షలకు పెంచింది. ఇలా మరికొన్ని మార్పులతో... 2020లో ఈ ప్రాజెక్టుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత గ్రీన్‌కో సంస్థ తిరిగి పనుల్లో వేగం పెంచింది. మధ్యలో సుమారు 9 నెలలపాటు అనిశ్చితి లేకపోతే... ఈ పాటికి ప్రాజెక్టు తొలిదశ దాదాపుగా పూర్తయ్యేది. విద్యుత్తు కూడా అందుబాటులోకి వచ్చేది. ఐఆర్‌ఈపీపై గ్రీన్‌కో సంస్థ ఇప్పటికి 5వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. నిర్మాణ దశలో 15వేల మందికి ఉపాధి లభిస్తోంది. 2023 ఆఖరులోగా తొలిదశ పూర్తి చేసి, విద్యుదుత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రాజెక్టువెనుక ఇంత కథ జరగ్గా... ఇదంతా తమ ఘనతే అనేలా ముఖ్యమంత్రి జగన్‌ గొప్పలు చెప్పుకోవడం గమనార్హం.


ఇదీ ప్రాజెక్టు..

ఎక్కడ:   కర్నూలు జిల్లా ఓర్వకల్లు, పాణ్యం మండలాల పరిధిలో... 

4766 ఎకరాల పరిధిలో.


ప్రత్యేకత:   ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సమీకృత పర్యావరణ హిత విద్యుదుత్పత్తి ప్రాజెక్టు! కార్బన్‌ డయాక్సైడ్‌ ఏమాత్రం వెలువడకుండా 5230 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది.


ఏది ఎంత:  3 వేల మెగావాట్లు సోలార్‌, 550 మెగావాట్లు పవన విద్యుత్తు, 1680 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి చేస్తారు. నీటిని స్టోరేజ్‌ హౌస్‌లోకి పంపి... అక్కడి నుంచి పైపుల ద్వారా కిందికి వదులుతూ జల విద్యుదుత్పత్తి చేస్తారు.


ఎప్పుడు మొదలైంది:   చంద్రబాబు హయాంలో ప్రాజెక్టుకు అనుమతి. అప్పుడే పనులు ప్రారంభం.

ఇప్పటిదాకా ఏం జరిగింది:   సుమారు రూ.5వేల కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. మంగళవారం కాంక్రీట్‌ పనులను జగన్‌ ప్రారంభించారు. 

Updated Date - 2022-05-18T08:08:48+05:30 IST